ఈ ఒక్క కారుతోనే ఒక పెద్ద కంపెనీ నడుస్తుంది! ఇంతకి అది ఏ మోడల్ అని మీరు ఊహించగలరా?
జూన్ నెల ముగిసిన తరువాత వరుసగా వాహన తయారీదారులు తమ అమ్మకాల వివరాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ నిస్సాన్ (Nissan) కూడా తన ప్రసిద్ద మోడల్ అయినటువంటి మాగ్నైట్‌కు సంబంధించి సేల్స్ డేటాను విడుదల చేసింది. 2025 జూన్‌లో నిస్సాన్ భారత్‌లో కేవలం 1313 మాగ్నైట్ SUVలు మాత్రమే విక్రయించింది. ఇదే గడిచిన ఏడాది జూన్ 2024లో ఈ సంఖ్య 2107 యూనిట్లు. ఈ గణాంకాల ప్రకారం వార్షికంగా 38 శాతం అమ్మకాల్లో తగ్గుదల నమోదైంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మే 2025లో కూడా అమ్మకాలు పెద్దగా తేడా లేకుండా 1334 యూనిట్లకు పరిమితమయ్యాయి. పోటీ బ్రాండ్లు ఎన్నో మోడళ్లతో మార్కెట్‌ను ఆక్రమిస్తున్నప్పుడు, నిస్సాన్ మాత్రం ఒకే మోడల్ మాగ్నైట్ మీద ఆధారపడుతూ కొనసాగుతోంది.
ఇదే సమయంలో నిస్సాన్ X-Trailకు భారత మార్కెట్లో సరైన గుర్తింపు రావడం లేదు. దానికి తాజాగా వచ్చిన అమ్మకాల గణాంకాలే ఉదాహరణ. 2025 జూన్‌లో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. అంటే, ఆ నెల మొత్తం ఏ ఒక్క వినియోగదారుడు కూడా ఈ SUVను కొనుగోలు చేయలేదు. దీనికి ముందు మే 2025లో అమ్మకాలు కేవలం 20 యూనిట్లు, ఏప్రిల్‌లో 76 యూనిట్లు, మార్చిలో 15 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

అంతకు ముందు, జనవరి మరియు ఫిబ్రవరిలో అయితే ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. ఇలాంటి గణాంకాలు చూస్తే, భారీ హైపుతో మార్కెట్లోకి వచ్చిన X-Trail పూర్తిగా పట్టాలు తప్పిందని స్పష్టంగా తెలుస్తోంది. ధర, పోటీ బ్రాండ్లకు సమర్థవంతంగా తలపడలేకపోవడం, నిస్సాన్ బ్రాండ్‌పై ఉన్న భవిష్యత్ అనిశ్చితి మొదలగు అన్ని కలిసి ఈ SUVకి మార్కెట్లో చోటు దొరకనివ్వలేదు. ఇది నిస్సాన్ కంపెనీ పెద్ద చేదు కలిగించే విషయం.
ప్రస్తుతం నిస్సాన్ ఇండియాలో చాలా విపరీత పరిస్థితిలో ఉంది. దేశంలో విస్తృతంగా పనిచేస్తున్న అనేక విదేశీ కార్ బ్రాండ్లు పలు మోడళ్లతో, విభిన్న బాడీ స్టైల్ వేరియంట్లతో మార్కెట్లో తమ స్థానాన్ని బలపరుస్తున్నాయి. హ్యాచ్‌బ్యాక్, సెడాన్, SUV, MPV ఇలా అన్ని సెగ్మెంట్లలోనూ పోటీకి దిగుతున్నాయి. కానీ నిస్సాన్ మాత్రం పూర్తిగా ఒకే కారుపై.. మాగ్నైట్ పై ఆధారపడుతోంది. ఇది ఎంత వరకు సాధ్యమవుతుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశం.

మిగతా బ్రాండ్లన్నీ తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించుతూ ఉండగా, నిస్సాన్ మాత్రం ఒకే ఒక SUVతో మార్కెట్లో నిలదొక్కుకునేందుకు కృషి చేస్తోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం నిస్సాన్ సమీప భవిష్యత్తులో కొన్ని కొత్త SUVలు, MPVలు విడుదల చేయాలని యోచిస్తోంది. ఇది గనక నిజం అయితే, బ్రాండ్‌కు ఇది ఒక రివైవల్ ఛాన్స్ అవుతుంది. లేకపోతే, భారత మార్కెట్‌లో బ్రాండ్ నిలదొక్కుకోవడం మరింత కష్టం కావచ్చు.
నిస్సాన్ మాగ్నైట్‌కి భారత మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. 2020లో ప్రారంభమైన ఈ SUV ఇప్పటివరకు 2 లక్షలకు పైగా కుటుంబాల్లోకి చేరి తనదైన స్థానం సంపాదించుకుంది. దీని ధర రూ. 6.14 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది, అందుబాటులో ఉండే SUVగా పేరు తెచ్చుకుంది. 2024 అక్టోబర్‌లో, నిస్సాన్ మాగ్నైట్‌కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పరిచయం చేసింది.

వినియోగదారుల కోసం ఇటీవల మాగ్నైట్‌కి రెట్రోఫిట్ CNG కిట్‌ను ప్రవేశపెట్టింది. ఈ కిట్ ధర రూ. 75,000. దీని ఇంజిన్ విషయానికి వస్తే, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 75 bhp శక్తి, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు లభిస్తాయి. ఇది మంచి మైలేజ్ ఇవ్వగలదు. పెట్రోల్ వేరియంట్‌లు 19.5 kmpl మైలేజ్ ఇస్తాయి.


Click it and Unblock the Notifications








