ఒకప్పుడు తక్కువగా చూశారు! కానీ ఇప్పుడు కావాలంటున్నారు.. ఆఫ్‌రోడ్ కారుకి అకస్మాత్తుగా డిమాండ్ పెరిగింది
మారుతీ సుజుకీ (Maruti Suzuki) జిమ్నీ (Jimny) ఇటీవల భారత SUV మార్కెట్‌లో మరోసారి తన డిమాండ్‌ను ప్రదర్శించింది. గత కొన్ని నెలలుగా జిమ్నీ అమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయని అనుమానాలు ఉన్నా, మే 2025లో జరిగిన సేల్స్ పర్ఫార్మెన్స్ ఈ ఊహాగానాలను పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఈ మినీ ఆఫ్‌రోడ్ SUV, దేశీయంగా మహీంద్రా థార్ రాక్స్, ఫోర్స్ గూర్ఖా వంటి బలమైన పోటీదారులను ఎదుర్కొంటున్నప్పటికీ, జిమ్నీ కారు మే నెలలో 682 యూనిట్ల అమ్మకాలతో మార్కెట్లో తన స్థిరతను చాటింది. ఇది తక్కువగా అనిపించవచ్చు కానీ గత ఏడాది ఇదే నెలలో అంటే మే 2024లో కేవలం 274 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దాంతో పోలిస్తే అమ్మకాల్లో 148 శాతం వృద్ధి జరగడం గమనార్హం.
వినియోగదారులలో నమ్మకం, SUV ప్రీమియం స్టైలింగ్, మల్టీ టెరైన్ కేపబిలిటీ వంటివే కాకుండా, తాజా ప్రమోషన్లు, డీలర్ లెవెల్ డిస్కౌంట్లు కూడా ఈ పుంజుకొనే అమ్మకాలలో భాగంగా ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, జిమ్నీ తాజా అమ్మకాల ఫలితాలు కంపెనీకి ఊపును అందించడమే కాకుండా, ఈ కారు మరోసారి మార్కెట్లో తన ప్రాధాన్యతను నిలబెట్టుకున్నదని స్పష్టం చేస్తోంది.

ఈ సంవత్సరం తొలి నాలుగు నెలల్లో మారుతీ సుజుకీ జిమ్నీ SUV ఒక రోలర్‌కోస్టర్ లాంటి అమ్మకాల ప్రయాణాన్ని ఎదుర్కొంది. జనవరి 2025 లో కేవలం 163 యూనిట్ల అమ్మకాలతో ప్రారంభమైన ఈ స్మాల్ ఆఫ్‌రోడ్ SUV, ఫిబ్రవరిలో 385 యూనిట్ల వరకు పెరిగింది. అయితే మార్చిలో ఆ సంఖ్య 261కి తగ్గింది. ఏప్రిల్‌లో మాత్రం మళ్లీ కొంత స్థిరత సాధించి 431 యూనిట్ల అమ్మకాల వరకు చేరింది.
ఈ హెచ్చు తగ్గుల మధ్య, జిమ్నీ మార్కెట్లో పోటీతో తలపడుతూనే తన ఉనికిని నిలబెట్టుకుంది. ముఖ్యంగా థార్, గూర్ఖా వంటి బలమైన ప్రత్యర్థుల మధ్య జిమ్నీ స్థిరంగా అమ్ముడవుతుండటం గమనార్హం. జిమ్నీ అమ్మకాలు మళ్లీ బలపడేందుకు ప్రధానంగా రెండు కారణాలు కీలకంగా నిలిచాయి. మొదటిది.. మారుతీ అందిస్తున్న ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీ డీలర్ స్థాయిలో ప్రత్యేక ఆఫర్లు, క్యాష్ తగ్గింపు, ఎక్స్చేంజ్ బోనస్‌లు.

ఇది SUVపై ఓ వాల్యూ ఫర్ మనీ ఇమేజ్‌ను కలిగించడంలో సహాయపడింది. రెండవది, జిమ్నీ ప్రత్యేకతలపై వినియోగదారులలో అభిరుచి మళ్లీ పెరగడం. 4x4 డ్రైవ్ సిస్టమ్, బాక్సీ డిజైన్, లేటెస్ట్ సాంకేతిక ఫీచర్లు, ఆఫ్-రోడింగ్ సామర్థ్యం వంటివి దానికి విశిష్ట గుర్తింపును తీసుకురాగలిగాయి. దీంతో మే 2025లో 682 యూనిట్ల రికార్డు అమ్మకాలు నమోదయ్యాయి. ఈ టర్న్ SUV విభాగంలో ఇంకా పోటీ ఇవ్వగలగబోతుందని ఆశలను పెంచుతోంది.
మారుతీ సుజుకీ జిమ్నీ ఒక నిజమైన ఆఫ్-రోడ్ SUVగా మాత్రమే కాకుండా, సరసమైన ధరలో అందుబాటులో ఉండటంతో కూడా వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ SUV ధర రూ.12.76 లక్షల నుండి మొదలై, రూ.14.96 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది ప్రధానంగా రెండు వేరియంట్లలో డెల్టా, ఆల్ఫాలలో లభిస్తుంది. కలర్స్ విషయానికొస్తే, ఇది గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ వంటి స్టైలిష్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

పవర్‌ట్రెయిన్ పరంగా, జిమ్నీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది, ఇది 105 PS హార్స్‌పవర్, 134.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో లభ్యమవుతుంది. ప్రామాణిక డ్రైవింగ్ పరిస్థితులలో ఇది సుమారు 16 నుండి 17 కిలోమీటర్ల మైలేజీని అందించగలదు. ఇక లోపలి భాగానికి వస్తే, జిమ్నీ నలుగురు వ్యక్తులు సౌకర్యంగా ప్రయాణించగలిగే విధంగా రూపొందించబడింది.
208 లీటర్ల బూట్ స్పేస్‌ను అందించడం ద్వారా ప్రయాణాల్లో లగేజీ కోసం తగినంత స్థలం లభిస్తుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫీచర్లు జిమ్నీని ఒక నిజమైన లైఫ్‌స్టైల్ ఆఫ్‌రోడ్ SUVగా మార్చాయి.


Click it and Unblock the Notifications








