తక్కువ ధరలో చిన్న ఫ్యామిలీ కార్ల కోసం ఎగబడ్డ జనాలు! పెద్దవాళ్లను మించిపోయిన చిన్న హీరోలు
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం కార్లపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) తగ్గింపు భారత ఆటోమొబైల్ రంగానికి ఊపిరి పోసింది. ఈ నిర్ణయం ప్రత్యేకించి చిన్న కారు విభాగానికి భారీ ఊతం ఇచ్చింది. 4 మీటర్ల కంటే తక్కువ పొడవు కలిగిన, చిన్న ఇంజిన్ సామర్థ్యం ఉన్న పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇప్పుడు కేవలం 18 శాతం GST మాత్రమే వర్తించనుంది. దీంతో చిన్న కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా, దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) ఈ తగ్గింపును వెంటనే వినియోగదారులకు చేరవేసింది. కంపెనీ తన హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల ధరలను రూ.36,000 నుండి రూ.1.06 లక్షల వరకు తగ్గించింది. ఈ నిర్ణయం వినియోగదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఫలితంగా, హ్యాచ్‌బ్యాక్ మార్కెట్ తిరిగి పుంజుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని ప్రతిఫలంగా మారుతి సుజుకి అక్టోబర్ 2025లో తన అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. మొత్తం 2,20,894 యూనిట్లు విక్రయించబడగా, అందులో దేశీయ మార్కెట్‌లోనే 1,80,675 యూనిట్లు అమ్ముడయ్యాయి. అదనంగా, 31,304 యూనిట్లు విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయబడ్డాయి. పండుగ సీజన్ ఈ వృద్ధికి మరింత ఊతమిచ్చింది.

వినియోగదారులు కొత్త కార్ల కొనుగోలులో చురుకుగా పాల్గొనడంతో, చిన్న కార్ల విభాగం మరింత బలపడింది. ఆల్టో, ఎస్-ప్రెస్సో మోడళ్లు ఒక్కటే 9,067 యూనిట్ల అమ్మకాలను సాధించగా, సెలెరియో, వ్యాగన్‌ఆర్, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో మోడళ్ల కలిపి 76,143 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే నెలలో ఈ మోడళ్ల మొత్తం అమ్మకాలు 65,948 యూనిట్లుగా ఉండగా, ఈసారి అమ్మకాల సంఖ్య దాదాపు 10,000 యూనిట్ల పెరుగుదల చూపింది.
ఇది చిన్న కార్ల విభాగంపై వినియోగదారుల నమ్మకం మళ్లీ పెరిగిందని సూచిస్తోంది. GST తగ్గింపు నిర్ణయం చిన్న కార్ల మార్కెట్‌కు నూతన ఊపిరి నిచ్చింది. ధరల తగ్గింపు, పండుగ సీజన్,మారుతి సుజుకి వంటి కంపెనీల సరికొత్త ఆఫర్లు కలిసి భారత ఆటోమొబైల్ రంగాన్ని మరోసారి ఉత్సాహభరిత దశలోకి తీసుకెళ్లాయి. మారుతి సుజుకి యుటిలిటీ వాహనాల విభాగం కూడా అక్టోబర్ నెలలో మంచి వృద్ధిని సాధించింది.

కంపెనీకి చెందిన ప్రముఖ SUVలు, MPVలు.. బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, విక్టోరిస్, XL6 వంటి మోడళ్లకు మార్కెట్లో మంచి స్పందన లభించింది. ఈ వాహనాలు కలిపి గత నెలలో 77,571 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ విభాగంలో మారుతి సుజుకి 70,664 యూనిట్లు విక్రయించింది. అంటే, అమ్మకాలలో దాదాపు 7,000 యూనిట్ల పెరుగుదల నమోదైంది.
ఈ సంఖ్య కంపెనీ SUV, MPV లైనప్ స్థిరంగా పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తుంది. అయితే, ఈ వృద్ధి ఉన్నప్పటికీ, యుటిలిటీ వాహనాలు హ్యాచ్‌బ్యాక్ విభాగాన్ని అధిగమించలేకపోయాయి. హ్యాచ్‌బ్యాక్‌లు మరింత ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతూ, కంపెనీకి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచాయి. దీనితో, చిన్న కార్ల విభాగం ఇప్పటికీ మారుతి సుజుకి అమ్మకాల వెన్నెముకగా కొనసాగుతోంది. ఇది భారత మార్కెట్‌లో వినియోగదారుల ధోరణిని కూడా ప్రతిబింబిస్తుంది.

చిన్న కార్లపై పన్ను తగ్గింపు అమలులోకి వచ్చిన వెంటనే, హ్యాచ్‌బ్యాక్‌ల అమ్మకాలు వేగంగా పెరుగడం ప్రారంభమైంది. ఇది కార్ల తయారీదారులకు మాత్రమే కాదు, సామాన్య వినియోగదారులకు కూడా పెద్ద ఉపశమనం తీసుకువచ్చింది. ఇప్పటివరకు కారు కొనడం చాలా మందికి ఒక కలలాగే ఉండేది. కానీ కొత్త GST రేట్లతో, చిన్న ఇంజిన్ కలిగిన కాంపాక్ట్ కార్ల ధరలు గణనీయంగా తగ్గడంతో, ఆ కల ఇప్పుడు చాలా మందికి చేరువవుతోంది.


Click it and Unblock the Notifications








