ఈ కారు మీ సొంతం కావాలంటే 5 నెలలు ఆగాల్సిందే! ఇంతగా ఎవరు కొంటున్నారు? ఎందుకింత డిమాండ్?
ఇండియాలో ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీగా ఉన్నటువంటి స్కోడా (Skoda) ప్రీమియం ఫీచర్స్ కలిగిన మోడళ్లను విడుదల చేస్తూ తన మార్కెట్‌ను వేగంగా విస్తరించుకుంటుంది. ప్రస్తుతం భారతీయ మధ్యతరగతి కస్టమర్లపై ఎక్కువ ఫోకస్ చేసింది. అందుకే ఇటీవల కాలంలో అందుబాటు ధరలో కార్లను విడుదల చేస్తుంది. స్కోడా తన ఇండియా 2.0 వ్యూహంలో భాగంగా బడ్జెట్ ధరలో కుషాక్, స్లావియా కార్లను తీసుకువచ్చింది. ఇవి ప్రజల నుంచి ఆశించిన మేరకు ఆదరణ పొందడంతో అమ్మకాలు బాగానే ఉన్నాయి. దీంతో స్కోడాకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. అయితే వాహన మార్కెట్ వేగంగా విస్తరిస్తుంది. దేశంలో చాలా మంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో ఇతర తయారీదారులు దూకుడుగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన పలు కార్లను తీసుకురావడంపై దృష్టి పెట్టారు.
ముఖ్యంగా దేశీయ దిగ్గజ కార్ల తయారీదారులు అయినటువంటి టాటా మోటార్స్, మారుతీ సుజుకీ నుంచి బ్రెజ్జా, నెక్సాన్ వంటి మోడళ్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి. అలాగే, దక్షిణ కొరియా కంపెనీ కియా నుంచి సోనెట్ కూడా రావడంతో పోటీ రసవత్తరంగా మారింది. వీటన్నింటిని ఎదుర్కొని ప్రజల నుంచి ప్రత్యేక గుర్తింపు సంపాదించడానికి స్కోడా ఇండియా కైలాక్ అనే కాంపాక్ట్ SUVని తన ఆయుధంగా విడుదల చేసింది.

కైలాక్ కాంపాక్ట్ SUVని మార్కెట్లోకి తీసుకురావడంతో ఈ మోడలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో అమ్మకాలు క్రమంగా పుంజుకోవడంతో పాటు, కంపెనీకి కూడా మేలు కలిగింది. దీని ప్రారంభ ధర వచ్చేసి రూ.7.89 లక్షల నుంచి టాప్ ఎండ్ వేరియంట్ రూ.14.40 లక్షల వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ నగరాలను బట్టి స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది.
అయితే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ఈ ధరకు 2025 ఏప్రిల్ చివరి వరకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని స్కోడా ఇండియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తరువాత ప్రారంభ ధరలో మార్పు ఉంటుందని కంపెనీ గతంలో ప్రకటించింది. ఈ కారుకు డిమాండ్ ఆశించిన మేరకు ఉండటం కారణంగా ఇదే ధరకు కస్టమర్లకు తన కారును అందించాలని ధర మార్పు తేదీని నెల చివరి వరకు పొడిగించింది.

గత నెల ఈ కారును దాదాపు 5,000 మందికి పైగా కొనుగోలు చేశారు. ఈ మోడల్ విడుదలతో ఇండియాలో స్కోడా ఇప్పటివరకు అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. ఇంత డిమాండ్ ఉన్న కారును ఇప్పుడు బుకింగ్ చేసుకుంటే డెలివరీ కోసం 5 నెలల వరకు వెయిట్ చేయాలి. ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం, కైలాక్‌ను సొంతం చేసుకోవడానికి 2 నుంచి 5 నెలల మధ్య వెయిటింగ్ పీరియడ్ ఉంది.
స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జానెబా కైలాక్ వెయిటింగ్ పీరియడ్‌ను ధృవీకరించారు. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించే బేస్ క్లాసిక్ వేరియంట్‌ను సొంతం చేసుకోవడానికి 5 నెలల వరకు వేయిట్ చేయాల్సిన పరిస్ధితి ఉంది. దీనికి ప్రధాన కారణం కంపెనీ తన ఉత్పత్తిలో ఎక్కువగా టాప్ ఎండ్ వేరియంట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అందుకే బేస్ వేరియంట్ కావాలంటే 5 నెలల ఆగాల్సిందే.

ఇదే సమయంలో మిడ్-స్పెక్ సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్ వేరియంట్‌లను సొంతం చేసుకోవాలంటే కస్టమర్లు దాదాపు 3 నెలల వరకు వెయిట్ చేయాల్సిందే. అదే, టాప్-ఎండ్ వేరియంట్ అయిన ప్రెస్టీజ్ మోడల్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారు 2 నెలల్లో SUVని పొందుతారు. స్కోడా కైలాక్ విషయానికి వస్తే, ఇది మాన్యువల్‌లో లీటరుకు 19.68 కి.మీ, ఆటోమేటిక్‌లో లీటరుకు 19.05 కి.మీ మైలేజీని ఇస్తుంది.
ప్రమాద సమయంలో ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి నిర్వహించిన భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అత్యత్తమ ప్రమాణాలను అందించారు.


Click it and Unblock the Notifications








