ఫ్యామిలీస్ అందరి ఫేవరెట్ కారు.. ఇప్పుడు మరింత స్టైలిష్‌గా రాబోతోంది!
భారత సెడాన్ మార్కెట్‌లో మళ్లీ చర్చకు రావడానికి 2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ (Hyundai Verna Facelift) సిద్ధమవుతోంది. ఒకప్పుడు మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో బలమైన గుర్తింపును సంపాదించుకున్న వెర్నా, ఎస్యూవీల ఆధిపత్యం పెరిగిన ఈ సమయంలో కూడా సెడాన్ అభిమానులను తిరిగి ఆకర్షించాలనే లక్ష్యంతో హ్యుందాయ్ కొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. ఇటీవల బయటకు వచ్చిన స్పై షాట్‌లు ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై ఆసక్తిని మరింత పెంచాయి. అవి వెర్నాకు రానున్న కొత్త డిజైన్ టచ్‌లు, అప్‌డేటెడ్ ఫీచర్లపై స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ వెర్నా నాల్గవ తరం మోడల్. దీనిని అధికారికంగా మార్చి 2023లో భారత మార్కెట్లో విడుదల చేశారు. అప్పట్లో పూర్తిగా కొత్త డిజైన్, ఆధునిక ఇంటీరియర్, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో వెర్నా మంచి స్పందననే పొందింది.
అయితే కాలం గడిచే కొద్దీ, టెక్నాలజీ, ఫీచర్ల విషయంలో వినియోగదారుల అంచనాలు మరింత పెరిగాయి. ఇదే సమయంలో ప్రత్యర్థి బ్రాండ్లు కూడా తమ సెడాన్‌లను అప్‌డేట్ చేస్తుండటంతో, వెర్నాకు మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ ఇవ్వాలని హ్యుందాయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై టెస్ట్ చేస్తున్న వెర్నా ఫేస్‌లిఫ్ట్ వాహనాలు కనిపించడం విశేషం.

పూర్తిగా కవర్ చేసి ఉన్నప్పటికీ, కొన్ని డిజైన్ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందు భాగంలో లైటింగ్ సెటప్‌లో మార్పులు, కొత్త డిజైన్ బంపర్, మరింత షార్ప్‌గా కనిపించే గ్రిల్ వంటి అంశాలు ఉండొచ్చని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెనుక భాగంలో కూడా టెయిల్ ల్యాంప్ డిజైన్‌లో స్వల్ప మార్పులు, బూట్ లిడ్ స్టైలింగ్‌లో తాజాదనం తీసుకురావడం ద్వారా కారుకు మరింత ప్రీమియం లుక్ ఇవ్వాలని హ్యుందాయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్‌లో భద్రత అంశానికి హ్యుందాయ్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే సెగ్మెంట్‌లో అడ్వాన్స్డ్ ఫీచర్లతో గుర్తింపు పొందిన వెర్నా, ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌లో భద్రత పరంగా మరో అడుగు ముందుకు వేయనుంది. ముఖ్యంగా లెవల్-2 ADAS (Advanced Driver Assistance Systems) ఫీచర్లు ఇప్పటివరకు పరిమితమైన ట్రిమ్‌లకే అందుబాటులో ఉన్నా, ఫేస్‌లిఫ్ట్‌తో అవి మరిన్ని వేరియంట్‌లకు విస్తరించే అవకాశం ఉందని సమాచారం.

లెవల్-2 ADASలో భాగంగా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఇంజిన్ విభాగంలో మాత్రం హ్యుందాయ్ పెద్ద మార్పులు చేయబోదని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వెర్నాలో అందుబాటులో ఉన్న పవర్‌ట్రెయిన్‌లే ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కూడా కొనసాగుతాయని భావిస్తున్నారు.
ఇందులో 1.5 లీటర్, 4 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఒకటి కాగా, మరొకటి 1.5 లీటర్, 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ రెండు ఇంజిన్‌లు ఇప్పటికే మంచి పనితీరు, స్మూత్ డ్రైవింగ్ అనుభూతి, మైలేజ్‌తో వినియోగదారుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి. శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజన్ డ్రైవింగ్ ప్రియులకు సరిపోతే, నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ రోజువారీ వినియోగం, కంఫర్ట్ కోరుకునే వారికి బెస్ట్.

2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్‌లో ఇంటీరియర్ విభాగం అత్యంత కీలకం. బయట డిజైన్‌లో చేసే స్వల్ప అప్‌డేట్స్ కంటే కూడా, క్యాబిన్‌లోకి అడుగుపెట్టగానే కనిపించే టెక్నాలజీ, ప్రీమియం ఫీలే ఈ ఫేస్‌లిఫ్ట్‌కు ప్రధాన ఆకర్షణగా మారనుందని అంచనా వేస్తున్నారు. హ్యుందాయ్ తాజా కార్లలో కనిపిస్తున్న డిజిటల్ థీమ్‌ను వెర్నా ఫేస్‌లిఫ్ట్‌లో కూడా మరింత బలంగా అమలు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నివేదికల ప్రకారం, కొత్త వెర్నాలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం రెండు పెద్ద డ్యూయల్ కర్వ్డ్ స్క్రీన్ సెటప్‌లు అందుబాటులోకి రావచ్చు. ఈ స్క్రీన్‌లు డ్రైవర్ వైపు స్వల్పంగా వంగిన డిజైన్‌లో ఉండటం వల్ల, డ్రైవింగ్ సమయంలో సమాచారాన్ని సులభంగా చూడగలిగేలా ఉంటాయి. ఈ స్క్రీన్ అప్‌డేట్స్‌తో పాటు, కొత్త స్టీరింగ్ వీల్ డిజైన్‌ను కూడా వెర్నా ఫేస్‌లిఫ్ట్‌లో చూడవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








