ఇళ్లు కంటే ఖరీదైంది! ఈ కారును 10 లక్షల మంది కొన్నారు.. మరి దీనిలో అంత స్పెషల్ ఏం ఉంది?
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు పోర్స్చే (porsche) తన కార్ల లైనప్‌లో మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లలో ఒకటైన పోర్స్చే మకాన్ (Porsche Macan) ఇప్పుడు బ్రాండ్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. అత్యున్నత విలాసం, శక్తివంతమైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ కారు, ధర పరంగా మామూలు వినియోగదారులకు అందుబాటులో లేకపోయినా, గ్లోబల్ మార్కెట్‌లో అమ్మకాల పరంగా విపరీతంగా ఆకట్టుకుంది. మకాన్‌ను పోర్స్చే 12 సంవత్సరాల క్రితం పరిచయం చేసింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ ఒక్క మోడల్‌నే 10 లక్షల యూనిట్లు (1 మిలియన్ కార్లు) ప్రపంచవ్యాప్తంగా విక్రయించగలిగింది. ఒక్క కారును ఏకంగా 10 లక్షల మంది కొన్నారంటే ఈ కారులో ఎదో తెలియని ప్రత్యేకత ఉండే ఉంటుంది.
మకాన్ సేల్స్ ఇప్పుడు కంపెనీకి గర్వకారణంగా మారింది. ప్రత్యేకంగా చూస్తే, పోర్స్చేకి చెందిన లెజెండరీ 911 స్పోర్ట్స్ కార్ కూడా ఈ స్థాయిలో అమ్మకాలు నమోదు చేయడానికి 54 సంవత్సరాల సమయం పట్టింది. కానీ మకాన్ మాత్రం కేవలం 12 ఏళ్లలోనే ఈ గణాంకాన్ని అధిగమించడం విశేషమే. ఈ SUVకి ఉన్న అద్భుతమైన డిమాండ్ దాని స్టైల్, పనితీరు, ఫీచర్లతో పాటు పోర్స్చే బ్రాండ్‌కు ఉన్న ప్రతిష్టను చూపిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా చైనా, అమెరికా, యూరప్ మొదలగు చోట్ల ఈ మోడల్‌కు మంచి ఆదరణ లభించడంతో, మకాన్ కంపెనీ అమ్మకాల ఎదుగుదలకు ప్రధానమైన నిలయంగా మారింది. పోర్స్చే మకాన్.. ఒక లగ్జరీ SUV మాత్రమే కాదు, పోర్స్చే బ్రాండ్‌కు గ్లోబల్ సక్సెస్‌ను తీసుకువచ్చిన కీలక మోడల్. మొదటిసారిగా 2013లో పరిచయమైన ఈ కారు, తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అమ్ముడైన పోర్స్చే మోడల్‌గా గుర్తింపు పొందింది.
జర్మనీలోని పోర్స్చే ప్లాంట్‌లో తయారు అయ్యే మకాన్, నాణ్యత, స్టైల్, పనితీరు అన్నింటిలోనూ బెన్చ్‌మార్క్‌గా నిలిచింది. పోర్స్చే కయెన్ వంటి SUV మోడల్‌కి 1 మిలియన్ యూనిట్ల అమ్మకాలకు 18 సంవత్సరాలు పట్టిన సమయంలో, మకాన్‌కి అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం 12 సంవత్సరాలు మాత్రమే పట్టింది. ఈ డైనమిక్ SUVతో, పోర్స్చే ఇప్పటి వరకు 1 మిలియన్ కంటే ఎక్కువ అమ్ముడైన మోడళ్ల జాబితాలో మూడో కారును చేర్చుకుంది.

పోర్స్చే 911, కయెన్ తర్వాత మకాన్ కూడా ఆ గౌరవాన్ని పొందింది. మకాన్ SUVలలో అసలైన స్పోర్ట్స్ క్యారెక్టర్‌ను కలిగి ఉంది. ఇది 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది, 261 బీహెచ్‌పీ పవర్, 400Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తివంతమైన కాంబినేషన్ వల్ల, మకాన్ కేవలం 6.4 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.
దీని టాప్ స్పీడ్ గంటకు 232 కి.మీ. ఇది ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చింది. కంపెనీ ప్రస్తుతం ఈవీపై ఎక్కువ ఫోకస్ చేసింది. మకాన్ ఎలక్ట్రిక్ కారులో 100kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే దాదాపు 641 కి.మీ వరకు వెళ్లగలదు. ఇండియాలో పెట్రోల్ ఇంజిన్ కారు ధర రూ.88.06 లక్షలకు అమ్ముడవుతోంది, ఎలక్ట్రిక్ వెర్షన్ ధర రూ. 1.21 కోట్లు. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








