ఇది ‘బాహుబలి’ ఎస్‌యూవీ.. దీని సామర్థ్యం ముందు సాటే లేదు!… మూడు భారీ ట్రక్కులను లాగేసిన కారు
భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో టాటా మోటార్స్ పేరు ప్రత్యేకం. తమ వాహనాలతో వినియోగదారుల మనసు దోచుకుంటూ టాప్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోంది. సేఫెస్ట్ కార్ల తయారీలో ఈ సంస్థకు మంచి గుర్తింపు ఉంది. గతేడాది ఈ సంస్థ Curvv Coupe SUVని భారత మార్కెట్లో విడుదల చేసి, కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. విదేశీ సంస్థల లగ్జరీ కార్లకు పోటీనిచ్చే విధంగా అట్రాక్టివ్ ఫీచర్లు జోడించి దీన్ని తయారు చేశారు. తాజాగా ఈ కారు కేపబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయో టాటా సంస్థ పరీక్షించింది. ఈ వీడియో చూసిన వారంతా ఈ కర్వ్ ఎస్‌యూవీ స్ట్రెంత్ చూసి, 'ఔరా' అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉంది? టాటా కర్వ్ ఎంత బలవంతమైనదో? చూసేద్దాం.
ఈ కర్వ్ ఎస్ యూవీ కేపబిలిటీస్ టెస్టుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది టాటా మోటార్స్ సంస్థ. ఆ వీడియోలో టాటా కర్వ్ కారు 14 టన్నుల చొప్పున బరువు గల మూడు ట్రక్కులను(మొత్తం 42 టన్నులు) ఈ కారు అవలీలగా లాగింది. దీంతో, దీని తయారీ నాణ్యతలో ఎలాంటి రాజీపడలేదని టాటా మోటార్స్ సంస్థ నిరూపించింది.

ఈ ట్రక్కులను లాగేందుకు ఉపయోగించిన టాటా కర్వ్ కారు.. 1.2 లీటర్ హైపర్ ట్రెయిన్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్‌తో ఉంది. ఇది 123 bhp హౌజ్‌పవర్, 225 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6- స్పీడ్ మ్యాన్యువల్, 7- స్పీడ్ DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్) గేర్ బాక్స్‌తో ఉంటుంది.
ఈ టాటా కర్వ్ కూప్ ఎస్‌యూవీ.. రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ రివోట్రాన్ టర్బో- పెట్రోల్ ఇంజిన్‌తో ఉండే ఈ కారు.. 120 bhp హౌజ్‌పవర్, 170 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6- స్పీడ్ మ్యాన్యువల్, 7- స్పీడ్ DCT గేర్ బాక్స్ ఆప్షన్‌తో ఉంటుంది.

మరోవైపు ఈ కారులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్.. 118 bhp పవర్, 260 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్, 7- స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్‌తో జోడించి ఉంటుంది. దీని వేరియంట్‌ను బట్టి, ఇది 11 నుంచి 17 కేఎంపీఎల్ మైలేజీ అందిస్తుంది.
ఈ కారు రూ.10 లక్షల నుంచి రూ.19 లక్షలు(ఎక్స్-షోరూమ్) ధరలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్స్‌టీరియర్ కూడా అట్రాక్టివ్ డిజైన్‌తో ఉంటుంది. ఇందులో స్మార్ట్, ప్యూర్ ప్లస్, క్రియేటివ్, అకంప్లీష్ డ్ ఎస్ అనే వేరియంట్లలో వస్తుంది. దీంట్లో ఐదుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
ఈ ఎస్‌యూవీలో టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం(12.3- అంగుళాలు), 4- స్పోక్ మల్టీ- ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 9- స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టం, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ విషయానికి వస్తే ఇది 6 ఎయిర్ బ్యాగులతో ఉంటుంది. లెవెల్-2 ADAS (అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం), 360- డిగ్రీ కెమెరా ఇందులో ఉంటుంది.
టాటా కర్వ్ ఈవీ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ.17.49 లక్షల నుంచి రూ.21.99 లక్షల మధ్య ఉంటుంది. ఇది 45 kWh, 55 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 502 నుంచి 585 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications








