2026లో మారుతి కార్ల జాతర..మార్కెట్లోకి కొత్త కార్లు రాబోతున్నాయ్.. డబ్బులు రెడీ చేస్కోండి
భారతదేశంలో కార్ల మార్కెట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు మారుతి సుజుకి. 2026 సంవత్సరం మారుతికి అత్యంత కీలకమైనది కానుంది. ఈ ఏడాది కేవలం విక్టోరిస్ అనే ఒకే ఒక్క మోడల్‌ను తెచ్చిన మారుతి, 2026లో మాత్రం ఏకంగా నాలుగు కొత్త కార్లను మార్కెట్లోకి వదలబోతోంది. ఇందులో విశేషం ఏంటంటే.. మారుతి తన పంథాను మార్చుకుని పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తోంది. రాబోయే ఈ నాలుగు మోడళ్లలో రెండు ఎలక్ట్రిక్ కార్లు (EVలు), ఒక ఫ్లెక్స్-ఫ్యూయెల్ మోడల్ ఉండటం గమనార్హం.
మొదటి ఎలక్ట్రిక్ కారు: ఇ-విటారా (e-Vitara) మారుతి నుంచి రాబోతున్న మొట్టమొదటి పక్కా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ-విటారా. ఇది 2026 జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. గుజరాత్ ప్లాంట్‌లో తయారయ్యే ఈ కారు కోసం హార్టెక్ట్ అనే ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌ను వాడారు.

ఇందులో 49 kWh, 61 kWh అనే రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. పెద్ద బ్యాటరీ ప్యాక్ వాడితే ఒక్కసారి ఛార్జింగ్‌తో ఏకంగా 543 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే భారత్ NCAP సేఫ్టీ టెస్టులో 5-స్టార్ రేటింగ్ సాధించిన ఈ కారు, క్రెటా EV, టాటా కర్వ్ EV వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
బ్రెజా ఫేస్‌లిఫ్ట్: కొత్త హంగులతో పాపులర్ SUV మారుతి సుజుకికి మంచి అమ్మకాలను తెచ్చిపెట్టే బ్రెజా కారు 2026 మధ్యలో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో రాబోతోంది. కొత్త అల్లాయ్ వీల్స్, అదిరిపోయే లైటింగ్ సెటప్‌తో పాటు లోపల 10.1-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, ఆధునిక ADAS (లెవల్ 2) ఫీచర్లను ఇందులో చేర్చబోతున్నారు.

మెకానికల్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోయినా, దీని CNG వెర్షన్‌లో ఒక సరికొత్త మార్పు రాబోతోంది. లగేజీ పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా CNG ట్యాంక్‌ను బాడీ కింద భాగంలో అమర్చే అవకాశం ఉంది.
ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్: భవిష్యత్తు ఇంధనం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మారుతి సుజుకి తన మొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజిన్ కారును ఫ్రాంక్స్ మోడల్‌లో తీసుకురాబోతోంది. 2026 రెండో భాగంలో వచ్చే ఈ కారు, 85% వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E85) తో కూడా నడుస్తుంది. సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఇది తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. డిజైన్ పరంగా ప్రస్తుత ఫ్రాంక్స్ లాగే ఉన్నా, ఇంజిన్ సిస్టమ్‌లో మాత్రం ఇథనాల్‌కు తగ్గట్టుగా మార్పులు చేశారు.

మారుతి రెండో ఎలక్ట్రిక్ కారు: YMC ఎలక్ట్రిక్ ఎంపీవీ ఇ-విటారా తర్వాత మారుతి నుంచి రాబోతున్న రెండో ఎలక్ట్రిక్ వాహనం ఒక ఎంపీవీ. ప్రస్తుతానికి దీనికి YMC అనే కోడ్ నేమ్ పెట్టారు. ఇది 2026 చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది కూడా ఇ-విటారా నిర్మించిన ప్లాట్‌ఫామ్‌పైనే తయారవుతుంది. ఇది 6 మరియు 7 సీటర్ల వేరియంట్లలో రాబోతోంది. ఇందులో కూడా అదే 49 kWh, 61 kWh బ్యాటరీలను వాడనున్నారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 500 నుంచి 550 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. ఇది కియా కారెన్స్ EV వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా నిలవనుంది.


Click it and Unblock the Notifications








