ఫీచర్లు తక్కువైనా ఫర్వాలేదు.. రేంజ్ ఎక్కువ కావాలి.. కొత్త ప్లాన్‌తో మార్కెట్ దున్నేసే ప్లాన్లో మహీంద్రా !
భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న XEV 9e, BE 6ఎలక్ట్రిక్ మోడళ్ల డెలివరీని మహీంద్రా 2025 మార్చి 20న ప్రారంభించింది. ప్రస్తుతం టాప్-స్పెక్ ప్యాక్ 3వేరియంట్ల పంపిణీని కంపెనీ షురూ చేసింది. దాదాపు 40 రోజుల్లో 6,300 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ ఎస్యూవీలను వినియోగదారులకు సక్సెస్‌ఫుల్‌గా డెలివరీ చేసినట్లు కంపెనీ తెలిపింది. భారీ డిమాండ్ కారణంగా ఈ రెండు మోడళ్ల వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు ఐదు నెలల వరకు పెరిగింది.
రిజర్వేషన్లు ప్రారంభించిన మొదటి రోజే 30,179 బుకింగ్‌లు రావడంతో ఈ ఎలక్ట్రిక్ మోడళ్లకు ఉన్న డిమాండ్ స్పష్టంగా కనిపించింది. కూపే స్టైల్లో వచ్చే XEV 9e మోడల్‌కు అత్యధిక డిమాండ్ ఉంది. 59 శాతానికి పైగా వినియోగదారులు అత్యధిక వేరియంట్ అయిన ప్యాక్ 3ని ఎంచుకున్నారు. బుకింగ్‌లు భారీగా పెరుగుతుండడంతో వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి కంపెనీ XEV 9e, BE 6 ప్రొడక్షన్ పెంచింది.

ప్యాక్ 3 సెలెక్ట్ డెలివరీలు వచ్చే నెల ప్రారంభంలో షురూ అవుతాయి. 2025 జూలైలో మిడ్-స్పెక్ ప్యాక్ 2 వేరియంట్‌ల డెలివరీ షెడ్యూల్ చేసింది కంపెనీ. బేస్ ప్యాక్ 1, కొంచెం ఎక్కువ ఫీచర్లు ఉన్న ప్యాక్ 1 ఎబోవ్ డెలివరీ ఆగస్టులో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన బుకింగ్‌లలో 75 శాతానికి పైగా పెద్దదైన 79కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే టాప్-స్పెక్ ప్యాక్ 3 వేరియంట్‌లకేనని కంపెనీ వెల్లడించింది.
అయితే, త్వరలోనే తక్కువ ట్రిమ్‌లలో పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ప్రవేశపెట్టడానికి మహీంద్రా యోచిస్తున్నట్లు తాజా నివేదికలు తెలుపుతున్నాయి. వినియోగదారులు ఈవీలలో ఎక్కువ ఫీచర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను కోరుకుంటున్నట్లు కంపెనీ గుర్తించింది. దీనిని పరిష్కరించడానికి మహీంద్రా BE 6, XEV 9e కొత్త వేరియంట్‌లను రిలీజ్ చేయవచ్చు.

ఈ కొత్త వేరియంట్‌లలో 79కిలోవాట్స్ బ్యాటరీ తక్కువ ఫీచర్లతో మరింత బడ్జెట్ ధరల్లో అందుబాటులో ఉంటుంది. ఇది వినియోగదారుల సంఖ్యను పెంచడానికి, ఎక్కువ అమ్మకాలు పొందడానికి సాయపడుతుందని కంపెనీ భావిస్తోంది. XEV 9e, BE 6తో సహా మహీంద్రా న్యూజెన్ ఎలక్ట్రిక్ వెహికల్ సిరీస్ లేటెస్ట్ INGLO స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగిస్తుంది. మహీంద్రా భవిష్యత్తు ఈవీలు ఈ మోడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పైనే నిర్మించబడతాయి.
ప్రస్తుతం మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ జంటల్లో 59 kWh, 79 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ ఛార్జ్‌పై 656 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ 542 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను కలిగి ఉంది. మహీంద్రా XEV 9e ధర రూ.21.90 లక్షల నుంచి రూ.30.50 లక్షల వరకు ఉంటుంది.
BE 6 ఎలక్ట్రిక్ ఎస్యూవీ ధర రూ.18.90 లక్షల నుంచి రూ.26.90 లక్షల వరకు ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఫీచర్లు కొంచెం తగ్గినా, అందుబాటు ధరలో ఎక్కువ రేంజ్ ఉన్న వేరియంట్‌లు వస్తే భారతీయులు వాటినే కొనుగోలు చేస్తారు. మహీంద్రా ఈ మార్పును ఎప్పటి నుంచి తీసుకుని వస్తుందన్న విషయం మాత్రం కచ్చితంగా తెలియదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








