ఈ 7 సీటర్ కారుని జనవరిలో దీన్ని ఒక్కరంటే ఒక్కరు కూడా కొనలేదు.. పాపం కంపెనీకి మెయింటైనెన్స్ దండగా!
భారత్‌లో సాధారణ కార్లతో పోలిస్తే లగ్జరీ కార్లకు డిమాండ్ కాస్త తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది వినియోగదారులు తక్కువ ధరలో కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్... తమ లగ్జరీ ఎస్‌యూవీ నిస్సాన్ ఎక్స్-ట్రయల్ కారుతో కష్టాలు ఎదుర్కొంటోంది. సేల్స్‌లో ఈ కారు రోజురోజుకు దిగజారిపోతోంది. టయోటా ఫార్చ్యూనర్ వంటి కార్లు దీనికి పోటీగా ఉన్న నేపథ్యంలో ఇది వినియోగదారులకు చేరువయ్యేందుకు చాలా శ్రమించాల్సి వస్తోంది. 2025 జనవరి నెలలో ఈ కారును ఏ ఒక్కరూ కూడా కొనుగోలు చేయలేదు. పైగా.. ఆరు నెలల వ్యవధిలో కారు అమ్మకాలు 22 యూనిట్లుగానే ఉన్నాయి.
నిస్సాన్ సంస్థ నుంచి ఈ ఎక్స్- ట్రయల్ కారు సేల్స్‌లో అంతగా రాణించకపోయినప్పటికీ.. ఈ బ్రాండ్ నుంచి మిగతా కారు మోడళ్లైన నిస్సాన్ మ్యాగ్నైట్ వంటి కార్లు వినియోగదారులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. తద్వారా ఈ కంపెనీ ఓవరాల్ సేల్స్ విషయంలో భారత మార్కెట్లో బాగానే దూసుకుపోతోంది.

ఈ ఎక్స్- ట్రయల్ కారు అమ్మకాల విషయానికి వస్తే గత ఆరు నెలలుగా ఈ కారు అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ వ్యవధిలో ఈ కారు అమ్మకాలు కేవలం 22 యూనిట్లు మాత్రమే జరిగాయి. ఈ జనవరి 2025 సేల్స్.. నిస్సాన్ ప్రొడక్ట్ లైన్-అప్‌లో మరింత చేదు జ్ఞాపకాల్ని మిగిల్చాయి.
నిస్సాన్ సంస్థ నుంచి మ్యాగ్నైట్ మోడల్ కారు అమ్మకాలు జనవరి నెలలో 2,404 యూనిట్లుగా నమోదు కాగా.. X-Trail కారు అమ్మకాలు మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా జరగలేదు. ఈ జీరో పర్ఫార్మెన్స్ సేల్స్... గత ఆరు నెలలుగా కొనసాగుతున్న దీని సేల్స్ పతనంలో భాగంగానే ఇది కొనసాగిందని చెప్పవచ్చు. ఇది లగ్జరీ ఎస్‌యూవీల విషయంలో ఎదుర్కోబోయే సవాళ్లను చూపిస్తోంది.

ఇక ఈ ఎక్స్-ట్రయల్ ఆరు నెలల అమ్మకాల పూర్తి వివరాలను పరిశీలిస్తే.. 2024 సెప్టెంబరు నెలలో 13 యూనిట్ల అమ్మకాలతో అత్యధిక సేల్స్ నమోదయయ్యాయి. కానీ, 2025 జనవరి నెలకు వచ్చేసరికి ఈ విక్రయాలు సున్నా యూనిట్లకు పడిపోయాయి. ఇది నెలవారీ విక్రయాల వ్యత్యాసం 100 శాతం పతనాన్ని చూపెడుతోంది. భారత ఎస్‌యూవీ మార్కెట్లో అత్యధిక పోటీ ఉన్న డీ1 సెగ్మెంట్‌లో ఎక్స్- ట్రయల్ కారును తీసుకువచ్చారు.
స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, టయోటా ఫార్చ్యూనర్, ఇసుజు ఎంయూ-ఎక్స్, ఎంజీ గోల్‌స్టర్ వంటి కార్లకు ఇది పోటీగా ఉంటుంది. దీని ఆకర్షణీయమైన ఫీచర్లు, బ్రాండ్ వ్యాల్యూ ఉన్నప్పటికీ.. ఎక్స్-ట్రయల్ కారు విక్రయాలు మాత్రం అంతంతగానే ఉండడం గమనార్హం. ఈ నిస్సాన్ ఎక్స్-ట్రయల్ (దిల్లీలో ఎక్స్ షోరూం) ధర రూ.49.92 లక్షలతో భారత మార్కెట్లో ఎన్నో అంచనాల మధ్య లాంఛ్ చేశారు.

ఇంపోర్టెడ్ ఎస్‌యూవీ అయిన ఈ కారులో.. 7 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో- హోల్డ్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, 360- డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు, కాంపిటీటివ్ ప్రైజింగ్ ఉన్నప్పటికీ.. కొత్త మోడళ్ల ప్రవేశంతో భారత మార్కెట్లో ఈ కారు కష్టాలు ఎదుర్కొంటోంది. జనవరి నెలలో జీరో సేల్స్ నమోదవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: మొత్తం సేల్స్ విషయంలో భారత్‌లో నిస్సాన్ సంస్థ వృద్ధిని కనబర్చినప్పటికీ.. ఈ ఎక్స్- ట్రయల్ కారు మాత్రం మరో కోణాన్ని చూపెడుతోంది. జనవరి నెలలో సున్నా సేల్స్ నమోదు కావడం, ఆరు నెలలో 22 యూనిట్లు మాత్రమే విక్రయించగలగడం... ఈ లగ్జరీ ఎస్‌యూవీ తన ప్రాభవాన్ని కాపడుకోవడానికి కష్టాలు పడుతోందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








