రూ.10 లక్షల్లోపు ధరలో సేఫ్ కార్ల కోసం చూస్తున్నారా? టెన్షన్ అవసరంలే.. ఈ కార్లు మీకోసమే!
కార్లను కొనేటప్పుడు రెండు విషయాలను ముఖ్యంగా మనం చూస్తాము. ఒకటి తక్కువ ధరలో ఉండాలి. రెండోది సేఫ్ కారు అయి ఉండాలి. ఈ రెండూ లక్షణాలతో ఉన్న కార్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అయితే... రూ.10 లక్షలలోపు ధరలో కూడా భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో సేఫెస్ట్ కార్లు భారత మార్కెట్లో ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. ఈ టెస్టులో మంచి రేటింగ్ సొంతం చేసుకున్న కార్లు సేఫ్టీ పరంగా ఉన్నతమైనవని అర్థం. మీరు ఒకవేళ రూ.10 లక్షల్లోపు ధరలో సేఫ్ కారు కోసం వెతుకుతున్నట్లయితే ఈ కథనం మీకోసమే. మీ బడ్జెట్‌లో ఏయే కార్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం.
టాటా కర్వ్: ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అందుబాటు ధరలో ఉన్న కార్లలో టాటా కర్వ్ ఒకటి. దీన్ని రూ.9.99 లక్షల ఎక్స్- షోరూమ్ వద్ద కొనుగోలు చేయవచ్చు. క్వాలిటీ విషయంలో టాటా మోటార్స్ సంస్థకు ఉన్న పేరు ఈ కర్వ్ కారు మరోసారి నిరూపించింది. క్రాష్ టెస్టులో ఇది అడల్ట్, చైల్డ్ ఆక్యుపెంట్ విభాగంలో 5-స్టార్ రేటింగ్ సాధించింది.

అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విషయంలో ఈ కర్వ్ కారు 32 పాయింట్లకు గాను 29.50 పాయింట్లు సాధించగా.. పిల్లల ప్రొటెక్షన్‌లో 49 పాయింట్లకుగాను 43.66 పాయింట్లు సొంతం చేసుకుంది. ఇక డైనమిక్ టెస్టుల్లో ఈ కారు 24 పాయింట్లకు 22.66 పాయింట్లు స్కోర్ చేసింది. అలాగే ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డీఫార్మెబుల్ బ్యారియర్ టెస్టులో ఈ కారు 16 పాయింట్లకు గాను 14.65 పాయింట్లు సాధించింది.
టాటా నెక్సాన్: టాటా నెక్సాన్ కారు ధర రూ.7.99 లక్షల వద్ద ప్రారంభమవుతుంది. ఇది కూడా అడల్ట్, చైల్డ్ ప్రొటెక్షన్లలో 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ అడల్డ్ ప్రొటెక్షన్‌కు సంబంధించి 32 పాయింట్లకుగాను 29.41 పాయింట్లు సాధించగా... చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విషయంలో 49 పాయింట్లకుగాను 48.83 పాయింట్లు స్కోర్ చేసింది.

మహీంద్రా XUV3XO: దేశీయ దిగ్గజ సంస్థ మహీంద్రా నుంచి వచ్చిన ఈ మహీంద్రా XUV3XO సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర రూ.7.79 లక్షలుగా ఉంది. ఇక సేఫ్టీ విషయంలో ఈ కారు 5-స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. అడల్ట్ రక్షణలో 32 పాయింట్లకు 29.36 పాయింట్లు సాధించింది. చైల్డ్ ఆక్యుపెంట్ రక్షణకు సంబంధించి 49 పాయింట్లకుగాను 43 పాయింట్లు స్కోర్ చేసింది.
మారుతి సుజుకి డిజైర్: మారుతి సుజుకి డిజైర్ కారు ధర రూ.6.79 లక్షలుగా ఉంది. మారుతి సంస్థ నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన తొలికారు ఈ డిజైర్ మోడలే కావడం గమనార్హం. ఈ కారు అడల్డ్ రక్షణ విభాగంలో 34 పాయింట్లకుగాను 31.24 పాయింట్లు స్కోర్ చేయగా... చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో 42 పాయింట్లకుగాను 39.20 పాయింట్లు సాధించింది.

టాటా పంచ్ ఈవీ: ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షల వద్ద ప్రారంభమవుతుంది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌కు సంబంధించి 32 పాయింట్లుకు గాను 31.46 పాయింట్లు దక్కించుకుంది. పిల్లల ప్రొటెక్షన్‌లో 49 పాయింట్లకుగాను 45 పాయింట్లు సాధించింది. ఫ్రంట్ ఆఫ్‌సెట్ డీఫార్మెబుల్ బ్యారియర్ టెస్టులో 16 పాయింట్లకు 14.26 పాయింట్లు సొంతం చేసుకుంది. మొత్తంగా ఈ కారు 5-స్టార్ రేటింగ్ సాధించింది.
ఇంకా మరెన్నో సేఫ్టీ కార్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ తక్కువ ధరలో మంచి సేఫ్టీ కార్లను అందిస్తోంది. ఈ సంస్థ నుంచి అందుబాటులో ఉన్న కార్లు మంచి ఛాసిస్‌తో వస్తున్నాయి. దీంతో ఈ కార్లకు మార్కెట్‌లోనూ మంచి డిమాండ్ లభిస్తోంది. ఇవే కాక ఈ మధ్య మహీంద్రా కార్లు కూడా సేఫ్టీలో అదరగొడుతున్నాయి.


Click it and Unblock the Notifications








