చిన్న కారు..పెద్ద ఫీచర్లు..బడ్జెట్ ధరలోనే సఫారి లాంటి లుక్..టాటా మళ్ళీ కొట్టబోతోంది గట్టిగా!
భారతీయ మార్కెట్‌లో మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను క్రియేట్ చేసి అమ్మకాలలో అద్భుతాలు సృష్టించిన టాటా పంచ్ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ తయారవుతోంది. కొత్త సంవత్సరంలో మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్న ఈ పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కెమెరా కంటికి చిక్కింది. డిజైన్, ఫీచర్లలో భారీ మార్పులతో టాటా మోటార్స్ ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
టాటా మోటార్స్ నుంచి వస్తున్న మోస్ట్ పాపులర్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ ఇప్పుడు సరికొత్త అవతారంలో మెరిసిపోవడానికి సిద్ధమైంది. 2021లో లాంచ్ అయినప్పటి నుంచి మార్కెట్లో రికార్డులు సృష్టిస్తున్న ఈ కారుకు ఇప్పుడు భారీ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ రాబోతోంది. ఇటీవల ఈ కారుకు సంబంధించిన స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా కేరళ రోడ్లపై టెస్టింగ్ జరుగుతున్న సమయంలో ఈ కారు కెమెరా కంటికి చిక్కింది. 2026 ప్రారంభంలో విపణిలోకి రానున్న ఈ కొత్త పంచ్ లో ఏయే మార్పులు ఉండబోతున్నాయో వివరంగా చూద్దాం. కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ చూస్తుంటే, ఇది పంచ్ ఈవీకి చాలా దగ్గరగా కనిపిస్తుంది. ముందు భాగంలో సరికొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్, నిలువుగా ఉండే హెడ్‌ల్యాంప్ సెటప్ ఉండబోతున్నాయి.
నెక్సాన్, సఫారి వంటి పెద్ద కార్ల డిజైన్ లాంగ్వేజీని ఇప్పుడు ఈ చిన్ని ఎస్‌యూవీలో కూడా చూడొచ్చు. వెనుక వైపు బంపర్, టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కూడా మరింత షార్ప్‌గా ఉండబోతోంది. కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ ఈ కారుకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

కారు లోపలి భాగంలో ఊహించని మార్పులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా 10.25-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రానున్నాయి. టాటా కొత్తగా ప్రవేశపెట్టిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ (మధ్యలో వెలిగే టాటా లోగోతో) ఇందులో ఉండబోతోంది. అంతేకాకుండా, ఈ సెగ్మెంట్లో మొదటిసారిగా వెంట్యులేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఇందులో చోటు చేసుకోనున్నాయి.
సేఫ్టీకి మారుపేరుగా నిలిచిన పంచ్, ఇప్పుడు మరిన్ని సేఫ్టీ ఫీచర్లతో రాబోతోంది. స్పై షాట్స్ ప్రకారం ఈ కారులో 360-డిగ్రీ కెమెరా ఉండటం ఖాయమైంది. దీనివల్ల పార్కింగ్ చేయడం చాలా సులభం అవుతుంది. వీటికి తోడు 6 ఎయిర్‌బ్యాగులు ఇప్పుడు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా వచ్చే అవకాశం ఉంది.
అంతేకాకుండా, ఇందులో Level-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) కూడా ఉండవచ్చని సమాచారం. ఇప్పటికే గ్లోబల్ NCAP లో 5-స్టార్ రేటింగ్ పొందిన పంచ్, ఈ అప్‌డేట్స్‌తో సెగ్మెంట్‌లో అత్యంత సురక్షితమైన కారుగా నిలవనుంది.
మెకానికల్‌గా చూస్తే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అదే 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగనుంది. ఇది 86 bhp పవర్, 113 Nm టార్క్‌ను అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో కూడిన CNG వేరియంట్ కూడా రాబోతోంది. ధర విషయానికి వస్తే ఫీచర్లు పెరగడం వల్ల ప్రస్తుతం ఉన్న ధర కంటే సుమారు రూ.30,000 నుంచి రూ.60,000 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








