భారత్ పేద దేశమని ఎవరు చెప్పారు? ఒక్క నెలలో ఏకంగా 4 లక్షలకు పైగా కార్లు.. టాప్‌లో మారుతీ సుజుకీ
ఇండియాలో ప్రస్తుతం కార్ల వాడకం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు టూవీలర్స్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరూ కూడా టూవీలర్స్‌తో పాటు కచ్చితంగా కారును కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నారు. ప్రజల ఆదాయ స్థితిలో మార్పు రావడం, ముఖ్యంగా యూత్ బాగా చదువుకుని చిన్న వయసులోనే లక్షలాది రూపాయల జీతాన్ని ఆర్జించటం, కుటుంబం అంతా కలిసి బస్సులు, రైళ్లు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వంటి వాటిల్లో ప్రయాణించడం కష్టతరం కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంత కార్లలో వెళ్ళడానికి చాలా మంది తక్కువ ధరలో, లేదా స్థోమతను బట్టి మరింత ఎక్కువ ధరలో అయిన లభించే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రోడ్డుపై రోజురోజుకూ కార్ల సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో జనాభా పెరుగుతున్నంత వేగంగా కార్ల కొనుగోళ్ళు కూడా బాగా పుంజుకుంటున్నాయి.
ప్రతి ఏడాది కూడా కార్ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను అనుసరించి దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగా కార్ల తయారీలో ప్రసిద్ధి చెందిన పలు కంపెనీలు కొత్త కొత్త డిజైన్లతో విడుదల చేస్తూ, మంచి లాభాలను గడిస్తున్నాయి. 2024 ఏడాదిలో దేశంలో కార్ల సేల్స్ మెరుగ్గా ఉండగా, 2025లో కూడా కంపెనీలు సేల్స్ పరంగా భారీగా ఆశలు పెట్టుకున్నాయి.

కొత్త ఏడాది జనవరి నెలలో భారతదేశంలో భారీ స్థాయిలో కార్ల అమ్మకాలు నమోదయ్యాయి. దేశంలో చాలా కార్ల తయారీ కంపెనీలు ఉన్నాయి. వాటిలో టాప్ 10 కంపెనీలు సమీక్ష నెలలో భారీ స్థాయిలో విక్రయాలను సాధించాయి. ఇండియాలో టాప్ 10 కార్ల తయారీ కంపెనీలు కలిపి మొత్తంగా 4 ,11,538 కార్లను విక్రయించాయి. ఇది గత ఏడాది 2024 జనవరి నెలలో 3,93,471 యూనిట్లుగా ఉన్నాయి.
ఈ గణంకాలను చూసినట్లయితే ఏడాది ప్రాతిపదికన కార్ల సేల్స్ బాగా పుంజుకున్నాయని తెలుస్తుంది. ఈ సారి 8,067 కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. భారతదేశంలో కార్ల మార్కెట్ ఎంత వేగంగా విస్తరిస్తుందో తెలియడానికి ఈ సంఖ్యలే నిదర్శనం. అలాగే 2024 చివరి నెల డిసెంబర్‌లో తక్కువగా 3,21,345 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇది జనవరి నెలతో పోలిస్తే 80,000 కంటే ఎక్కువ కావడం గమనార్హం.

2025 జనవరి అమ్మకాల్లో గతంలో మాదిరిగానే మారుతీ సుజుకీ అత్యధికంగా కార్లను విక్రయించిన జాబితాలో ముందు స్థానంలో ఉంది. సాధారణంగా మారతీ కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉండటం కారణంగా ఈ కంపెనీ ఎప్పుడు కూడా సేల్స్‌లో అగ్రస్థానంలో నిలుస్తుంది. జనవరిలో మారుతీ సుజుకీ మొత్తంగా 1,73,599 కార్లను విక్రయించింది. అంటే కొత్తగా కారు కొన్న ప్రతి ముగ్గురిలో ఒక్కరు మారుతీ కార్లను కొంటున్నారు.
తరువాత రెండో స్థానంలో హ్యుందాయ్ ఉంది. ఈ కంపెనీ మొత్తంగా 54,030 కార్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇక మూడో స్థానంలో దేశీయ మరో దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా నిలిచింది. తరువాత కార్ల సేల్స్‌లో నాల్గవ స్థానంలో టాటా మోటార్స్ ఉంది. జనవరి నెలలో టాటా 48,075 కార్లను సేల్ చేయగా, మహీంద్రా 50,659 కార్లను విక్రయించింది.

ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారుగా నిలిచిన టయోటా కంపెనీ 2025 జనవరిలో 26,178 అమ్మకాలతో దేశీయంగా 5వ స్థానంలో నిలిచింది, ఇక, 6వ స్థానంలో 25,025 కార్ల సేల్స్‌తో దక్షిణ కొరియాకు చెందిన కియా కంపెనీ ఉంది. 7 వ స్థానంలో హోండా (6,103), 8వ స్థానంలో ఎంజి మోటార్ (4,455), 9వ స్థానంలో స్కోడా (4,133), 10 వ స్థానంలో ఫోక్స్‌వ్యాగన్ (3,344) ఉన్నాయి.


Click it and Unblock the Notifications








