ఫుల్ ట్యాంకుతో 1200కిమీ.. ఫ్యామిలీ టూర్లకు బెస్ట్ కారు.. ఇప్పుడు జీఎస్టీతో భారీగా తగ్గిన ధరలు
ఫ్యామిలీ టూర్లకు, లాంగ్ డ్రైవ్‌లకు ఎప్పుడూ ఎంపీవీ సెగ్మెంట్ వాహనాలే బెస్ట్ ఆప్షన్. టయోటా నుండి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ స్టార్.. ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross). ఈ మోడల్ కేవలం సౌకర్యం, ఫీచర్స్ మాత్రమే కాకుండా, ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా మార్కెట్‌లో భారీ డిమాండ్ క్రియేట్ చేసింది. మనం పెట్టే ప్రతి రూపాయికి తగ్గ లగ్జరీ, నమ్మకం ఈ కారు సొంతం. అంతేకాకుండా, ఇటీవల జీఎస్‌టీ తగ్గింపు కారణంగా దీని ధర మరింత తగ్గింది. అందుకే హైక్రాస్ భారతదేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న ఎంపీవీలలో ఒకటిగా నిలిచింది.
ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉన్న కుటుంబాలకు, ఏడు సీట్ల ఎంపీవీ ఎల్లప్పుడూ సరైన వాహనం. టయోటా ఎంపీవీ విభాగంలో కొత్త మోడల్ ఇన్నోవా హైక్రాస్. కుటుంబాలకు, సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉండే ఈ కారు, సౌకర్యం, అధునాతన ఫీచర్లు, ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది.

హైక్రాస్ ఏడు లేదా ఎనిమిది సీట్ల ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని క్యాబిన్ చాలా విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా రెండవ వరుసలోని క్యాప్టెన్ సీట్లు, మూడవ వరుసలో ఎక్కువ లెగ్‌రూమ్ ఉండటం వలన లాంగ్ జర్నీలకు, ఫ్యామిలీ టూర్లకు ఇది చాలా అనుకూలంగా ఉంది. ఈ కారణంగానే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. భారత దేశంలోని రోడ్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఇది నిజంగా మంచి ఆప్షన్.
డిజైన్, ప్రయాణ సౌకర్యం పరంగా చూస్తే హైక్రాస్ పాత ఇన్నోవా క్రిస్టా లాడర్-ఫ్రేమ్ నిర్మాణానికి బదులుగా మోనోకాక్ ఛాసిస్‌ను కలిగి ఉంది. దీని వలన కారుకు మంచి స్టెబిలిటీ, సులభమైన హ్యాండ్లింగ్ లభిస్తాయి. సుదూర ప్రయాణాలలో, హైవేలపై ఈ ఎక్స్పీరియన్స్ చాలా స్పష్టంగా తెలుస్తుంది.

హైక్రాస్ అతి పెద్ద ప్రత్యేకత హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా పనిచేయడం వలన ఈ కారు సగటున 23 కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది. ఇది పాత డీజిల్ మోడల్‌ల కంటే ఇంధన ఖర్చులో భారీ పొదుపును అందిస్తుంది. ముఖ్యంగా నగర రోడ్లపై హైబ్రిడ్ డ్రైవింగ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, 360° కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు హైక్రాస్‌ను ఒక ప్రీమియం ఎంపీవీగా మారుస్తున్నాయి. భారత మార్కెట్‌లో టయోటా అంటే విశ్వసనీయతకు మారుపేరు అని చెప్పవచ్చు. లో మెయింటెనెన్స్ కాస్ట్, నమ్మదగిన క్వాలిటీ, అద్భుతమైన సర్వీసు నెట్‌వర్క్ కారణంగా టయోటా వాహనాలకు ఎప్పుడూ ఎక్కువ రీసేల్ విలువ ఉంటుంది.

ఇటీవల జీఎస్టీలో తగ్గింపు రావడంతో ఈ వాహనం ధర బాగా తగ్గింది. టయోటా ఇన్నోవా హైక్రాస్‌కు జీఎస్టీ తగ్గించడం వలన గరిష్టంగా రూ.1.15 లక్షల వరకు ధర తగ్గింది. దీనితో పెట్రోల్, హైబ్రిడ్ మోడల్స్ మరింత తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చాయి.
ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ వేరియంట్లు 172 బీహెచ్‌పీ పవర్, 204 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0 లీటర్, నాలుగు సిలిండర్ల ఇంజిన్‌తో వస్తాయి. ఈ ఇంజిన్ సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. పాత ధర రూ.19.09 లక్షలు ఉన్న జీ 7 సీటర్ మోడల్ ధర ఇప్పుడు రూ.18.06 లక్షలుగా ఉంది.

జీ 8 సీటర్ ధర రూ.19.14 లక్షల నుంచి రూ.18.11 లక్షలకు తగ్గింది. ఈ రెండు మోడళ్లకు రూ.1.03 లక్షలు తగ్గింది. ఇంతకుముందు రూ.19.94 లక్షలు ఉన్న జీఎక్స్ 7 సీటర్ ధర రూ.18.86 లక్షలకు తగ్గింది.
హైక్రాస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లకు స్వల్పంగా ధర తగ్గింది. హైబ్రిడ్ మోడల్స్ 2.0 లీటర్ అట్కిన్సన్-సైకిల్ పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ అసిస్టెన్స్‌తో కలిసి 183 బీహెచ్‌పీ పవర్, 191 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తాయి.
దీనికి సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. హైబ్రిడ్ మోడళ్ల మైలేజ్ లీటరుకు 23.24 కిలోమీటర్లు. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 52 లీటర్లు. దీనిని పూర్తిగా నింపి మీరు 1200 కిలోమీటర్ల వరకు ఆగకుండా ప్రయాణించవచ్చు.


Click it and Unblock the Notifications








