టెస్లా ఎలక్ట్రిక్ కారు మోడల్ Y కొనాలా? ధర, బుకింగ్ అమౌంట్, డెలివరీ పూర్తి వివరాలు ఇవే!
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు టెస్లా, ఎలోన్ మస్క్ నేతృత్వంలో ప్రపంచ EV రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన సంస్థగా పేరు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే ఎలక్ట్రిక్ కార్లను రూపొందించిన ఈ బ్రాండ్, ఎట్టకేలకు భారతదేశ మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. భారతదేశంలో టెస్లా తొలి షోరూమ్‌ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలోని మేకర్ మాక్స్‌సిటీ మాల్‌లో ప్రారంభించింది. ఇది టెస్లా భారత్ మార్కెట్లో ప్రారంభించిన తొలి అధికారిక విక్రయ కేంద్రం కావడంతో, ఈశాన్య ఆసియాలో సంస్థ దిశగా ఒక కీలక అడుగుగా భావించవచ్చు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో టెస్లా తన తొలి మోడల్‌ను కూడా ఆవిష్కరించింది, అదే టెస్లా మోడల్ వై (Model Y).
టెస్లా మోడల్ Y భారతదేశ మార్కెట్‌కు ప్రవేశించిన ఎలక్ట్రిక్ SUVలలో అత్యంత ప్రీమియం వాహనాల్లో ఒకటిగా నిలిచింది. ధర పరంగా చూస్తే, ఇది ఖచ్చితంగా లగ్జరీ సెగ్మెంట్‌కు చెందిన వాహనమే. ఈ కారులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. RWD (రియర్ వీల్ డ్రైవ్) వేరియంట్ ధర రూ.59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). లాంగ్ రేంజ్ RWD వేరియంట్ ధర రూ. 67.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఆన్-రోడ్ ధరలు మరింతగా పెరుగుతాయి.

మోడల్ Yను భారతదేశంలో తయారు చేయడం కాదు, విదేశాల నుండి పూర్తిగా నిర్మించిన కార్ల(CBU - Completely Built Unit) రూపంలో దిగుమతి చేస్తారు. ప్రధానంగా చైనా లేదా అమెరికా నుండి దిగుమతులు జరుగుతుండటంతో, భారీగా దిగుమతి సుంకాలు(Import Duties) విధించబడతాయి. ఈ కారణంగా, అమెరికా, చైనా వంటి దేశాల్లో టెస్లా మోడల్ Y ధర చాలా తక్కువగా ఉండగా, భారతదేశంలో మాత్రం ఇదే వాహనం మరింత ఖరీదైనదిగా మారుతోంది.
టెస్లా మోడల్ Y భారత మార్కెట్‌లోకి ప్రవేశించడం కేవలం లాంచ్ ఈవెంట్ మాత్రమే కాదు, అది ఒక చరిత్రాత్మక ఘట్టం కూడా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని టెస్లా షోరూమ్‌ను మంగళవారం ఉదయం అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం, టెస్లా మోడల్ Y కోసం బుకింగ్‌లను తెరిచింది. ఈ ఎలక్ట్రిక్ SUVను కొనే ఆసక్తిగల వినియోగదారులు ఇప్పుడు ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.

బుకింగ్ కోసం నిర్ణయించిన రిజర్వేషన్ అమౌంట్ రూ.22,220. బుకింగ్ చేసిన వారంలోపు రూ.3 లక్షలు చెల్లించాలి. ఈ కొత్త కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు ఈ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. టెస్లా వెబ్‌సైట్ ద్వారా లేదా ముంబై షోరూమ్ ద్వారా బుకింగ్ చేయవచ్చు. మోడల్ Y భారతదేశానికి పూర్తిగా తయారుచేసిన రూపంలో విదేశాల నుండి దిగుమతి అవుతోంది. అందువల్ల దిగుమతి, కస్టమ్స్ కారణంగా డెలివరీలకు కొంత సమయం పడుతుంది.
కంపెనీ ప్రకారం, ఈ కారు డెలివరీలు ఈ క్యాలెండర్ సంవత్సరం మూడవ త్రైమాసికంలో అంటే జూలై - సెప్టెంబర్ 2025లో ప్రారంభం కానున్నాయి. ఈ బుకింగ్ ప్రక్రియ, టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెడుతూనే వినియోగదారుల నుంచి నేరుగా స్పందనను సేకరించేందుకు తీసుకున్న తొలి చర్య. అధునాతన డిజైన్, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, గ్లోబల్ బ్రాండ్ పేరుతో మోడల్ Y భారత EV మార్కెట్లో సరికొత్త హంగును తీసుకురానుంది.

కొత్త మోడల్ Y, 60 కిలోవాట్-అవర్ (kWh), 75 కిలోవాట్-అవర్ (kWh) బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఇది బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై 500 నుండి 622 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ SUV గరిష్టంగా 200 kmph వేగంతో దూసుకుపోగలదు. ఇది కేవలం 6.9 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకోగలదని టెస్లా కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








