వానాకాలంలో డ్రైవింగ్ చేస్తూ ఈ తప్పులు చేయకండి.. అలా చేస్తే మీ కారుకే భారీ నష్టం
వర్షాకాలం వచ్చిందంటే చాలు, వాతావరణం చల్లబడి ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. కానీ మరోవైపు రోడ్లన్నీ నీటితో నిండిపోయి, డ్రైవింగ్ చేయడం కష్టంగా మారుతుంది. వర్షంలో కారు నడిపేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోకపోతే, మీరు కష్టాల్లో పడవచ్చు. మీ కారు ఇంజిన్ పాడై, వేల రూపాయలు ఖర్చు చేయాల్సి రావచ్చు. వర్షాకాలంలో కారు నడిపేటప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన చిట్కాలు ఏమిటో వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.
వేగం పెంచితే ప్రమాదమే!
వర్షాకాలంలో రోడ్లు తడిసి, చాలా జారుడుగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఎక్కువ వేగంతో కారు నడపడం చాలా ప్రమాదకరం. మీరు ఎంత వేగంగా వెళ్తే, రోడ్డుపై టైర్‌ల పట్టు అంత తక్కువ అవుతుంది. నీళ్లతో నిండిన రోడ్డును ఫాస్టుగా దాటెయ్యాలి అని మీరు అనుకోవచ్చు. కానీ అలా చేయడం పెద్ద తప్పు. ఎందుకంటే, అలా చేస్తే మీరు ఆ నీటిని దాటొచ్చో లేదో తెలీదు కానీ, అధిక వేగం వల్ల హైడ్రోప్లానింగ్ జరగవచ్చు.

హైడ్రోప్లానింగ్ అంటే, కారు టైర్‌లు రోడ్డుకు బదులుగా నీటిపై తేలిపోయినట్లు అవుతాయి. అప్పుడు స్టీరింగ్ కంట్రోల్ కోల్పోయి, కారు మీ అదుపు తప్పుతుంది. దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం పెరుగుతుంది. కాబట్టి, వర్షంలో ఎప్పుడూ నెమ్మదిగా, జాగ్రత్తగా కారు నడపాలి.
నీరు నిండిన రోడ్లపైకి కారు తీసుకెళ్లొద్దు
వర్షాలు పడినప్పుడు రోడ్లపై చాలా చోట్ల నీరు నిండిపోతుంది. సరిగ్గా ఆలోచించకుండా, నీరు నిండిన రోడ్డులోకి మీ కారును తీసుకెళ్తే పెద్ద సమస్యలు వస్తాయి. కారు ఇంజిన్‌లోకి నీరు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంజిన్‌లోకి నీరు వెళ్తే, ఇంజిన్ సీజ్ అయిపోవచ్చు. ఇంజిన్ సీజ్ అయితే దాన్ని సరిచేయడానికి వేల రూపాయలు ఖర్చవుతాయి. కొన్నిసార్లు ఇంజిన్ పూర్తిగా మార్చాల్సి రావచ్చు. కాబట్టి, ముందు వెనక చూడకుండా నీరు నిండిన రోడ్లలోకి వెళ్లడం మానుకోండి.

ఇంజిన్‌లోకి నీరు వెళ్తే కారు స్టార్ట్ చేయొద్దు
ఒకవేళ మీరు పొరపాటున నీరు నిండిన రోడ్డులోకి వెళ్లారు, కారు మధ్యలో ఆగిపోయింది. ఇంజిన్‌లోకి నీరు వెళ్లిందని అనుకుంటే, అస్సలు కంగారు పడకండి. ఆ సమయంలో కారును మళ్లీ స్టార్ట్ చేసే తప్పు అస్సలు చేయకండి. మీరు అలా చేస్తే, హైడ్రోలాక్ అనే పరిస్థితి ఏర్పడవచ్చు. హైడ్రోలాక్ అంటే ఇంజిన్‌లోని భాగాలు నీటి వల్ల పూర్తిగా పాడైపోతాయి. దీనివల్ల ఇంజిన్ సీజ్ అయ్యి, మరమ్మత్తులకు భారీగా ఖర్చవుతుంది.
కారు మధ్యలో ఆగిపోయినప్పుడు, వెంటనే టో సర్వీస్‌కు ఫోన్ చేసి సహాయం అడగండి. మీ కారును మెకానిక్ షాప్‌కు తీసుకెళ్లి చూపించండి. మీ చేతులతో కారును మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే పరిస్థితి మరింత దిగజారవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








