ప్రజలు డిమాండ్ చేస్తే ఆ నిర్ణయం తీసుకుంటామన్న టాటా! ఎలక్ట్రిక్ తర్వాత ఇప్పుడు కొత్త ప్లాన్ అదిరిపోతుంది
ప్రపంచంలోనే ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమ కార్లను తయారు చేయడంలో టాటా మోటార్స్ (Tata Motors) ఎప్పుడు ముందు ఉంటుంది. రతన్ టాటా ఆశయాలకు ప్రతినిధిగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తన ఉత్పత్తులను అందిస్తుంది. ఆయన దూరమైన తర్వాత కూడా టాటా మోటార్స్ అదే విలువలతో ముందుకు వెళ్తోంది. సాధారణ మనిషి అవసరాలను గుర్తించి, సాధ్యమైనంతవరకు అందుబాటులో వాహనాలను తీసుకురావడం ఈ సంస్థకు ఎప్పటి నుంచో మంచి గుర్తింపు ఉంది. ఇదిలా ఉంటే టాటా ఎలక్ట్రిక్ వాహనాల సక్సెస్ తరువాత, దేశీయ మార్కెట్‌లో హైబ్రిడ్ ఇంజిన్లకు కూడా ఉన్న గణనీయమైన గిరాకీపై దృష్టి పెట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల కన్నా కొంతమంది వినియోగదారులు హైబ్రిడ్ వాహనాలను ఎక్కువగా ఇష్టపడతారని ఈ సెగ్మెంట్‌లోనూ సత్తా చాటాలని చూస్తుంది.
ఇటీవల టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ, కేవలం వాణిజ్య పరంగా కాకుండా, వినియోగదారుల అభిరుచులు, అవసరాలను గౌరవించడం ఈ బ్రాండ్ ప్రధాన లక్ష్యం. ప్రజలు డిమాండ్ చేస్తే, కొత్త హైబ్రిడ్ ఇంజిన్లకు మరింత ప్రాధాన్యం ఇస్తామని, ఇప్పటికే ఈ అంశంపై పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయని ఆయన వివరించారు.

ప్రజల ఇష్టాలు వేగంగా మారుతున్న ఈ కాలంలో, ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు, చాలామంది వినియోగదారులు హైబ్రిడ్ కార్లకే మొగ్గుచూపుతున్నారు. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. అందుకే కొత్త హైబ్రిడ్ ఇంజిన్ల విషయంపై కూడా ఆలోచన చేస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర సైతం స్పష్టంగా చెప్పేశారు. దీంతో రానున్న రోజుల్లో టాటా నుంచి కొత్త హైబ్రిడ్ కార్లు రానున్నాయి.
హైబ్రిడ్ కార్లలో మూడు ప్రధాన రకాలు ఉంటాయి. మొదట మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌లో ఎలక్ట్రిక్ మోటార్, కేవలం ఇంజిన్‌కి సహకరించే పని మాత్రమే చేస్తుంది. అంటే కారు పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో నడవలేడు. రెండవది, స్ట్రాంగ్ హైబ్రిడ్, దీనిలో కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కేవలం ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా ప్రయాణించవచ్చు. మూడవది, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV), ఇది ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో వస్తుంది.

పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్‌కి తోడుగా ఎలక్ట్రిక్ మోటార్ పని చేయడం వల్ల హైబ్రిడ్ కార్లు సాధారణ మోడళ్ల కంటే మెరుగైన ఇంధన సామర్థ్యం చూపుతాయి. దాంతో, నిత్య వినియోగంలో పెట్రోల్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. అందుకే, హైబ్రిడ్ వాహనాలకు ఈ మధ్య భారతీయుల నుంచి వచ్చిన స్పందన బాగా వస్తుంది. భవిష్యత్తులో మరింత మంది వినియోగదారులు ఈ సాంకేతికతను అంగీకరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
అదే, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు ఛార్జ్ చేయాలి? దీర్ఘ ప్రయాణాల్లో సరిపోతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు వినియోగదారుల మనసులో వస్తాయి. అదే సమయంలో, హైబ్రిడ్ కార్లు మాత్రం ఈ సమస్యల నుంచి బయటపడేలా చేస్తాయి. ఎందుకంటే, ఇవి సాదారణ పెట్రోల్ పంపుల నుంచే ఇంధనం పొందగలవు. దేశంలోని చిన్నపాటి గ్రామం నుండి పెద్ద నగరం వరకు ఎక్కడైనా పెట్రోల్ పంపులు అందుబాటులో ఉంటాయి.

ఇక బలమైన (స్ట్రాంగ్) లేదా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాల గురించి చెప్పాలంటే, ఇవి మరింత ఆధునిక సాంకేతికతతో వస్తాయి. కేవలం ఇంధనంతో ముందుకు వెళ్లడం మాత్రమే కాకుండా, రీజెనరేటివ్ బ్రేకింగ్ విధానాన్ని ఉపయోగించి కూడా బ్యాటరీని చార్జ్ చేసుకుంటాయి. అంటే, బ్రేక్ వేస్తున్నప్పుడు కూడా వృథా అయ్యే శక్తిని నిల్వ చేసుకుని, తిరిగి వాహనాన్ని నడిపే విద్యుత్ శక్తిగా మలుస్తాయి.
దీనితో పాటు, ప్రత్యేకంగా కావాలంటే బాహ్య ఛార్జర్ ద్వారా కూడా వీటి బ్యాటరీని ఎప్పుడైనా చార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఒకేసారి రెండు దిశల్లో శక్తి వనరులను వినియోగించుకునే సామర్థ్యం ఉండటం వల్ల, హైబ్రిడ్ కార్లు సాధారణ పెట్రోల్ వాహనాల వలే, ఎలక్ట్రిక్ వాహనాల ఆర్థిక ప్రయోజనాలు రెండింటినీ సమానంగా అందిస్తాయి. అందుకే, ఎలక్ట్రిక్‌కి పూర్తి స్థాయిలో వెళ్లే ధైర్యం లేని వారికి హైబ్రిడ్ వాహనాలు సరైన మోడళ్లగా మారుతున్నాయి.


Click it and Unblock the Notifications








