5-స్టార్ సేఫ్టీ రేటింగ్, బడ్జెట్ ధరలో లభించే కార్లకే నో చెప్పిన కస్టమర్లు! దేశంలోని టాప్ కంపెనీకి పెద్ద షాక్
భారతదేశపు ప్రముఖ కార్ల తయారీ సంస్థలలో టాటా మోటార్స్ (tata motors)కి విశేషమైన స్థానం ఉంది. నెక్సాన్, పంచ్ వంటి మోడళ్ల ద్వారా గత దశాబ్దంలో టాటా మార్కెట్‌లో తన సత్తాను నిరూపించుకుంది. ఈ రెండు కార్లు సేఫ్టీ, డిజైన్, ధర వంటి అంశాల్లో వినియోగదారులను గెలు పొందడంలో కీలక పాత్ర వహించాయి. టాటా మోటార్స్ వాహనాలు "మేడ్ ఇన్ ఇండియా" అనే అభిమానం నేపథ్యంలోనూ విశేష ఆదరణ పొందాయి. అయితే గత కొన్ని నెలలుగా టాటా అమ్మకాలు కొంత వరకు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది ఏకంగా మే 2025 వరకు కొనసాగింది. గతంలో అమ్మకాల పరంగా టాటా మూడవ స్థానంలో ఉండేది. కానీ ఈ సారి, అది నాలుగో స్థానానికి పడిపోయింది. ఇది టాటా మోటార్స్‌కు ఒక హెచ్చరికలాంటిది.
మార్కెట్‌లో ఉన్న పోటీ తీవ్రత, వినియోగదారుల అభిరుచుల్లో మార్పు, కొత్త మోడళ్ల విడుదల లేటుగా ఉండటం వంటి అంశాలు దీనికి కారణంగా భావించవచ్చు. భారత మార్కెట్‌లో మారుతీ సుజుకీ ఎప్పటిలాగే కార్ల అమ్మకాల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సాధారణంగా హ్యుందాయ్ రెండవ స్థానంలో ఉంటూ, టాటా మోటార్స్ కొన్నిసార్లు మాత్రమే దానిని అధిగమించగలిగింది. అయితే, తాజాగా మహీంద్రా కంపెనీ తిరుగులేని ఎదుగుదలతో హ్యుందాయ్, టాటా మోటార్స్‌లను అధిగమించి రెండవ స్థానాన్ని ఆక్రమించింది.

ప్రత్యేకంగా SUV విభాగంలో మహీంద్రా వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, వారి మార్కెట్ వాటా స్థిరంగా పెరుగుతోంది. మే 2025లో టాటా మోటార్స్ కార్ల అమ్మకాల పరంగా కొంత వెనుకబడినప్పటికీ, కొన్ని మోడళ్లను చూసినప్పుడు స్థిరంగా తన స్థానాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తం అమ్మకాల పరంగా చూస్తే, మే 2025లో టాటా 41,557 కార్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం మే నెలతో పోలిస్తే 5,143 కార్లు తక్కువ.
ఎందుకంటే 2024 మేలో టాటా మోటార్స్ 46,700 యూనిట్లను విక్రయించింది. ఇది గత నెలైన ఏప్రిల్ 2025తో పోలిస్తే కూడా తక్కువే. అప్పట్లో కంపెనీ 45,199 కార్లను విక్రయించిన సంగతి తెలిసిందే. అంటే, ఒక్క నెల వ్యవధిలోనే 3,642 కార్లు తగ్గడం గమనార్హం. ఇది టాటా విక్రయాలపై నెగటివ్ ప్రభావం చూపే అంశమే అయినప్పటికీ, కొన్ని మోడళ్ల విషయంలో మాత్రం ఆశాజనక అభివృద్ధి కనిపించింది.

అందులో ముఖ్యంగా టాటా పంచ్ కారును ప్రత్యేకంగా గుర్తించవచ్చు. మే నెలలో పంచ్ మోడల్ 13,133 యూనిట్ల అమ్మకంతో మంచి ప్రదర్శన కనబరిచింది. ఇది ఏప్రిల్ 2025లో నమోదైన 12,496 యూనిట్ల కంటే 637 కార్లు ఎక్కువ. అంటే, టాటా అమ్మకాలలో తగ్గుదల ఉన్నా, పంచ్ మోడల్ మాత్రం మెల్లగా గరిష్ఠ స్థాయికి చేరుతున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు మే 2024లో టాటా పంచ్ 18,949 యూనిట్లను విక్రయించింది.
దానితో పోలిస్తే ఈ సంవత్సరం మేలో పంచ్ అమ్మకాలు గణనీయంగా తగ్గినట్టే. పంచ్ తర్వాత టాటా మోటార్స్ అమ్మకాల పరంగా రెండవ స్థానంలో నిలిచినది నెక్సాన్. మే 2025లో 13,096 నెక్సాన్ కార్లు విక్రయమయ్యాయి. ఇది 2024 మేలో విక్రయించిన 11,457 యూనిట్ల కంటే ఎక్కువే అయినా, ఏప్రిల్ 2025లో విక్రయించిన 15,457 యూనిట్లతో పోలిస్తే తగ్గుదల ఉంది. ఇది నెక్సాన్ మోడల్ అమ్మకాలపై కొంత ఒత్తిడి తలెత్తినట్టే చూపిస్తుంది.

మే 2025లో నెక్సాన్ తర్వాత మూడవ స్థానంలో నిలిచిన మోడల్ టియాగో. ఈ హ్యాచ్‌బ్యాక్ మోడల్ 6,407 యూనిట్ల అమ్మకాలతో తన స్థిరమైన డిమాండ్‌ను మరోసారి నిరూపించుకుంది. అంతేకాదు, నాల్గవ స్థానంలో టాటా కర్వ్ 3,063 యూనిట్ల అమ్మకాలు, ఐదవ స్థానంలో టాటా ఆల్ట్రోజ్ 2,779 యూనిట్లు తరువాత 1,109 యూనిట్ల సఫారీ SUVలను, 1,076 యూనిట్ల టిగోర్ కార్లను, 894 యూనిట్ల హారియర్ SUVలను టాటా మోటార్స్ విక్రయించింది.


Click it and Unblock the Notifications








