ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇష్టమైన రూ.5 లక్షల కారు.. గత నెలలో ఎంతమంది కొన్నారంటే?
దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతీ సుజుకీ (maruti suzuki) ఇటీవల ఏప్రిల్ నెల ముగిసిన నేపథ్యంలో మోడళ్ల వారీగా అమ్మకాలను విడుదల చేస్తుంది. కంపెనీ తాజాగా వ్యాగన్ఆర్ (Wagon R)కు సంబంధించిన సేల్స్ డేటాను వెల్లడిస్తుంది. ఇది భారత మార్కెట్లో ఒక పేరుపొందిన హ్యాచ్‌బ్యాక్. దీని డిజైన్ సాధారణంగా ఆకర్షణీయంగా ఉండి, మంచి మైలేజీతో పాటు వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా రూపొందించబడింది. ప్రత్యేకించి మిడిల్ క్లాస్, మధ్య తరగతి కుటుంబాల్లో ఈ కారుకు మంచి ఆదరణ ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు ఈ కారును ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. తక్కువ ధరలో, మంచి మైలేజ్, మెయింటెనెన్స్‌లో తక్కువ ఖర్చు లాంటి అంశాల కారణంగా మార్కెట్లో నిలకడగా ఉంది.
తాజాగా మారుతీ నుంచి విడుదలైన డేటా ప్రకారం, వ్యాగన్ఆర్ గత కొన్ని నెలలుగా అమ్మకాల్లో క్రమంగా తగ్గుదలను చూపిస్తుంది. గత నెల ఏప్రిల్ 2025లో, మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ కారును 13,413 యూనిట్లు మాత్రమే విక్రయించింది. ఇది మార్చి 2025లో అమ్ముడైన 17,175 యూనిట్లతో పోలిస్తే సుమారు 22 శాతం తగ్గుదల. అయినా కూడా వ్యాగన్ఆర్ ఇప్పటికీ తన డిమాండ్‌ను పూర్తిగా కోల్పోలేదు.

ఏప్రిల్‌లో దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో ఇది 9వ స్థానాన్ని ఆక్రమించింది. ఇది వ్యాగన్ఆర్‌కు ఇప్పటికీ ఉన్న పాపులారిటీకి నిదర్శనం. మార్కెట్లో కొత్త మోడల్స్, పెరిగిన పోటీ, వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు వంటి అంశాలు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు మార్కెట్లో అమ్మకాల పరంగా హెచ్చుతగ్గులను నమోదు చేస్తుంది.
ఒక నెల పెరిగిన అమ్మకాలు, తదుపరి నెల తగ్గిపోవడం వంటి ఒడిదుడుకుల మధ్య ఈ హ్యాచ్‌బ్యాక్ కొనసాగుతోంది. జనవరి 2025లో వ్యాగన్ఆర్ అత్యధికంగా 24,078 యూనిట్లు అమ్ముడవ్వగా, ఫిబ్రవరిలో ఈ సంఖ్య 19,879కి పడిపోయింది. ఇది వినియోగదారుల కొనుగోలు ధోరణిలో వచ్చిన మార్పును సూచించే అంశం. ఇటీవలికాలంలో జరిగిన ఈ హెచ్చుతగ్గులకు దారితీసిన ధోరణి కొత్తది కాదని చెప్పొచ్చు. 2024 చివర్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.

గత ఏడాది నవంబర్‌లో 13,982 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, డిసెంబర్‌లో విక్రయాలు కొద్దిగా మెరుగు పడి 17,303కి చేరాయి. దీనిపై కంపెనీ స్పష్టమైన కారణాలు తెలియజేయకపోయినా, మార్కెట్ వర్గాల నుంచి వచ్చిన దాని ప్రకారం, ప్రస్తుతం మార్కెట్లో SUV కార్లకు ఉన్న విపరీతమైన డిమాండ్, మారుతీ సుజుకీ వంటి సంస్థల హ్యాచ్‌బ్యాక్ కార్ల విక్రయాలను ప్రభావితం చేస్తోందని తెలుస్తుంది. ఇది భారతీయ వినియోగదారులకు అందుబాటు ధరలో లభిస్తుంది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో దీని వ్యాగన్ ఆర్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5.78 లక్షల(ఎక్స్-షోరూమ్) నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ గరిష్టంగా రూ.7.61 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరకు అందుతున్న అంశాలను పరిశీలిస్తే, వ్యాగన్ఆర్ నిజంగా "వాల్యూ ఫర్ మనీ" కారు. ఈ కారు ఐదు సీట్ల సామర్థ్యంతో వస్తుంది. కుటుంబ ప్రయాణాల్లో ఉపయోగపడేలా 312 లీటర్ల విస్తృతమైన బూట్ స్పేస్‌ను ఇది కలిగి ఉంది.

ఇది పెట్రోల్, సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్లు 23.56 కి.మీల వరకు మైలేజీ ఇస్తే, సీఎన్జీ వేరియంట్ నుంచి 34.05 కి.మీల వరకు మైలేజీ ఇస్తుంది. ఇది మాగ్మా గ్రే, సిల్కీ సిల్వర్, పూల్‌సైడ్ బ్లూ, సుపీరియర్ వైట్ వంటి కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ హ్యాచ్‌బ్యాక్ మారుతీ సుజుకీ పెద్ద బలమైన మోడల్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








