ఆటో ఎక్స్‌పోలో ప్రధాన ఆకర్షణగా రెండు కుటుంబాలకు సరిపోయే స్కోడా కొత్త కారు.. ఫార్చ్యూనర్‌కు పోటీ వచ్చేసింది
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కోడా (Skoda) నుంచి కొత్త మోడల్ వచ్చింది. దేశ రాజధాని న్యూ ఢిల్లిలోని ప్రగతి మైదాన్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో స్కోడా రెండో తరం కొడియాక్ (kodiaq) మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది దాని పాత మోడల్‌తో పోలిస్తే, కొత్తగా మరిన్ని ఫీచర్స్‌తో అప్‌డేట్ అయి వచ్చింది. ఈ ఎస్‌యూవీ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంది. భారత్‌లో స్కోడా కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే దీని పాత మోడల్‌ను చాలా మంది కొనుగోలు చేశారు. దీంతో ఈ కారుకు ప్రజల నుంచి మంచి ఆదరణ రావడంతో ఇప్పుడు ఈ కొత్త రెండో తరంను తీసుకొచ్చింది. దీనిని 'మోడరన్ సాలిడ్' డిజైన్ శైలిలో రూపొందించారు. పొడవు కొంచెం ఎక్కువగా ఉంటుంది. లోపల ప్రయాణికుల సౌలభ్యం కోసం మరింత స్థలాన్ని అందించడానికి పొడవును పెంచినట్లు తెలుస్తోంది.
ఇది MQB EVO ఆర్కిటెక్చర్ ఆధారంగా అప్‌డేట్ చేయబడింది. ఇంజిన్ విషయానికి వస్తే, 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 187 bhp పవర్, 320 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పవర్‌ను వీల్స్‌కు అందిస్తుంది. ఎక్స్‌టీరియర్ డిజైన్ అందంగా కనిపిస్తుంది. స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్ ,నిలువుగా పెద్ద గ్రిల్‌తో రివైజ్ అయిన ఫ్రంట్ ఫాసియా ఉంటుంది.

ముఖ్యంగా కారు బయటి అందాన్ని పెంచడంలో 20-అంగుళాల అల్లాయ్ వీల్స్ సైడ్ వ్యూ నుంచి మెయిన్ అట్రాక్షన్‌గా ఉన్నాయి. ఈ కారు పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్‌తో కూడా వస్తుంది. కొత్త మోడల్‌లో స్కోడా AWD సిస్టమ్‌ను ప్రామాణికంగా ఇచ్చింది. లోపల ఇంటీరియర్ కూడా చాలా వరకు అప్‌డేట్ చేశారు. క్యాబిన్ అందంగా కనిపిస్తుంది. సీట్లు కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. లేటెస్ట్ ఫీచర్స్ డజన్ల కొద్ది ఉన్నాయి.
లోపల క్యాబిన్‌లో ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను చాలా వరకు అప్‌డేట్ చేశారు. ఫ్రీ-స్టాండింగ్ 13-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ ఇంకా పలు స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటాయి. ప్రధానంగా ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి స్కోడా తన రెండో తరం కొడియాక్‌లో అత్యుత్తమైన ప్రమాణాలను అందించింది.

2025 స్కోడా కొడియాక్‌ను ప్రయాణికుల భద్రమైన కారుగా మార్చడానికి కంపెనీ దీనిలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADAS వంటి వాటిని అందించింది. అలాగే కారులో నుంచే బయట మొత్తం చూడటానికి 360-డిగ్రీ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనిలో టాప్ వేరియంట్ ఫుల్ ADAS ఫీచర్‌లను కలిగి ఉంటుంది. దీనిలో కూడా స్టాండర్డ్‌గా 6-ఎయిర్‌బ్యాగ్‌లను అందించినట్లు కంపెనీ తెలిపింది.
2025 స్కోడా కొడియాక్ 4,758 mm పొడవు, 1,864 mm వెడల్పు, 1,659 mm ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్ బేస్ 2,790 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 192 mmగా ఉంది. 7 సీట్లతో ఈ కారుకు అందుబాటులో ఉంది. ఇది , హ్యుందాయ్ టక్సన్, టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్ వంటి వాటికి పోటీ ఇస్తుంది.

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం మా డ్రైవ్‌స్పార్క్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








