రూ.5.76 లక్షల్లో 7-సీటర్.. ఒక్క కారులో రెండు కుటుంబాలు! మిడిల్ క్లాస్‌కి బెస్ట్.. సేల్స్ చూస్తే తెలుస్తోంది
ఫ్రెంచ్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault) ఇండియా నవంబర్ 2025 నెలను చాలా సానుకూలమైన అమ్మకాలతో ముగించింది. ప్రత్యేకించి భారత కుటుంబాల మధ్య మంచి క్రేజ్ ఉన్న రెనాల్ట్ ట్రైబర్ (Triber) ఈసారి ఆశించిన దానికంటే మెరుగైన స్పందనను సొంతం చేసుకుంది. తాజాగా వెలువడిన నెలవారీ సేల్స్ రిపోర్ట్ ప్రకారం, ట్రైబర్ నవంబర్‌లో 2,064 యూనిట్లు అమ్ముడవుతూ మంచి దూకుడు చూపించింది. గత ఏడాది ఇదే నెలలో ఈ MPV 1,486 యూనిట్ల వద్ద నిలిచింది. అంటే, సంవత్సరం వ్యవధిలో ట్రైబర్ డిమాండ్ గణనీయంగా పెరిగి, 578 అదనపు యూనిట్ల వృద్ధిని నమోదు చేసింది. ట్రైబర్ సేల్స్‌లో కనిపించిన ఈ పెరుగుదల, ఈ మోడల్‌పై కస్టమర్ నమ్మకం ఎంత పెరిగిందో మరోసారి నిరూపించింది.
తక్కువ ధరలో 7-సీటర్ ఆప్షన్, విస్తారమైన కేబిన్, మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం వంటి అంశాలన్నీ కలిసి ఈ MPVకి మార్కెట్లో మళ్లీ బలం చేకూర్చాయి. ముఖ్యంగా నగరాల్లో చిన్న కుటుంబాలకు, టాక్సీ సెక్టార్‌లో నడిపేవారికి ట్రైబర్ బెస్ట్ విలువైన ఎంపికగా మారింది. నవంబర్ నెల మొత్తం కార్ల మార్కెట్‌లో పోటీ బాగా పెరిగినప్పటికీ, రెనాల్ట్ ట్రైబర్ మాత్రం తనకుంటూ ఓ స్థిరమైన స్థానాన్ని కాపాడుకుంది.

రెనాల్ట్ ట్రైబర్ అమ్మకాల పెరుగుదల వెనుక ఉన్న ముఖ్యమైన కారణాల్లో ఫేస్‌లిఫ్ట్ మోడల్ ప్రవేశపెట్టడం అత్యంత కీలక పాత్ర పోషించింది. గత జూలైలో భారత మార్కెట్లో విడుదలైన ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ కేవలం డిజైన్‌లోనే కాదు, ఫీచర్లలో కూడా గణనీయమైన అప్‌డేట్‌లతో వచ్చింది. ఈ కొత్త మోడల్ మరింత ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు, కుటుంబ వినియోగానికి అనువైన సౌకర్యాలతో మార్కెట్లో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.
ఇదే సమయంలో, GST తగ్గింపు రెనాల్ట్‌కు నిజంగా వరంగా మారింది. ధర నేరుగా తగ్గడంతో ట్రైబర్ మరింత అందుబాటు ధరలోకి వచ్చింది. 7-సీటర్ MPV కావడంతో, ఇప్పటికే అమ్మకాల్లో బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఈ మోడల్ మరింత వేగంగా కొనుగోలు దారులను ఆకర్షించింది. పెరిగిన విలువ-తగ్గిన ధర-కొత్త ఫీచర్లు... ఇవన్నీ కలిసి ట్రైబర్‌ను మళ్ళీ వినియోగదారుల ఫేవరేట్ MPVగా నిలబెట్టాయి.

ప్రస్తుతం భారత మార్కెట్లో రెనాల్ట్ ట్రైబర్ అందుబాటు ధరలో లభించే అత్యంత ప్రాక్టికల్ 7-సీటర్ MPVగా నిలుస్తోంది. ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర కేవలం రూ. 5.76 లక్షలు మాత్రమే ఉండటం, టాప్ వేరియంట్ కూడా రూ. 8.60 లక్షలు దాటకపోవడం కుటుంబ వినియోగదారుల్లో భారీ క్రేజును తీసుకొచ్చింది. ఈ ధరలు అన్నీ రెనాల్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఎక్స్-షోరూమ్ ధరలు.
అత్యంత చౌకగా లభిస్తున్నప్పటికీ, ట్రైబర్ అందించే ఫీచర్లు మాత్రం స్టాండర్డ్ MPVలకు ఏమాత్రం తగ్గవు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ట్రైబర్‌లో ఉన్న 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ నగర మరియు హైవే డ్రైవింగ్ రెండింటికీ సరిపోయేలా ట్యూన్ చేయబడింది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లు లభిస్తాయి.

ఈ కారులో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇది 7 సీటర్ కారు. రెండు కుటుంబాలు కలిగిన వారు ఈ కారులో హాయిగా ప్రయాణించచ్చు. లాంగ్ టూర్స్, ఫ్యామిలీ ట్రిప్స్‌కు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఇది మైలేజ్ కూడా సుమారు 19-20 కి.మీ/లీటర్ వరకు ఇస్తుంది.


Click it and Unblock the Notifications








