రూ.10లక్షల కారులో ఉండే ఫీచర్లు..ధర మాత్రం రూ.60లక్షలు..ఇలా ఉంటే ఎవరు కొంటారు మస్క్ మామ
ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న అమెరికన్ దిగ్గజం టెస్లా(Tesla) ఎన్నో అడ్డంకులను దాటుకుని ఈ మధ్యే భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. టెస్లా రాకతో భారతీయ కార్ల మార్కెట్ పూర్తిగా మారిపోతుందని, పోటీ సంస్థలకు ముచ్చెమటలు పడుతాయని భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే తాజాగా విడుదలైన అమ్మకాల వివరాలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. టెస్లాకు భారత్ అస్సలు కలిసి రావడం లేదేమో అనిపిస్తుంది. కేవలం 40 కార్లు మాత్రమే అమ్ముడవడంతో టెస్లా అమ్మకాల మరీ ఇంత తక్కువగా ఉండడానికి గల కారణాలు చూద్దాం..

అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన భారత మార్కెట్‌లోకి గత జూలైలో ముంబైలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. సెప్టెంబర్ నెల నుంచే సేల్స్ ప్రారంభించింది. టెస్లా అడుగుపెట్టడం భారతీయ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారుతుందని అందరూ భావించారు.
అయితే అమ్మకాల వివరాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో 64 కార్లను మాత్రమే అమ్మిన టెస్లా, అక్టోబర్ నెలలో కేవలం 40 కార్లను మాత్రమే విక్రయించింది. అంటే కేవలం ఒక నెలలోనే అమ్మకాలు 37.5 శాతం పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు గంటలకు 100 కార్లకు పైగా అమ్ముడుపోయే ఇంత పెద్ద కంపెనీ, భారతదేశంలో ఇలాంటి అమ్మకాలు నమోదు చేయడం ఆశ్చర్యకరం.

టెస్లా ప్రస్తుతం భారతదేశంలో మోడల్ వై (Model Y) అనే ఒకే ఒక కారును విక్రయిస్తోంది. దీని ధర రూ.59.89 లక్షల వద్ద ఉంది. అమెరికన్ మార్కెట్‌లో మోడల్ వై ఒక మిడ్-సైజ్ క్రాస్‌ఓవర్ కారుగా తక్కువ ధరకే లభిస్తుంది. కానీ అదే కారు ఇండియాలో దాదాపు ఒక లగ్జరీ కారుగా అమ్ముడవుతోంది. దీనికి ప్రధాన కారణం ధర. అమెరికా కంటే భారత్‌లో ఈ కారు ధర దాదాపు 70 శాతం అధికంగా ఉంది.
టెస్లా తన కార్లను భారత్‌లో తయారు చేయడం లేదా అసెంబుల్ చేయడం లేదు. కార్లను కంప్లీట్లీ బిల్ట్ యూనిట్‌లు (CBU) అంటే, పూర్తిగా తయారు చేసిన కార్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని అమ్ముతోంది.

భారతదేశంలో కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ పద్ధతిలో దిగుమతి చేసుకునే కార్లపై కేంద్ర ప్రభుత్వం 100 శాతం దిగుమతి సుంకం విధిస్తుంది. ఈ భారీ ట్యాక్స్ కారణంగానే టెస్లా కార్ల ధరలు అమాంతం పెరిగిపోయి, కొనుగోలుదారులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. అక్టోబర్ నెలలో చాలా ఆటోమొబైల్ కంపెనీలు రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేసినా, టెస్లా మాత్రం తీవ్ర అమ్మకాల క్షీణతను ఎదుర్కోవడం గమనార్హం.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం : టెస్లా బ్రాండ్‌పై, వాటి క్వాలిటీ పై భారతీయుల్లో అభిమానం ఉంది. కానీ అధిక ధర కారణంగానే అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. టెస్లా భారత్‌లో కార్లను అసెంబుల్ చేయడం లేదా తయారు చేయడం ప్రారంభిస్తే తప్ప ఈ పరిస్థితిలో మార్పు రావడం కష్టం.
భారతదేశంలో టెస్లా (Tesla) కార్ల అమ్ముకాలు అంతర్జాతీయ స్థాయిలో లేకపోవడానికి ప్రధాన కారణం ఆ బ్రాండ్‌పై లేదా కారు నాణ్యతపై ప్రజలకు నమ్మకం లేకపోవడం కాదు, కేవలం ధర మాత్రమే. పూర్తిగా తయారైన కార్లను దిగుమతి చేయడం వల్ల (CBU), ప్రభుత్వం విధించే భారీ 100% దిగుమతి సుంకం (Import Duty) కారణంగానే ఈ కార్లు సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మారాయి.


Click it and Unblock the Notifications








