షోరూమ్‌కు వచ్చే ప్రతి 10 మందిలో 6 గురు ఈ కార్లనే కొంటున్నారు! ఏంటి గురూ.. అందరికి ఇవే నచ్చాయా?
భారతీయ ఆటోమొబైల్ రంగంలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యంత నమ్మకమైన కార్ల తయారీదారుగా నిలిచిన టాటా మోటార్స్ (Tata Motors), జూన్ 2025లో ఒక కీలక మలుపు తిరిగింది. ఇటీవల విడుదలైన సేల్స్ డేటా ప్రకారం, మొదటిసారిగా టాటా నెలవారీ అమ్మకాలు 40,000 యూనిట్లకు దిగువగా పడిపోవడం గమనార్హం. గత ఆరు నెలల కాలంలో ఇదే అత్యల్ప అమ్మకాలను నమోదు చేయడం కంపెనీకి ఒక హెచ్చరికగానే నిలిచింది. ఒకానొక సమయంలో టాటా మోటార్స్‌కి వెనుకబడిన మహీంద్రా, ఇప్పుడు తన విక్రయాలను బలపరచుకొని మారుతి తర్వాత రెండవ స్థానాన్ని ఆక్రమించడం కూడా ఆటోమొబైల్ రంగంలో కొత్త చర్చకు దారి తీస్తోంది. అయితే, ఈ పడిపోయిన గణాంకాల్లోనూ టాటా నెక్సాన్, పంచ్ అనే SUV మోడళ్లపై మాత్రం వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ వచ్చింది.
టాటా మోటార్స్ జూన్ 2025లో భారత్‌లో మొత్తం 37,083 కార్లను మాత్రమే విక్రయించింది. ఇది గతేడాది అదే నెలలో నమోదైన 43,527 యూనిట్లతో పోల్చితే సుమారుగా 15 శాతం తగ్గుదల కావడం గమనార్హం. ఇంతటి పేరున్న బ్రాండ్ అయినా, అమ్మకాల్లో ఈ రీతిగా తగ్గుదల రావడం పరిశ్రమలో చర్చనీయాంశమవుతోంది. అయితే నెక్సాన్, పంచ్ SUVలు మాత్రం ఎప్పటిలాగే కంపెనీకి గట్టి మద్దతుగా నిలిచాయి.

దీన్ని బట్టి చూస్తే, టాటా భవిష్యత్తులో మరింత ఫోకస్ వాటిపై పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ రెండు మోడళ్లు కలిపి మొత్తం టాటా కార్ల దేశీయ అమ్మకాలలో దాదాపు 60 శాతం వాటాను ఆక్రమించడం నిజంగా ఆ కంపెనీకి ఊపిరి పీల్చుకునే అవకాశం లాంటిది. జూన్ నెలలో నెక్సాన్ 11,602 యూనిట్లు, పంచ్ 10,446 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ మోడళ్ల పట్ల వినియోగదారుల నమ్మకం ఇంకా కొనసాగుతోంది.
ప్రస్తుతం టాటా భారత మార్కెట్లో ఎనిమిది మోడళ్లను విక్రయిస్తున్నా, షోరూమ్‌కి వచ్చే చాలా మంది కస్టమర్ల దృష్టి నెక్సాన్ లేదా పంచ్ పైనే ఉంటుంది. ఇంతవరకు పరిస్థితిని చూస్తే, టాటా అమ్మకాలను నిలబెట్టుకోవడంలో ఈ రెండు చిన్న SUVలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. జూన్ 2025లో టాటా మోటార్స్ అమ్మకాల గణాంకాలను చూస్తే, కంపెనీ పూర్తి స్థాయిలో నెక్సాన్, పంచ్ SUVల మీదే ఆధారపడుతున్నట్టుగా స్పష్టమవుతోంది.

టాటా అమ్మిన మొత్తం 37,083 కార్లలో, నెక్సాన్ (11,602 యూనిట్లు), పంచ్ (10,446 యూనిట్లు) కలిపి 22,048 యూనిట్లను విక్రయించాయి. అంటే, మొత్తం అమ్మకాలలో సుమారు 60 శాతాన్ని ఈ రెండు SUVలే నిలిపాయి. కంపెనీ లైనప్‌లోని ఇతర మోడళ్లతో పోల్చితే, వీటి ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది. మరోవైపు, టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ మే 2025లో కొత్తగా ఫేస్‌లిఫ్ట్ అవతారంలో మార్కెట్‌లోకి వచ్చింది.
ఇది జూన్‌లో 3,974 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. గతేడాది జూన్‌తో పోలిస్తే కేవలం 1 శాతం పెరుగుదల మాత్రమే. పెద్ద SUVల పరంగా, హారియర్, సఫారీ మోడళ్ల పరిస్థితి మరింత నిరాశ కలిగించేలా ఉంది. జూన్ 2025లో హారియర్ 1,259 యూనిట్లు, గతేడాది(1,347)తో పోలిస్తే 7 శాతం తగ్గుదల. అలాగే, సఫారీ అమ్మకాలు కేవలం 922 యూనిట్లు మాత్రమేగా నమోదయ్యాయి, ఇది జూన్ 2024తో పోలిస్తే 34 శాతం తగ్గుదల.

నెక్సాన్, పంచ్ తర్వాత టాటా మోటార్స్‌లో మూడవ అత్యధికంగా అమ్ముడైన మోడల్ టాటా టియాగో. అయితే, ఈ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ నెక్సాన్, పంచ్ స్థాయికి చేరుకోవడమే కాదు, దానికి దగ్గరగా కూడా రాలేకపోయింది. జూన్ 2025లో టియాగో అమ్మకాలు 6,032 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇదే సమయంలో, జూన్ 2024లో 5,174 యూనిట్లను మాత్రమే అమ్మిన టియాగో, 17 శాతం వృద్ధిని సాధించింది.


Click it and Unblock the Notifications








