ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టాటా మోటార్స్.. గెలిచిన ప్రతి అమ్మాయికి బంగారం లాంటి కారు
ఐసీసీ 2025 మహిళా క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తమ అభిమానాన్ని పంచుకుంది. గతంలో చేసిన ప్రకటన మేరకు చారిత్రక విజయాన్ని సాధించిన జట్టులోని ప్రతి సభ్యురాలికీ, కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఐకానిక్ టాటా సియెర్రా ఎస్‌యూవీని (Tata Sierra SUV) బహుమతిగా ఇవ్వనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
జనవరి 16న సాధారణ వినియోగదారులకు డెలివరీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకు ముందే ఈ అద్భుతమైన కారును ప్రపంచ కప్ గెలిచిన క్రీడాకారిణుల ఇళ్లకు చేరుతుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఆటగాళ్లు తమకు నచ్చిన సియెర్రా వేరియంట్‌ను ఎంచుకునే స్వేచ్ఛను కూడా టాటా కల్పించింది.

రెండుసార్లు చేజారిన వన్డే ప్రపంచకప్‌ను భారత మహిళా జట్టు ఈసారి దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి మొదటిసారిగా గెలుచుకుంది. ఈ చారిత్రక విజయం దేశానికి గర్వకారణం. సరిగ్గా అదే సమయంలో ఒకప్పుడు మార్కెట్‌లో సంచలనం సృష్టించిన ఐకానిక్ సియెర్రా ఎస్‌యూవీ తిరిగి దేశీయ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతుండటంతో, ఈ డబుల్ సెలబ్రేషన్‌ను గుర్తు చేసుకుంటూ ఈ వాహనాన్ని ఆటగాళ్లకు బహుమతిగా ఇవ్వాలని టాటా మోటార్స్ నిర్ణయించింది.
మహిళా క్రికెట్ జట్టును సన్మానించడానికి కంపెనీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన అధికారిక బుకింగ్‌లను కూడా టాటా మోటార్స్ రూ.21,000 టోకెన్ మొత్తంతో ఇప్పటికే ప్రారంభించింది. ఈ వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ.11.49 లక్షల నుంచి రూ.21.49 లక్షల వరకు ఉంటుంది.

టాటా సరికొత్త ARGOS ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేయబడిన న్యూ-జెన్ సియెర్రా (New-Gen Sierra) డిజైన్ పరంగా పాత, కొత్త అంశాల కలయికగా నిలుస్తోంది. 1991 మోడల్ సియెర్రా ఐకానిక్ డిజైన్‌ను కొత్త రూపంలో తీసుకురావడానికి టాటా మోటార్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. బాక్సీ ఆకృతి, ఎత్తైన బోనెట్, చతురస్రాకారపు వీల్ ఆర్చ్‌లు, విండో లైన్‌లోని కింక్ వంటి పాత మోడల్ డిజైన్ అంశాలను కొత్త సియెర్రాలో చేర్చారు.
షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఫుల్-విడ్త్ లైట్ బార్‌లు, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ వంటి ఆధునిక ఫీచర్లు డిజైన్‌కు జోడించబడ్డాయి. అయితే, ఆధునిక క్రాష్-సేఫ్టీ నిబంధనల కారణంగా పాత 3-డోర్ సియెర్రా ప్రత్యేక కర్వ్‌డ్ రియర్ గ్లాస్ సెక్షన్‌ను కాపీ చేయలేకపోయినా, రియర్ విండో, క్వార్టర్ గ్లాస్‌పై రూఫ్ రైలును పొడిగించడం ద్వారా ఆ ప్రత్యేకతను కొంతవరకు కొనసాగించారు.

సియెర్రా ఇంటీరియర్‌ను కూడా టాటా మోటార్స్ అద్భుతంగా పూర్తి చేసింది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ప్రత్యేకమైన ప్యాసింజర్ స్క్రీన్ వంటి ట్రై-స్క్రీన్ డాష్‌బోర్డ్ లేఅవుట్ ప్రధాన ఆకర్షణగా ఉంది.
డాష్-మౌంటెడ్ సౌండ్‌బార్‌తో కూడిన జేబీఎల్ (JBL) సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్‌లెస్ ఛార్జింగ్, 20 కంటే ఎక్కువ అసిస్టెన్స్ ఫీచర్లతో కూడిన లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో ఉన్నాయి, ఇది వినియోగదారులకు విలాసవంతమైన అనుభూతినిస్తుంది.
సియెర్రా ఎస్‌యూవీ మూడు రకాల ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తుంది: 1.5 లీటర్ NA పెట్రోల్, కొత్త 1.5 లీటర్ GDi టర్బో పెట్రోల్, 1.5 లీటర్ ఫోర్-పాట్ డీజిల్. ఈ ఇంజన్ ఆప్షన్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో జతచేయబడి వినియోగదారుల ఎంపికకు అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి.
ధర, ఫీచర్ల పరంగా చూస్తే మిడ్ సైజ్ ఎస్‌యూవీ (Mid-Size SUV) విభాగంలో ఉన్న హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్ వంటి ప్రముఖ మోడళ్లకు సియెర్రా గట్టి పోటీని ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








