ఎలక్ట్రిక్ కార్లే కింగ్ మేకర్లు..తక్కువ కాలంలోనే టాప్.. ఎంజీ టార్గెట్ అదేనా?
ఎంజీ మోటార్ దూకుడు మీదుంది. వరుసగా కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తూ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. ముఖ్యంగా విండ్‌సర్ ఈవీ అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. అయితే, ఎంజీ మరో అదిరిపోయే ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తే మాత్రం ఇక తిరుగుండదని విశ్లేషకులు అంటున్నారు.
బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ప్రస్తుతం చైనాకు చెందిన SAIC గ్రూప్ ఆధీనంలో పనిచేస్తోంది. ఇటీవల భారతీయ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో ఎంజీ చేతులు కలపడం ఇక్కడ గమనార్హం. ఈ భాగస్వామ్యం తర్వాత భారతదేశంలో ఎంజీ మోటార్ కార్యకలాపాలు మరింత ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల విషయంలో ఎంజీ మరింత దృష్టి సారించింది. ఇది ఆ కంపెనీకి బాగా కలిసి వస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

2024లో అత్యధికంగా ఎలక్ట్రిక్ కార్లను అమ్మిన కంపెనీగా టాటా మోటార్స్ మొదటి స్థానంలో నిలిచినా, ఎంజీ మోటార్ కూడా గణనీయమైన వృద్ధితో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 2025లో ఎంజీ ఈ వృద్ధి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకు నిదర్శనంగా గత ఏప్రిల్ నెలలో ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ఎంజీ భారీ పురోగతి సాధించింది.
ఎంజీ మోటార్ విక్రయించే మొత్తం కార్లలో దాదాపు 75 శాతానికి పైగా ఎలక్ట్రిక్ కార్లే ఉండటం విశేషం. గత 2025 ఏప్రిల్ నెలలో ఎంజీ మోటార్ భారతదేశంలో మొత్తం 5,829 కార్లను విక్రయించింది. అదే 2024 ఏప్రిల్‌లో అయితే ఎంజీ కేవలం 4,485 కార్లను మాత్రమే అమ్మింది. ఈ విధంగా చూస్తే, భారతదేశంలో ఎంజీ కార్ల అమ్మకాలు ఏకంగా 30శాతం పెరిగాయి.

అందరూ ఊహించినట్లుగానే గత నెలలో ఎంజీ మోటార్ నుంచి అత్యధికంగా అమ్ముడైన కారుగా విండ్‌సర్ ఈవీ ఎలక్ట్రిక్ కారు మొదటి స్థానంలో నిలిచింది. గత నెలలో అమ్ముడైన విండ్‌సర్ ఈవీ కార్ల సంఖ్య 3,660. అంటే, ఎంజీ మోటార్ మొత్తం అమ్మకాల్లో విండ్‌సర్ ఈవీ వాటా 60 శాతానికి పైగా ఉండటం విశేషం.
గత 2024 ఏప్రిల్‌లో ఎంజీ విండ్‌సర్ ఈవీ ఎలక్ట్రిక్ కారు అమ్మకాల్లో లేదు. ఈ ఎలక్ట్రిక్ కారు తర్వాత అత్యధికంగా అమ్ముడైన ఎంజీ కారుగా హెక్టర్ రెండో స్థానంలో ఉంది. భారతదేశంలో ఎంజీ విడుదల చేసిన మొదటి కారు అయిన హెక్టర్ గత నెలలో 977 యూనిట్లు అమ్ముడైంది.

అయితే, 2024 ఏప్రిల్‌లో ఎంజీ 1,813 హెక్టర్ కార్లను విక్రయించింది. ఈ విధంగా చూస్తే, హెక్టర్ కార్ల అమ్మకాలు 46శాతం తగ్గాయి. దీని తర్వాత మూడో స్థానంలో మరో ఎంజీ ఎలక్ట్రిక్ కారు జెడ్ఎస్ ఈవీ (ZS EV) ఉంది. గత నెలలో 864 జెడ్ఎస్ ఈవీ కార్లు అమ్ముడయ్యాయి.
వీటితో పాటు, ఎంజీ మోటార్ గత నెలలో 191 కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లు, 133 ఆస్టర్ కార్లు, నాలుగు గ్లోస్టర్ కార్లను కూడా విక్రయించింది. విండ్‌సర్ ఈవీ లాంటి మరో మంచి ఎలక్ట్రిక్ కారును ఎంజీ విడుదల చేస్తే, దాని అమ్మకాలు మరింతగా పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయిందని స్పష్టంగా తెలుస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








