ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లే 6 సీట్ల పవర్ఫుల్ కారు.. అన్ని ఫీచర్లున్నా కొనేందుకు వెనుకాడుతున్న జనం
కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మరీ ముఖ్యంగా 6 లేదా 7 సీటర్ ఎస్‌యూవీ కోసం చూస్తున్నారా? అయితే టాటా సఫారీ గురించి తెలిసే ఉంటుంది. పవర్ఫుల్ ఇంజిన్, అద్భుతమైన ఫీచర్లు, మంచి డిజైన్‌తో ఇది చాలామందికి ఫేవరేట్ కారుగా మారింది. కానీ, ఇప్పుడు ఈ కారు అమ్మకాలు భారీగా పడిపోతున్నాయి. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? దాని వెనుక ఉన్న కారణాలేంటి? వివరంగా తెలుసుకుందాం.
ఒకప్పుడు టాటా సఫారీ అంటే ఒక సంచలనం. రోడ్డు మీద దీని రాజసం అద్భుతం. కానీ ప్రస్తుతం టాటా మోటార్స్‌కు టాటా సఫారీ అమ్మకాల విషయంలో గట్టి షాకే తగిలింది. ఎందుకంటే, జూలై నెలలో కేవలం 1,242 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే జూలై నెలలో 2,109 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, అమ్మకాలు ఏకంగా 41% తగ్గిపోయాయి.

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో కూడా పరిస్థితి ఏమంత బాగాలేదు. నెలకు సగటున కేవలం 1,265 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇంత మంచి ఫీచర్లు ఉన్న కారు అమ్మకాలు ఇలా ఎందుకు పడిపోతున్నాయి? అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాటా సఫారీ అనేది ఒక ఫ్యామిలీ ఎస్‌యూవీ.
టాటా సఫారీ ధర రూ.15.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది. ఇది రూ.27.44 లక్షల వరకు అందుబాటులో ఉంది. ఇది స్మార్ట్, అడ్వెంచర్, అకంప్లిష్డ్ వంటి వివిధ వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ పరంగా చూస్తే, సఫారీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కనెక్టెడ్ డీఆర్‌ఎల్‌లు, డైనమిక్ టర్న్ ఇండికేటర్‌లు, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌తో ఇది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అలాగే, కాస్మిక్ గోల్డ్, ఒబెరాన్ బ్లాక్, స్టెల్లార్ ఫ్రాస్ట్ వంటి ఆకట్టుకునే రంగులలో ఇది లభిస్తుంది.
సఫారీలో 6 లేదా 7 సీట్ల ఆప్షన్ ఉంది. ఎక్కువ మంది ప్రయాణం చేసే ఫ్యామిలీలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో 420 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది. అంటే ఎక్కువ లగేజ్ పెట్టుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. కారు పొడవు 4,668 ఎంఎం, వెడల్పు 1,922 ఎంఎం, ఎత్తు 1,795 ఎంఎం ఉంటుంది.

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 170 పీఎస్ పవర్, 350 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. మైలేజ్ కూడా మంచిగానే ఇస్తుంది. మాన్యువల్ గేర్‌బాక్స్ అయితే 14 నుండి 16 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
క్యాబిన్ లోపల కూడా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ ఏసీ, సన్‌రూఫ్, 10-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్ వంటివి కారుకు మరింత విలువను పెంచుతాయి.

సేఫ్టీ విషయంలో టాటా సఫారీ చాలా ముందుంది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్స్, ఏడీఏఎస్, ఈఎస్సీ, టీపీఎంఎస్, 360 డిగ్రీల కెమెరా వంటివి ఉన్నాయి. అన్ని రకాలుగా చాలా మంచి కారు అయినప్పటికీ, దీని అమ్మకాలు తగ్గడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.
టాటా సఫారీ కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లోనే లభిస్తోంది. కానీ ప్రస్తుతం చాలామంది కస్టమర్లు పెట్రోల్ లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. డీజిల్ కారుల మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ, పర్యావరణ నిబంధనల కారణంగా పెట్రోల్ కార్లను ఎక్కువగా కొంటున్నారు.
టాటా సఫారీ ధర ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణం. అదే ధరలో ఇతర కంపెనీల కార్లు మెరుగైన ఫీచర్లతో లేదా పెట్రోల్/ఎలక్ట్రిక్ ఆప్షన్‌లతో లభిస్తున్నాయి. మార్కెట్‌లో ఈ సెగ్మెంట్‌లో చాలా పోటీ ఉంది. మహీంద్రా XUV700, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి కార్లు మంచి ఫీచర్లు, విభిన్న ఇంజిన్ ఆప్షన్‌లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ కారణాల వల్లే టాటా సఫారీ అమ్మకాలు రోజురోజుకు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


Click it and Unblock the Notifications








