మారుతి స్విఫ్ట్‌పై రూ.1 లక్ష తగ్గింపు.. సెలెరియో, వ్యాగన్ ఆర్, బాలెనోపై కూడా భారీగా తగ్గుదల
దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు ఊపిరి పీల్చేలా మారిన కీలక పరిణామం ఇటీవల చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వాహనాలపై విధిస్తున్న పన్ను రేట్లను గణనీయంగా తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆటోమొబైల్ రంగంపై 28 శాతం జీఎస్టీ విధించబడుతున్నా, తాజా నిర్ణయం ప్రకారం అది కేవలం 18 శాతానికి తగ్గించబడింది. ఈ తగ్గింపు వల్ల వినియోగదారులు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి మరింత ఉత్సాహం చూపిస్తారని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. దీని ఫలితంగా ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఇప్పటికే తమ ధరలను సవరించడం ప్రారంభించాయి.
టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీలు ఈ మార్పును అనుసరించి తమ వాహనాల ధరలను తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇది కేవలం వినియోగదారులకు మాత్రమే కాదు, మొత్తం ఆటో పరిశ్రమకు కొత్త ఊపు తెచ్చే పరిణామంగా భావిస్తున్నారు. ఇక, ఈ మార్పు నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో అతి పెద్ద కార్ల తయారీదారుగా ఉన్న మారుతి సుజుకి కూడా వెనుకడుగు వేయలేదు.

ఇప్పటికే తమ మోడళ్లపై ధర తగ్గింపుల వివరాలను వెల్లడించింది. మారుతి సుజుకి చిన్న కార్ల నుంచి పెద్ద SUVల వరకు విస్తృతమైన రేంజ్‌ను కలిగి ఉండటంతో, ఈ తగ్గింపు మరింత మంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది. తాజా మార్పు వల్ల కారు కొనుగోలు చేయాలనుకున్న మధ్యతరగతి వినియోగదారులకు పెద్ద ఊరట లభించనుంది. ధరలు తగ్గడం వలన ఒకవైపు EMI భారాలు తగ్గుతాయి, మరోవైపు అందుబాటు పెరుగుతుంది.
సాధారణంగానే మారుతి కార్లు అందుబాటు ధరల్లోనే లభిస్తుంటాయి. ఇప్పుుడు జీఎస్టీ కారణంగా తీసుకున్న నిర్ణయంతో మరింత తక్కువ ధరకు కొనుగోలుకు రానున్నాయి. కొత్త ధరల ప్రకారం, మారుతి ప్రసిద్ధ మోడల్ స్విఫ్ట్ కారుపై గరిష్టంగా రూ.1.06 లక్షల వరకు తగ్గనుంది. దీని బేస్ వేరియంట్ LXI 1.2L MT ధర రూ. 6.49 లక్షలుగా ఉండగా, దీనిపై రూ.55 వేల తగ్గింపు ఉండగా, అది రూ.5.94 లక్షలు(ఎక్స్‌షోరూమ్) ధరకు లభిస్తుంది.

ఇప్పటివరకు ఆల్టో K10 STD మాన్యువల్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.3.05 లక్షలు ఉండగా, జీఎస్టీ తగ్గింపుతో రూ.28 వేల ధర తగ్గి, ఇప్పుడు అది రూ.2.77 లక్షలకు చేరుకుంది. మరోవైపు, ఈ మోడల్‌లోని VXI+ AMT వేరియంట్ కూడా భారీగా చౌకైంది. దీని పాత ధర రూ.6.10 లక్షలు కాగా, జీఎస్టీ తగ్గింపుతో రూ.52 వేల తగ్గి, ప్రస్తుతం రూ.5.58 లక్షలకు లభిస్తోంది.
ఎప్పుడూ బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్‌లుగా నిలిచే ఎస్-ప్రెస్సో, వ్యాగన్ ఆర్ ఇప్పుడు మరింత చౌకగా లభిస్తున్నాయి. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ప్రస్తుతం ఎక్స్‌షోరూమ్ రూ.3.90 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఇందులో గరిష్ట ప్రయోజనం VXI (O) CNG 1L MT ట్రిమ్‌కి దక్కింది. ఈ వేరియంట్ ధర సుమారు రూ.53,000 వరకు తగ్గించబడింది. దీని వల్ల ఇప్పటికే సరసమైన ఈ మినీ SUV తరహా హ్యాచ్‌బ్యాక్ మరింత ఆకర్షణీయమైన ధరలో లభిస్తోంది.

ఇక, మధ్యతరగతి కుటుంబాల కలల కారుగా పేరుగాంచిన వ్యాగన్ ఆర్ ధర తగ్గింపును చూసింది. కొత్త GST కింద ఈ మోడల్ రూ.64,000 వరకు తగ్గింపును పొందింది. LXI 1L MT వేరియంట్ పాత ధర రూ.5.79 లక్షలు కాగా, కొత్తగా సవరించిన ధర రూ.5.29 లక్షలకు చేరింది. అంటే సుమారు రూ.50,000 వరకు తగ్గింపుతో ఇప్పుడు ఈ ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ మరింత సరసమైన ధరలో వినియోగదారుల ముందుకు వచ్చింది.
మారుతి సుజుకి సెలెరియో GST తర్వాత దీని ప్రారంభ ధర రూ.5.16 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. వేరియంట్‌ను బట్టి కస్టమర్లు గరిష్టంగా రూ.63,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. బాలెనో విషయంలో కూడా వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. ఇందులోని 1.2 ఆల్ఫా MT వేరియంట్ ప్రత్యేకంగా రూ.85,000 వరకు తగ్గింపు పొందింది. ఈ తగ్గింపు బాలెనోను మరింత కాంపిటీటివ్ ప్రైస్ సెగ్మెంట్‌లోకి తీసుకెళ్లింది.

డిజైర్ విషయానికి వస్తే, ఈ మోడల్‌పై భారీగా ధర తగ్గింపు జరిగింది. రూ.84,000 వరకు తగ్గాయి. సెప్టెంబర్ 22 నుంచి దీని కొత్త ప్రారంభ ధర రూ.6.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా లభించనుంది. అదే విధంగా ఇగ్నిస్ ధరలు కూడా చౌకయ్యాయి. GST అమలు తర్వాత దీని ప్రారంభ ధర కేవలం రూ.5.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. వేరియంట్‌ను బట్టి వినియోగదారులు రూ.69,000 వరకు ప్రయోజనం పొందగలరు.


Click it and Unblock the Notifications








