రేసులో దూసుకుపోతున్న పంచ్..5-స్టార్ రేటింగ్, జీఎస్టీ తగ్గింపుతో భయపడకుండా కొనేస్తున్నారు!
చాలా తక్కువ సమయంలోనే భారతీయ ప్రజల హృదయాలను గెలుచుకున్న టాటా కార్ మోడల్ పంచ్ (Punch). తక్కువ ధర, ఆకర్షణీయమైన డిజైన్, కుటుంబ ప్రయాణాలకు సరిపడా స్థలం, బెస్ట్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తున్న ఈ కారును భారతీయులు కాదనలేకపోతున్నారు అనడానికి దాని అమ్మకాల రిపోర్ట్‌లే సాక్ష్యం. ఈ సంవత్సరం కొన్ని నెలల పాటు టాటా పంచ్ అమ్మకాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ, జీఎస్టీ 2.0 సంస్కరణల తర్వాత టాటా నెక్సాన్ మాదిరిగానే పంచ్ అమ్మకాలు కూడా బాగా మెరుగుపడ్డాయి.
2025 నవంబర్ నెలకు సంబంధించిన పంచ్ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, గాడివాడి విడుదల చేసిన నివేదిక ప్రకారం..నవంబర్ 2025లో టాటా పంచ్ అమ్మకాలు ఏకంగా 18,753 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు 2024 నవంబర్‌లో అమ్మకాలు 15,435 యూనిట్లుగా ఉండేవి. అంటే, సంవత్సరంలో 3,318 యూనిట్లు అదనంగా విక్రయించబడ్డాయి. దీంతో వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 21 శాతం పెరిగాయి.

ఈ అద్భుతమైన అమ్మకాలతో, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో పంచ్ నాలుగో స్థానానికి చేరుకుంది. టాటా నెక్సాన్, మారుతి డిజైర్, మారుతి స్విఫ్ట్ వంటి మోడల్స్ మాత్రమే పంచ్ కంటే ముందున్నాయి. సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో టాటా నెక్సాన్ తర్వాత పంచ్ రెండో స్థానంలో ఉంది.
ప్రస్తుతం టాటా పంచ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.50 లక్షల నుంచి రూ.9.30 లక్షల వరకు ఉంది. సెప్టెంబర్ 22న జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలులోకి రాకముందు, టాటా పంచ్‌పై 29 శాతం పన్ను (1 శాతం సెస్ కలిపి) ఉండేది. కానీ ఇప్పుడు సవరించిన జీఎస్టీ స్లాబ్‌ల ప్రకారం సెస్ పూర్తిగా మినహాయించబడటంతో, కేవలం 18 శాతం పన్ను మాత్రమే విధిస్తున్నారు.

ఈ జీఎస్టీ సంస్కరణల ఫలితంగా పంచ్ ధర రూ. 1.08 లక్షల వరకు తగ్గింది. ముఖ్యంగా క్రియేటివ్ ప్లస్ సన్‌రూఫ్ ఏఎమ్‌టీ కామో వెర్షన్‌పై అత్యధికంగా ధర తగ్గింది. ఇతర వేరియంట్లపై కూడా రూ. 66,000 నుంచి రూ. 1.07 లక్షల వరకు ధర తగ్గింది.
ఈ మైక్రో ఎస్‌యూవీలో 1.2 లీటర్, 3 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఉంది. ఇది 86 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మ్యాన్యువల్ (MT), ఏఎమ్‌టీ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడింది. అలాగే ఈ కారులో సీఎన్‌జీ (CNG), ఎలక్ట్రిక్ (EV) ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ 21 కి.మీ/లీ మైలేజ్ ఇవ్వగా, సీఎన్‌జీ వేరియంట్ 27 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది.

టాటా పంచ్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ప్రత్యేకంగా వెనుక ఏసీ వెంట్స్, టైప్-సి యుఎస్‌బి ఫాస్ట్ ఛార్జర్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ విషయంలో టాటా పంచ్ అగ్రస్థానంలో ఉంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పంచ్ పొందింది. గత సంవత్సరం విడుదలైన పంచ్ ఈవీ కూడా భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తక్కువ ధరకు సురక్షితమైన కారు కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది అద్భుతమైన ఆప్షన్.
భారత మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి, మధ్యతరగతి, మొదటిసారి కారు కొనుగోలు చేస్తున్న వారికి పంచ్ ప్రధాన ఎంపికగా ఉంది. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు సుమారు 1.60 లక్షల మంది ఈ కారును కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో పంచ్ ఖచ్చితంగా ఉంటుందని అంచనా.


Click it and Unblock the Notifications








