మారుతి సుజుకి నుంచి రానున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. లేటుగా మొదలు పెట్టినా లేటెస్ట్ రికార్డులు సృష్టించేలా!
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. దీంతో స్టార్టప్‌ల నుంచి మొదలుకొని అనేక వాహన తయారీ సంస్థలు తమ ఈవీలతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అయితే.. దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి మాత్రం ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి చాలా లేట్‌గా అడుగు పెట్టింది. ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో తమ బ్రాండ్ నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు మోడల్ ఇ-విటారాను ఈ సంస్థ ఆవిష్కరించింది. దీంతో మార్కెట్‌లో ఈవీ రంగంలోకి సైతం ప్రవేశించింది.
అయితే ఇది మాత్రమే కాకుండా.. మరికొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను కూడా రాబోయే సంవత్సరాల్లో తక్కువ ధరలో ఉండేలా భారత మార్కెట్లోకి తీసుకురావాలని ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. మారుతి సుజుకి సంస్థ ఆవిష్కరించిన ఇ-విటారా కారును వచ్చే నెలలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది ఈ సంస్థ. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ అందించగలదు.

ఎంట్రీ-లెవెల్ హ్యాచ్‌బ్యాక్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మారుతి సుజుకి ఇప్పుడు అదే పేరును ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ ఒక ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ తయారీ పనిపై దృష్టి సారించింది. దానిని Y2Y కోడ్‌నేమ్‌తో పిలుస్తున్నారు.
2028 నాటికి ఈ కారు ప్రొడక్షన్ దిశగా వెళ్లనుంది. ఈ కారులో 35kWh బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. ధర విషయంలో ఇతర కార్లతో పోటీపడేలా దీన్ని రూపొందిస్తోంది మారుతి సంస్థ. తక్కువ ధరకే నాణ్యమైన కారును భారతీయులకు అందించాలని లక్ష్యంగా పనిచేస్తోంది.

సుజుకి eWX కాన్సెప్ట్ ఆధారంగా ఈ Y2Y హ్యాచ్‌బ్యాక్‌ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మారుతి సంస్థ ధ్రువీకరించలేదు. కానీ ఈ కారు లాంచ్ అయితే గనుక.. టాటా టియాగో ఈవీ, ఎంజీ కోమెట్ కార్లతో పోటీ పడనుంది. హ్యాచ్‌బ్యాక్‌తో పాటు మారుతి సుజుకి సంస్థ ఒక ఎలక్ట్రిక్ MPVని కూడా భారత మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.
2026 సెప్టెంబర్ నాటికి ఈ కారు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిని YMC కోడ్‌నేమ్‌తో పిలుస్తున్నారు. ఈ కారు ఇ-విటారా కారుతో తన ప్లాట్‌ఫామ్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే దీంట్లో టయోటా ఎడిషన్‌ను ఆ తర్వాత తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇ-విటారా కారులో వినియోగించిన పవర్‌ట్రైన్‌నే ఈ కొత్త కారులోనూ వినియోగించనున్నారు.

ప్రతి సంవత్సరానికి ఈ ఎంపీవి అమ్మకాలు 50000 నుంచి 1 లక్ష యూనిట్ల అమ్మకాలు జరుగుతాయని మారుతి సంస్థ భావిస్తోంది. ఈ మోడల్ గనుక లాంచ్ అయితే ఇది.. త్వరలో రానున్న కియా కారెన్స్ ఈవీతో భారత మార్కెట్లో పోటీ పడనుంది. వినియోగదారుల అవసరాలు ప్రాధాన్యతలకు తగ్గట్టుగా ఎలక్ట్రిక్ వాహనాల లైనఅప్‌లను తీసుకురావడంపై మారుతి సంస్థ దృష్టి పెట్టింది.
మారుతి సుజుకి సంస్థ నుంచి రాబోయే ఈ ఎలక్ట్రిక్ వాహనాల లైనప్.. పర్యావరణహితకర వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకురావడంపై ఈ సంస్థకు ఉన్న నిబద్ధతను చాటుతున్నాయి. ఎంట్రీ-లెవెల్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఈవీలతో విభిన్న వినియోగదారుల మనుసులను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది మారుతి సంస్థ.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: తక్కువ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలని భారతీయులు ఎదురుచూస్తూ ఉంటారు. మారుతి సంస్థ నుంచి రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ వాహనాలు.. భవిష్యత్తులో ఈవీల జోరు మరింత పెరుగనుందని అనడానికి సంకేతాలుగా ఉన్నాయి. అందుకే భారతీయుల ఆలోచనా ధోరణికి తగ్గట్టు తక్కువ ధరలో, కుటుంబాలు వినియోగించేందుకు వీలుగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలని మారుతి సంస్థ ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications








