టాటా బంపర్ ఆఫర్.. ఈ కారుపై భారీ తగ్గింపు.. డ్రీమ్ కారును తక్కువ ధరలో సొంతం చేసుకునే ఛాన్స్!
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమైన కార్లను తయారు చేయడంలో ప్రసిద్ది చెందిన దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) తాజాగా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తన ప్రసిద్ధ మోడల్ టాటా కర్వ్ (Tata Curvv) పై భారీ ఎత్తున తగ్గింపులు అందిస్తున్నట్లు పేర్కొంది. ఇది ఒక SUV కూపే. ఇటీవల కాలంలో మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కారు అమ్మకాలు పెంచుకోవడానికి కస్టమర్లను ఆకర్షించడానికి కర్వ్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లపై భారీ ఎత్తున డిస్కౌంట్లను ప్రకటించింది. కొత్తగా 2025 ఏడాదిలో కారును కొనుగోలు చేయాలని చూస్తున్న వారు, టాటా మోటార్స్ అందిస్తున్న తగ్గింపు ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని తక్కువ ధరలోనే అదిరిపోయే కారును కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు. 2025 జనవరి నెలలో ఈ కారు మెరుగైన సేల్స్‌ను నమోదు చేసింది.
ఇదే డిమాండ్‌ను రానున్న కాలంలో కూడా కొనసాగించడానికి ఈ డిస్కౌంట్స్ బాగా ఉపయోగపడుతాయి. టాటా కర్వ్ విక్రయాలు గత నెలలో 3,087 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ అమ్మకాల పరంగా కాంపాక్ట్ SUV విభాగంలో ఇది ఐదవ స్థానంలో ఉంది. డేటా ప్రకారం, హ్యుందాయ్‌కు చెందిన క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ తర్వాత టాటా కర్వ్ అమ్మకాల లిస్ట్‌లో స్థానం సంపాదించింది.

టాటా మోటార్స్ కర్వ్ అన్ని వెర్షన్లపై తగ్గింపు ఆఫర్ అందించడం అనేది సంతోషించదగ్గ విషయం. పోటీ ఎక్కువగా ఉన్న తరుణంలో ఈ ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో సేల్స్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక కంపెనీ ఇస్తున్న ఆఫర్ విషయానికి వస్తే, 2025 మోడల్ కర్వ్ ICE ఇంజిన్ వెర్షన్లపై స్క్రాపేజ్ బోనస్ రూ.20,000 వరకు తగ్గింపు ఉంది. అదనంగా టాటా ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.13,793 వరకు ఆఫర్ చేస్తుంది.
అయితే ఈ మోడల్‌పై క్యాష్ తగ్గింపు అనేది మాత్రం అందుబాటులో లేదు. ఇదే సమయంలో కంపెనీ 2024 మోడళ్లపై మాత్రం మరింత ఎక్కువగా డిస్కౌంట్‌ను అందిస్తుంది. వీటిపై గరిష్టంగా రూ.50,000 వరకు తగ్గింపు ఉంది. వీటిలో కొన్నింటికి రూ.30,000 వరకు క్యాష్ తగ్గింపులు ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ఈ తగ్గింపు అనేది డీలర్‌షిప్‌తో పాటు అందుబాటులో ఉన్న స్టాక్‌ను బట్టి మారుతుంది.

టాటా కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్ల విషయానికి వస్తే, ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ.19,048, అలాగే, స్క్రాపేజ్ బోనస్ రూ. 20,000 తగ్గింపును కంపెనీ అందిస్తుంది. టాటా కర్వ్‌ను తగ్గింపు ఆఫర్‌తో కొనుగోలు చేయాలని ప్లాన్ చేసిన వారు ముందుగా దగ్గరలోని డీలర్లను సంప్రదించడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఆఫర్స్‌లో ఏవైనా మార్పులు ఉన్నట్లయితే ముందస్తుగా తెలుసుకోవచ్చు.
టాటా కర్వ్ 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌లో 120 PS పవర్, 170 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ హైపెరియన్ పెట్రోల్ ఆప్షన్‌లో 125 PS పవర్, 225 Nm గరిష్ట టార్కును, 1.5-లీటర్ డీజిల్ వెర్షన్ 118 PS పవర్, 260 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCA ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఇంజిన్‌కు జోడించారు.

టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ 45kWh సింగిల్ ఛార్జ్‌తో 430 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. అలాగే, రెండో బ్యాటరీ ప్యాక్ 55kWh ఒక్క ఛార్జ్‌తో 502 కి.మీల రేంజ్ అందిస్తుంది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో పోటీ పెరుగుతున్న కారణంగా టాటా మోటార్స్ తన అమ్మకాలను పెంచుకోవడానికి ఇలా తగ్గింపు ఆఫర్స్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications








