స్కోడా కైలాక్ వర్సెస్ కియా సైరస్.. సబ్-4 మీటర్ ఎస్‌యూవీ మార్కెట్‌లో బిగ్ ఫైట్
భారతదేశంలో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో ప్రస్తుతం తీవ్రమైన కాంపిటేషన్ నడుస్తోంది. స్పోర్టీ లుక్, అద్భుతమైన ఫీచర్లు, మంచి మైలేజీ ఉన్నప్పటికీ కొన్ని మోడళ్లు మాత్రం అమ్మకాల్లో చాలా వెనుకబడుతున్నాయి. ఈ విభాగంలోకి కొత్తగా వచ్చి బాగా అమ్ముడవుతున్న స్కోడా కైలాక్ కారుకు గట్టి పోటీ ఇవ్వడంలో కియా సైరస్ ఫెయిల్ అయింది.
కియా సైరస్ మంచి ప్రారంభాన్ని సొంతం చేసుకున్నా, కొన్ని కీలక నిర్ణయాల కారణంగా దాని అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఒకవైపు కైలాక్ స్థిరమైన వృద్ధిని సాధిస్తుంటే, సైరస్ అమ్మకాలు ఎందుకు పడిపోయాయి, దానికి కారణాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అమ్మకాల్లో తేడాలు
సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలోకి కొత్తగా అడుగుపెట్టిన స్కోడా కైలాక్, కియా సైరస్ అమ్మకాల్లో పెద్ద తేడాలు కనిపిస్తున్నాయి. 2025 మొదటి ఎనిమిది నెలల్లో, స్కోడా కైలాక్ సుమారు 34,588 యూనిట్లను విక్రయించింది. దీని సగటు నెలవారీ అమ్మకాలు దాదాపు 4,000 యూనిట్లుగా ఉన్నాయి. ఈ విభాగంలో కైలాక్ 3.4% మార్కెట్ వాటాతో బలమైన స్థానాన్ని సంపాదించుకుంది.
కియా సైరస్ సంవత్సర ప్రారంభంలో 20,000కు పైగా బుకింగ్‌లతో బాగా మొదలైనా, తర్వాత తీవ్రంగా వెనుకబడింది. జనవరిలో 5,546 యూనిట్లకు చేరిన అమ్మకాలు, 2025 మధ్యలో కొన్ని నెలల్లో 500 యూనిట్ల కంటే తక్కువకు పడిపోయాయి. మొత్తంగా 8 నెలల్లో 25,978 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

సైరస్ అమ్మకాల పతనానికి కారణాలు
కియా సైరస్ జనవరి (5,546) నుంచి ఫిబ్రవరి (5,425), మార్చి (5,015), ఏప్రిల్ (4,000), మే (3,611) వరకు తగ్గుతూ వచ్చి, జూన్‌లో ఏకంగా 774 యూనిట్లకు పడిపోయింది. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 500 యూనిట్ల కంటే తక్కువ అమ్మకాలు నమోదయ్యాయి.
ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం ప్రకారం..ఈ పతనానికి ప్రధాన కారణం 2025 మే నెలలో సైరస్ ధరను రూ. 30,000 నుంచి రూ. 50,000 వరకు పెంచడం. ధరల విషయంలో చాలా సున్నితంగా ఉండే ఈ విభాగంలో ఈ నిర్ణయం కారు పోటీతత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. మరోవైపు, కైలాక్ దాని వ్యాల్యూ ఫీచర్లు, 5-స్టార్ భారత్ NCAP సేఫ్టీ రేటింగ్, స్థిరమైన పోటీ ధర కారణంగా లాభపడింది.

మొత్తంగా కైలాక్, సైరస్ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో 6% వాటాను కలిగి ఉన్నాయి. స్కోడా కైలాక్ రిఫైన్డ్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కెపాసిటీ, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, ఫీచర్-ప్యాక్డ్ క్యాబిన్, స్థిరమైన ధరలపై దృష్టి సారించింది.కియా సైరస్ ప్రారంభంలో టార్క్-ప్యాక్డ్ డీజిల్ ఆప్షన్లు, ADAS ఫీచర్ల కారణంగా భారీగా ప్రజాదరణ పొందింది. కానీ ధరల పెంపు కారణంగా అమ్మకాలు నిలిచిపోయాయి.
మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్ వంటి మోడల్స్ దూసుకెళ్తున్న ఈ విభాగంలో 21కి పైగా మోడల్స్ ఉండటంతో పోటీ తీవ్రంగా ఉంది. చివరికి, ధరల సున్నితత్వాన్ని అర్థం చేసుకున్న స్కోడా కైలాక్ విజయం సాధించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కియా తన ధర, ఉత్పత్తి వ్యూహాన్ని మార్చుకోకపోతే కైలాక్.. సైరస్ మధ్య అంతరం మరింత పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








