అయ్యో.. డెలివరీ కంటే ముందు ఆ కొత్త కారుకు యాక్సిడెంట్... సోషల్ మీడియాలో వైరల్.. అసలింతకీ ఏం జరిగిందంటే..?
కారు సేఫ్టీ విషయంలో వినియోగదారులకు అవగాహన పెరుగుతోంది. కారు కొనుగోలు చేసేటప్పుడు ధర, మైలేజీ వంటి వాటితో పాటు దాని సేఫ్టీ గురించి కూడా ఆరా తీస్తున్నారు. సేఫ్టీ రేటింగ్‌లో డీలా పడ్డ కార్ల విక్రయాలు చాలా వరకు తగ్గిపోతుండడం ఇందుకు సాక్ష్యంగా చెప్పవచ్చు. అయితే.. దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ స్కోడా.. కైలాక్ పేరుతో కొత్త ఎస్‌యూవీ మోడల్‌ను ఇటీవల లాంఛ్ చేసింది. ఈ కారు లాంఛ్ చేసిన కొన్ని గంటల్లోనే 10 వేల బుకింగ్స్ సాధించింది. ఈ కారు భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించింది. అయితే.. డెలివరీ ప్రారంభించక ముందే ఈ కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే...?
స్కోడా కైలాక్ కారు యాక్సిడెంట్ వీడియో.. ఇన్‌స్టాగ్రామ్ safecars_india అనే ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో... స్కోడా కైలాక్ కారు పెట్రోల్ పంపు నుంచి బయటకు వస్తుండగా వేగంగా వెళ్తున్న ఓ లారీ ఆ కారు పక్కభాగాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ఇది అంత పెద్ద ప్రమాదం కాకపోయినా.. కారు సైడ్‌ను మొత్తం లారీ గట్టిగా రాసుకుంటూ దూసుకెళ్లిన దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి.

కైలాక్ కారు డెలివరీలను ఈ మధ్యే ప్రారంభించారు. అందువల్ల ఈ కారు డీలర్ షిప్ వద్దకు తీసుకువెళ్తున్నదిగా తెలుస్తోంది. స్కోడా కైలాక్ కారు Classic, Signature, Signature Plus, Prestige అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే ఈ కారు.. Brilliant Silver, Carbon Steel, Candy White, Tornado Red, Deep Black, Lava Blue, Olive Gold అనే విభిన్న కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
స్కోడా నుంచి లాంఛ్ అయిన చిన్న ఎస్‌యూవీగా కైలాక్ మోడల్‌ను చెప్పవచ్చు. దీని చిన్న సైజు కారణంగా ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ కారు మోడర్న్- సాలిడ్ డిజైన్ ల్యాంగ్వేజ్‌తో తయారు చేశారు. దీంట్లో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, బాక్సీ ప్రొఫైల్, షార్ట్ ఓవర్‌హ్యాంగ్స్ ఉన్నాయి.

ఈ కారు ముందు భాగం... బటర్‌ఫ్లై గ్రిల్‌తో మోడర్న్ లుక్‌లో ఉంది. ఈ కారు అన్ని వేరియంట్లలో LED DRLs, హెడ్‌ల్యాంప్స్ స్డాండర్డ్‌గా ఉంటాయి. ఇది 17-అంగుళాల అలాయ్ వీల్స్‌తో ఉంటుంది. ఇక దీని ఫీచర్లలో కూడా వినియోగదారులను అసంతృప్తి చేయకుండా తీసుకువచ్చింది స్కోడా సంస్థ.
డిజిటల్ ఇన్స్టుమెంట్ క్లస్టర్, వైర్లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 10.1- అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం దీని టాప్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అదే సమయంలో దీని లోయర్ వేరియంట్లలో 5- అంగుళాల టచ్ స్క్రీన్, సెమీ- డిజిటల్ క్లస్టర్ ఉంటాయి. ఈ కారులో ఫ్రంట్ రో ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్, వెంటిలేషన్‌తో ఉంటుంది.
వేరియంట్‌ను బట్టి సింగిల్, డ్యూయల్- టోన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, వేరియంట్లలో వివిధ రకాల ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్టరీ ఉంటుంది. అదే సమయంలో దీంట్లో టాప్ వేరియంట్ అయిన ప్రెస్టిజ్‌లో leatherette సీట్లు ఉంటాయి. ఈ కారు బూట్ స్పేస్ 446 లీటర్లుగా ఉంటుందని స్కోడా సంస్థ చెబుతోంది. అయితే.. రియర్ సీట్లను మడవడం ద్వారా దీంట్లో లగేజ్ స్పేస్‌ను 1,265 లీటర్లకు కూడా పెంచుకోవచ్చు.
ఈ కైలాక్ కారు సింగిల్ 1.0- లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 6- స్పీడ్ మ్యాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో అనుసంధానించి ఉంటుంది. దీంట్లో TSI ఇంజిన్ 113 bhp పవర్, 179 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఫర్ఫామెన్స్‌లోనూ ఇతర కంపెనీ కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








