ఈ కారు ఇంజిన్‌ను బద్దలు కొట్టడం ఎవరి వల్లా కాదు..క్రాష్ టెస్టులోనూ 5స్టార్ రేటింగుతో మరోసారి ప్రూఫ్ చేసుకుంది
మారుతి సుజుకీ (Maruti Suzuki) తర్వాత భారతదేశంలో అత్యంత ఇష్టపడే వాహన తయారీదారులలో టయోటా (Toyota) ఒకటి. నమ్మి కొనుగోలు చేయడానికి ఈ బ్రాండ్‌ను మించినది మరొకటి లేదు. మంచి మెయింటెనెన్స్ చేస్తే లక్షల కిలోమీటర్లు ప్రయాణించగలిగే ఇంజిన్‌లతో, మంచి బిల్డ్ క్వాలిటీతో కూడిన వాహనాలను టయోటా తయారు చేస్తుంది. ఇన్నోవా (Innova), ఫార్చ్యూనర్ (Fortuner) వంటి కార్ల కోసం జనం ఎగబడటానికి ఇదే ప్రధాన కారణం. దేశంలో పెద్దగా ప్రాచుర్యం లేని లైఫ్ స్టైల్ పికప్ ట్రక్ విభాగంలో కూడా ప్రయోగం చేయడానికి టయోటా వెనుకాడలేదు.
ప్రపంచ మార్కెట్‌లో విజయవంతమైన టయోటా హైలక్స్ (Hilux) భారతదేశంలోనూ సత్తా చాటింది. ఇటీవల ఈ పికప్ ట్రక్ కొత్త జనరేషన్ మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్లో టయోటా విడుదల చేసింది. వచ్చే సంవత్సరం మధ్యలో లేదా చివరి నాటికి ఈ కొత్త తరం మోడల్ భారతదేశంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త హైలక్స్ వెర్షన్ తాజాగా ఆస్ట్రేలియన్ NCAP క్రాష్ టెస్ట్‌కు గురై 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది.

ఆస్ట్రేలియన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (ANCAP)లో కొత్త టయోటా హైలక్స్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 40కి 33.96 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49కి 44.00 పాయింట్లు సాధించింది. ఏబీఎస్ (ABS) తో పాటు బ్రేక్ అసిస్ట్, VSC, TPMS, రియర్‌వ్యూ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డ్రైవింగ్ ఎయిడ్స్ వంటి విస్తృతమైన సేఫ్టీ ఫీచర్లతో ఈ హైలక్స్ మార్కెట్‌లోకి వస్తుంది.
టాప్ ఎండ్ వేరియంట్లలో ప్రీ-కొలిషన్ వార్నింగ్‌లు, ఆటో హైబీమ్ అలర్ట్, ఇంటెలిజెంట్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, పనోరమిక్ వ్యూ కెమెరా వంటి అత్యాధునిక టయోటా సేఫ్టీ సెన్స్ ADAS ప్యాకేజీ కూడా ఉంది.

కొత్త టఫ్ అండ్ ఎజైల్(Tough and Agile) డిజైన్ ఫిలాసఫీకి అనుగుణంగా 2026 హైలక్స్‌ను డిజైన్ చేశారు. దీని లుక్ ఎవరినైనా ఆకర్షించేలా ఉంది. చిన్న హెడ్‌ల్యాంప్‌లు, TOYOTA అని రాసి ఉన్న నిలువు బార్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్‌తో ముందు భాగాన్ని పూర్తిగా మార్చేశారు. ఏరోడైనమిక్ సామర్థ్యం కోసం ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్‌ను కూడా ఇందులో చేర్చారు. కొత్త రియర్ డెక్ స్టెప్, సైడ్ స్టెప్‌లు ట్రక్ ప్రాక్టికాలిటీని పెంచుతాయి.
ఇక పవర్‌ట్రైన్‌ల విషయానికి వస్తే హైబ్రిడ్ డీజిల్ (48V), పెట్రోల్, ఎలక్ట్రిక్ (BEV), హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ (FCEV) వెర్షన్‌లలో ఈ పికప్ ట్రక్ విదేశీ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుంది.

ఎక్స్‌టీరియర్ లాగే ఇంటీరియర్‌ను కూడా టయోటా అద్భుతంగా తీర్చిదిద్దింది. ఇందులో కస్టమైజ్ చేయదగిన 12.3 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, రిమోట్ వెహికల్ యాక్సెస్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
హైలక్స్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో 59.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది. హైబ్రిడ్ హైలక్స్లో టయోటా 48V హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌కు 48V లిథియం-అయాన్ బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ జతచేయడం వల్ల మెరుగైన ఇంధన సామర్థ్యం, డ్రైవింగ్ అనుభవం లభిస్తుంది. భారతదేశంలోకి వచ్చే న్యూజెన్ హైలక్స్, ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో ఉన్నట్లుగానే 2.8 లీటర్ ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications