ఎలాగో రేట్లు తగ్గాయి.. కొంటే లగ్జరీ కారే కొంటామన్న కస్టమర్లు.. 9 రోజుల్లో 2500 కార్లు అమ్మిన బెంజ్ కంపెనీ
భారతీయ లగ్జరీ కార్ల మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ సంస్థ అద్భుతమైన అమ్మకాలతో రికార్డ్ క్రియేట్ చేసింది. గత సెప్టెంబర్ నెలలో కంపెనీ ఏకంగా 36 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 పన్నుల మార్పు తర్వాత ఈ వృద్ధి మరింత వేగం పుంజుకుంది. పండుగల సీజన్ (నవరాత్రి) సమయంలోనే జీఎస్‌టీ తగ్గింపు అమల్లోకి రావడంతో, మెర్సిడెస్ అమ్మకాలకు బాగా కలిసొచ్చింది.
అమ్మకాలలో రికార్డు
నవరాత్రి పండుగ సందర్భంగా కేవలం తొమ్మిది రోజుల్లోనే మెర్సిడెస్ బెంజ్ సంస్థ ఏకంగా 2500 కార్లను విక్రయించింది. ఇది భారతదేశంలో ఆ కంపెనీ చేసిన అత్యధిక అమ్మకాల రికార్డు. ఈ అధిక అమ్మకాలకు ప్రధాన కారణం.. ప్రజల్లో లగ్జరీ కార్ల కొనుగోలు డిమాండ్ పెరగడం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మెర్సిడెస్ మొత్తం 9,357 కార్లను విక్రయించింది. కేవలం గత త్రైమాసికంలోనే 5,119 కార్లు అమ్ముడయ్యాయి.

టాప్-ఎండ్ కార్ల హవా
మెర్సిడెస్ మొత్తం అమ్మకాలలో టాప్-ఎండ్ కార్ల వాటానే 25శాతంగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ సెగ్మెంట్ అమ్మకాలు 12శాతం పెరిగాయి. GLS, S-క్లాస్, మెర్సిడెస్ మేబ్యాక్, ముఖ్యంగా AMG G63 వంటి మోడళ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
వీటిలో మెర్సిడెస్ AMG G63 కారుకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో, బుకింగ్‌లు భారీగా పెరిగాయి. ఈ కారును ఇప్పుడు బుక్ చేసుకుంటే, డెలివరీ కోసం 6 నెలల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఉత్పత్తిని కూడా పెంచాలని నిర్ణయించింది.

కోర్ సెగ్మెంట్, ఎంట్రీ లెవల్ స్థితి
లాంగ్ వీల్‌బేస్ ఇ-క్లాస్, GLC, GLE వంటి మెర్సిడెస్ కోర్ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు కూడా గత సెప్టెంబర్‌లో భారీగా పెరిగాయి. ముఖ్యంగా లాంగ్ వీల్‌బేస్ ఇ-క్లాస్ సేల్స్ అద్భుతంగా ఉన్నాయి. గత త్రైమాసికంలో ఈ కోర్ సెగ్మెంట్ అమ్మకాలు 47 శాతం వరకు పెరిగాయి.
అయితే, ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు మాత్రం తగ్గాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో లభిస్తున్నా, A-క్లాస్ సెడాన్, GLA ఎస్‌యూవీ వంటి కార్లకు తక్కువ ధర కారు అనే అభిప్రాయం కారణంగా మార్కెట్‌లో తగినంత ఆదరణ లభించడం లేదు.

ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు
మెర్సిడెస్ బెంజ్ కంపెనీ మొత్తం అమ్మకాల్లో ప్రస్తుతం దాదాపు 10 శాతం వరకు ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయి. ఇందులో EQS ఎస్‌యూవీ కారు అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా ఉంది. మరోవైపు, టాప్-ఎండ్ వాహనం అయిన G580 ఎడిషన్ EQ టెక్నాలజీ కారుకుసంబంధించిన ప్రస్తుత సంవత్సర స్టాక్ మొత్తం అమ్ముడైపోయింది.
ప్రస్తుతం, తదుపరి డెలివరీల కోసం బుకింగ్‌లు జరుగుతున్నాయి. భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ సంస్థ ఇలాంటి లగ్జరీ వాహనాల విక్రయాలలో నిరంతర వృద్ధిని సాధిస్తుందని అంచనా వేయవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారతదేశంలో మెర్సిడెస్ సంస్థ చాలా సంవత్సరాలుగా లగ్జరీ వాహనాలను విక్రయిస్తోంది. గత సెప్టెంబర్ నెలలో 9 రోజుల్లో 2500 కార్లను విక్రయించడం నిజంగా ఒక రికార్డు. ఈ సంస్థ అమ్మకాల్లో నిరంతరం వృద్ధిని సాధిస్తుందని ఆశించవచ్చు.


Click it and Unblock the Notifications








