కాంపాక్ట్ ఎస్‌యూవీల సమరం.. క్రెటా, విక్టోరిస్, గ్రాండ్ విటారాలో ఏది బెస్ట్?
మారుతున్న కాలానికి తగ్గట్టు, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ విభాగంలో ఇప్పటికే తన సత్తా చాటుతున్న హ్యుందాయ్ క్రెటాకు, మారుతి సుజుకి నుంచి తాజాగా వచ్చిన విక్టోరిస్ గట్టి పోటీ ఇస్తోంది. ఈ రెండింటితో పాటు, ప్రీమియం విభాగంలో ఉన్న మారుతి గ్రాండ్ విటారా కూడా కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ఫీచర్లు, ధర, ఇంజన్ పరంగా ఈ మూడు ఎస్‌యూవీలలో ఏది బెస్ట్? కొనుగోలుదారులు దేనిని ఎంచుకోవాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏది చవక? ఏది ఖరీదైనది?
మారుతి సుజుకి విక్టోరిస్ను కంపెనీ చాలా తెలివిగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.10.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి మొదలై, టాప్-స్పెక్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ రూ.19.99 లక్షల వరకు ఉంది. ఈ ధర గ్రాండ్ విటారా కంటే కాస్త తక్కువగా ఉంది. ఇది కస్టమర్‌లను విక్టోరిస్ వైపు ఆకర్షించడానికి ప్రధాన కారణం.

ఇక, సెగ్మెంట్‌లో బెంచ్‌మార్క్‌గా ఉన్న హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ధర రూ.10.72 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది. అయితే, క్రెటాలో ట్రర్బో-పెట్రోల్, డీజిల్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.20 లక్షలు దాటి, ఫీచర్లు ఎక్కువగా ఉన్న టాప్ వేరియంట్ సుమారు రూ.24 లక్షల వరకు చేరుకుంటుంది.
గ్రాండ్ విటారా ధర కూడా దాదాపు విక్టోరిస్‌తో సమానంగా ఉన్నా, విక్టోరిస్ టాప్ వేరియంట్‌కు, గ్రాండ్ విటారా టాప్ వేరియంట్‌కు మధ్య సుమారు రూ.90,000 తేడా ఉంది. దీనితో విక్టోరిస్ అత్యంత ఎక్కువ ఫీచర్లను అందిస్తూనే రూ.20 లక్షల లోపు లభిస్తున్న బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
టెక్నాలజీ, సేఫ్టీలో ఏది బెస్ట్
ఫీచర్ల విషయంలో మారుతి సుజుకి విక్టోరిస్ అదరగొడుతోంది. ఇందులో సేఫ్టీకి పెద్ద పీట వేశారు. లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు, 10.25-అంగుళాల డిజిటల్ కాక్‌పిట్, 64 రంగుల యాంబియెంట్ లైటింగ్, డాల్బీ అట్మోస్‌తో కూడిన ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు విక్టోరిస్ కేబిన్‌ను చాలా ఆధునికంగా మార్చాయి.

హ్యుందాయ్ క్రెటా కూడా ఫీచర్లలో వెనుకబడి లేదు. దీనిలో కూడా ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, బోస్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. క్రెటా ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఎక్కువ వేరియంట్లు ఉండడం వల్ల, కస్టమర్ తన బడ్జెట్‌కు తగ్గట్టుగా నచ్చిన ఫీచర్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
గ్రాండ్ విటారా విషయానికి వస్తే.. ఇది ఆధునిక ఫీచర్ల కంటే ప్రీమియం లుక్, రిఫైన్‌మెంట్పై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇందులో వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నప్పటికీ.. విక్టోరిస్, క్రెటాలో ఉన్న ADAS ఫీచర్ ఇందులో లేదు. అందుకే ఇది టెక్నికల్‌గా కొంత వెనుకబడినట్లు కనిపిస్తుంది. అయితే, మారుతి పట్ల నమ్మకం, మంచి డ్రైవింగ్ అనుభవం కోరుకునేవారికి ఇది బెస్ట్.
మైలేజ్, పవర్ దేనిలో ఎక్కువ?
విక్టోరిస్, గ్రాండ్ విటారా ఒకే ఇంజన్ ప్లాట్‌ఫారమ్‌పై తయారయ్యాయి. ఈ రెండింటిలోనూ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్-హైబ్రిడ్ ఆప్షన్లలో లభిస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ 102 బీహెచ్‌పీ పవర్, స్ట్రాంగ్ హైబ్రిడ్ 114 బీహెచ్‌పీ పవర్ ఉత్పత్తి చేస్తాయి. మైలేజ్ పరంగా ఈ రెండు ఎస్‌యూవీలు చాలా మెరుగ్గా ఉంటాయి.

అంతేకాకుండా, గ్రాండ్ విటారా, విక్టోరిస్ రెండింటిలోనూ, కొన్ని వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా లభిస్తుంది. ఇది ఆఫ్-రోడింగ్‌కు ఉపయోగపడుతుంది. తక్కువ రన్నింగ్ కాస్ట్ కోరుకునేవారి కోసం సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
హ్యుందాయ్ క్రెటా విషయానికి వస్తే.. ఇందులో ఇంజన్ ఆప్షన్లు చాలా ఎక్కువ. ఇది 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, పవర్ఫుల్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లలో లభిస్తుంది. దీని పవర్ అవుట్‌పుట్ 113 బీహెచ్‌పీ నుండి టర్బో వేరియంట్‌లో అత్యధికంగా 158 బీహెచ్‌పీ వరకు ఉంటుంది. మాన్యువల్, ఐవీటీ (IVT), డీసీటీ (DCT) వంటి ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. అయితే, క్రెటాలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు. కాబట్టి, ఇది సిటీలో ప్రయాణించేవారికి, పవర్‌ను కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్.
ఏ ఎస్‌యూవీ ఎవరికి బెస్ట్?
మారుతి సుజుకి విక్టోరిస్: మీరు గనుక రూ.20 లక్షల లోపు అత్యధిక ఫీచర్లు, లేటెస్ట్ సేఫ్టీ (ADAS), స్ట్రాంగ్ హైబ్రిడ్ వల్ల మెరుగైన మైలేజ్, AWD ఆప్షన్ కోరుకుంటే, విక్టోరిస్ మీకు బెస్ట్ ఛాయిస్.
హ్యుందాయ్ క్రెటా: మీకు పవర్ (టర్బో పెట్రోల్), డీజిల్ ఇంజన్ ఆప్షన్, ఫీచర్ల కాన్ఫిగరేషన్‌లో ఎక్కువ వెరైటీ కావాలంటే, హ్యుందాయ్ క్రెటాను ఎంచుకోవచ్చు. ఇది పవర్‌ఫుల్ అర్బన్ ఎస్‌యూవీ.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా: మీకు ప్రీమియం రిఫైన్‌మెంట్, నిరూపితమైన మారుతి ఇంజన్, AWD ఆప్షన్, మైలేజ్ ముఖ్యమైతే, గ్రాండ్ విటారా బెస్ట్ ఆప్షన్.


Click it and Unblock the Notifications








