ఒకే ఒక మోడల్ ఆధారంగా బ్రతుకుతున్న నిస్సాన్.. రెనాల్ట్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే!
ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నా, భారతదేశ మార్కెట్లో మాత్రం ఇప్పటికీ అంత స్థిరపడలేక పోతోంది. గత కొన్నేళ్లుగా రెనాల్ట్ దేశీయ ఆటోమొబైల్ రంగంలో తన స్థానాన్ని బలపరచడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, అనుకున్న స్థాయిలో అమ్మకాలను సాధించలేకపోతుంది. దేశీయంగా ప్రముఖ కార్ల తయారీదారులు అయినటువంటి మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీల నుంచి రెనాల్ట్ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది. మారుతున్న ప్రజల ఇష్టాలకు అనుగుణంగా ఇవి పోటా పోటీగా లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్‌తో కూడిన కార్లను విడుదల చేస్తుండటం కారణంగా కస్టమర్లు రెనాల్ట్ వైపు కాకుండా వీటిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. భారత వినియోగదారుల అభిరుచులు, గట్టి పోటీ కారణంగా, చాలా కాలంగా రెనాల్ట్ ఆశించిన ఫలితాలు అంతగా లభించటం లేదు.
తాజాగా విడుదలైన అమ్మకాల ప్రకారం, రెనాల్ట్ కంపెనీ కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. 2025 ఏప్రిల్ నెలలో రెనాల్ట్ కేవలం 2,602 కార్లను మాత్రమే విక్రయించగలిగింది. ఇది గత ఏడాది అంటే, 2024 ఏప్రిల్ నెలలో 3,707 కార్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే అమ్మకాలు దాదాపు 30 శాతం వరకు తగ్గిపోయాయి. రెనాల్ట్ భారత మార్కెట్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది.

కంపెనీ విక్రయిస్తున్న మూడు ప్రముఖ కార్ మోడళ్ల అమ్మకాలలో ఒకేసారి వచ్చిన గణనీయ తగ్గింపు కారణంగా అమ్మకాల సంఖ్యపై ప్రతికూల ప్రభావం పడింది. గతంలో రెనాల్ట్‌కు మార్కెట్లో నిలకడనిచ్చిన కారు ట్రైబర్, ఈసారి కూడా అత్యధికంగా అమ్ముడైనప్పటికీ, అమ్మకాల పరంగా అది కూడా జోరును కోల్పోయింది. ఏప్రిల్ 2024లో ట్రైబర్ అమ్మకాలు 1,671 యూనిట్లుగా నమోదయ్యాయి. కానీ 2025 ఏప్రిల్‌కు అదే ట్రైబర్ కేవలం 1,401 యూనిట్లకు పరిమితమైంది.
అంటే, ఏకంగా 16 శాతం అమ్మకాలు తగ్గాయి. ఇది కంపెనీకి ఒక హెచ్చరికలాంటిదే. ట్రైబర్ భారత్‌లో రెనాల్ట్‌కి పేరు తీసుకొచ్చినా, మారుతున్న పోటీకి తట్టుకోలేకపోతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదే తరహాలో, ట్రైబర్ తర్వాతి స్థానంలో ఉన్న కిగర్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు. కేవలం 606 యూనిట్లు మాత్రమే ఏప్రిల్ 2025లో అమ్ముడయ్యాయి. అంతేకాక, రెనాల్ట్‌కి ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌లో క్విడ్, ఇప్పుడు విక్రయాల్లో కేవలం 595 యూనిట్ల వరకే పరిమితమైంది.

మొత్తంగా చూస్తే, రెనాల్ట్ తన ప్రధాన మోడళ్లతోనూ మార్కెట్‌లో పట్టును సాధించలేకపోతుంది. మూడు మోడళ్ల నుంచి వచ్చే మొత్తం అమ్మకాలే గణనీయంగా తగ్గిపోవడం వల్లే రెనాల్ట్ విక్రయాల పరంగా ఇబ్బందుల్లో పడుతోంది. రెనాల్ట్ భారత్‌లో ఎక్కువ కాలం నిలవాలంటే సరికొత్త వ్యూహాలు అవసరమనే స్పష్ట సంకేతాన్ని ఇస్తోంది. మరోవైపు రెనాల్ట్‌తో పొత్తు కుదుర్చుకున్నటువంటి నిస్సాన్ కూడా ఇదే విధమైన అమ్మకాలను నమోదు చేస్తుంది.
ఏప్రిల్ 2025లో నిస్సాన్ 1,749 మాగ్నైట్ కార్లను విక్రయించింది. ఇదే సమయంలో, 2024 ఏప్రిల్‌లో ఈ సంఖ్య 2,404 యూనిట్లుగా ఉంది. అంటే, ఒక్క సంవత్సరం వ్యవధిలో 27 శాతం అమ్మకాల్లో తగ్గుదల నమోదైంది. ఇది ఎంట్రీ సెగ్మెంట్ SUVల మధ్య పెరుగుతున్న పోటీ, వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులు, లేదా నిస్సాన్ నుంచి కొత్తగా ఏమీ రాకపోవడం వంటి కారణాల వలన జరిగింది.

మాగ్నైట్‌తో పాటు నిస్సాన్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఇంకొక మోడల్ ఎక్స్-ట్రెయిల్ ఏప్రిల్ 2025లో కేవలం 76 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది. మొత్తానికి చూస్తే, నిస్సాన్ భారత మార్కెట్లో నిలదొక్కుకోవడానికి మాగ్నైట్ ఒక్కటే బలంగా మిగిలింది. రెనాల్ట్, నిస్సాన్ 1999లో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కంపెనీలు ఇండియాలో తమ వ్యాపారాన్ని కలిసి నిర్వహిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








