కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి దేశంలో చాలా మంది కొంటున్న టాప్ 10 కార్లు ఇవే! నంబర్ 1 కారు ఏదంటే?
గత ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో వాహన తయారీ కంపెనీలు వరుసగా తమమ సేల్స్ వివరాలను వెల్లడిస్తున్నాయి. ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రస్తుతం పోటీ విపరీతంగా పెరిగిపోయింది. తయారీదారులంతా కూడా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఇటీవల విడుదల అయిన డేటా ప్రకారం, ప్యాసింజర్ వాహనాల అమ్మకాల పరంగా దేశీయ అతిపెద్ద కార్ల తయీరీ కంపెనీ అయినటువంటి మారుతీ సుజుకీ ఇండియా 2025 ఆర్థిక సంవత్సరంలో భారత ఆటోమొబైల్ రంగంలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో, భారతదేశవ్యాప్తంగా మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాలు దాదాపు 43 లక్షలకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 42 లక్షలుగా ఉండగా, 2025లో అమ్మకాల్లో మరింత వృద్ధి నమోదైంది.
దీన్ని బట్టి దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో పెరుగుతున్న పోటీ, మారుతున్న వినియోగదారు ఇష్టాలను అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం విక్రయాల్లో మారుతీ అత్యధికంగా తన బలమైన ప్రదర్శనను కొనసాగించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన ప్రయాణీకుల వాహనం స్థానాన్ని దక్కించుకోవడానికి మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మరియు టాటా పంచ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్‌లు, SUVలు మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది.

గత ఏడాది టాటా పంచ్ భారీ అమ్మకాలతో అందరి దృష్టిని ఆకర్షించగా, తాజా లెక్కలు మరోసారి వ్యాగన్ఆర్ పటిష్ట స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు నిరూపించాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ మొత్తం 1,98,451 యూనిట్లను విక్రయించి అగ్రస్థానాన్ని తిరిగి పొందింది. ఇక్క మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వ్యాగన్ఆర్ వరుసగా నాలుగో ఏడాది నంబర్ వన్ హ్యాచ్‌బ్యాక్‌గా కొనసాగుతోంది. ఇదే టైంలో టాటా పంచ్ 1,96,572 యూనిట్లను విక్రయించింది.
ఎస్‌యూవీలు పెరుగుతున్న మార్కెట్‌లో టాటా పంచ్ పెద్ద విజయాన్ని నమోదు చేయగా, వినియోగదారులు ఇప్పటికీ హ్యాచ్‌బ్యాక్‌లను ప్రాముఖ్యతనిస్తూ WagonR ను మొదటి స్థానంలో నిలిపారు. అయితే 2024 క్యాలెండర్ సంవత్సరంలో టాటా పంచ్ అత్యధిక విక్రయాలను నమోదు చేయడం విశేషం. అదే మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని చూసినప్పుడు వ్యాగన్ఆర్ తిరిగి పైచేయి సాధించింది. ఈ గణంకాలు ఇండియా కార్ మార్కెట్లో మారుతున్న ట్రెండ్‌ను చూపిస్తున్నాయి.

మారుతీ సుజుకీ భారతీయ ఆటోమొబైల్ రంగంలో చాలా ఏళ్లుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో టాప్ 10 అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఏకంగా 7 మోడళ్లను నిలబెట్టడం ద్వారా మార్కెట్లో తన స్థాయిని మరింత బలపరచుకుంది. పేద, మధ్య తరగతి వినియోగదారులకు అనుకూలమైన కార్లను విడుదల చేయడం ద్వారా ప్రతి ఏడాది కొత్త కస్టమర్లను పెంచుకుంటే ఇండియన్ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తుంది.
భారత మార్కెట్లో మారుతున్న వినియోగదారుల ఇష్టాలకు అనుగుణంగా మారుతీ ఎప్పటికప్పుడు తన మోడళ్లను అప్‌డేట్ చేయడం పైగా ధరలను అందుబాటులో ఉంచడం, అలాగే సర్వీస్ నెట్‌వర్క్‌ను బలపరచడం వంటి చర్యలే అమ్మకాలు పెరగడానికి దోహదం చేశాయి. ఇదే సమయంలో, హ్యుందాయ్, టాటా, మహీంద్రా వంటి కంపెనీలు తమ పోటీని కొనసాగిస్తున్నా, టాప్ 10 జాబితాలో ఒక్కో మోడల్‌ను మాత్రమే నిలబెట్టాయి.

స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, అత్యాధునిక ఫీచర్స్‌తో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో 2025 ఆర్థిక సంవత్సరంలో, హ్యుందాయ్ క్రెటా 1,94,871 యూనిట్లు విక్రయించి, మిడ్-సైజ్ SUV విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇదే విధంగా, మారుతీ సుజుకీ ఎర్టిగా 1,90,974 యూనిట్ల అమ్మకాలతో MPV సెగ్మెంట్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. కుటుంబ వినియోగదారులకి అచ్చొచ్చిన ఈ కారు, కియా కారెన్స్, టయోటా ఇన్నోవా వంటి పోటీదారులను దాటేసింది.
2025 ఆర్థిక సంవత్సరంలో SUVల పట్ల వినియోగదారుల ఆసక్తి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తుంది. అత్యధికంగా అమ్ముడైన 10 కార్లలో ఐదు SUV మోడళ్లు చోటు సంపాదించాయి. కుటుంబ ప్రయాణాలకు సౌకర్యంగా ఉండటం, ప్రీమియం ఫీచర్స్, మెరుగైన సేఫ్టీ కారణంగా SUVలకు డిమాండ్ పెరుగుతుంది. అయితే, SUVల హవా కొనసాగుతున్నప్పటికీ, హ్యాచ్‌బ్యాక్ కార్లకు కూడా స్థానం ఉందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. టాప్ 10 లిస్ట్‌లో మూడు హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు ఉన్నాయి.

ఇవే కాకుండా ఎంపీవి విభాగంపై కూడా భారతీయ వినియోగదారులు తమ ఇష్టాలను చాటుకున్నారు. కస్టమర్లు ఒకే మోడల్‌ను ఎక్కువగా ఎంచుకోవడానికి ఇష్టపడటం లేదని స్పష్టం తెలుస్తుంది. వారి అవసరాలకు తగిన విధంగా వేరు వేరు కార్లను ఎంచుకుంటున్నారు. మారుతీ సుజుకీ ప్యాసింజర్ కార్ల విభాగంలో తన అగ్రస్థానాన్ని మరింత బలపరుచుకుంటూ, కొన్ని మోడళ్లతో మార్కెట్‌ను శాసిస్తోంది. అందులో ముఖ్యంగా బ్రెజ్జా, స్విఫ్ట్, బాలెనో మోడళ్లు కస్టమర్లను బాగా ఆకర్షించాయి.
బ్రెజ్జా అయితే 1,89,163 యూనిట్లను విక్రయించి, అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUVగా నిలిచింది. దాని స్టైలిష్ లుక్, మైలేజ్, లేటెస్ట్ ఫీచర్లతో వినియోగదారులను తనవైపుకు తిప్పుకుంది. మరోవైపు స్విఫ్ట్ చాలా కాలంగా క్రేజ్‌ను కోల్పోపోవడం లేదు, ఇది 1,79,641 యూనిట్ల అమ్మకాలతో ఇది స్పోర్టీ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని ఇంకా రుజువు చేసుకుంటోంది. కేవలం ఈ రెండు మోడళ్లే కాదు, బాలెనో కూడా మంచి రికార్డును నమోదు చేసింది.
బాలెనో 1,67,161 యూనిట్ల అమ్మకాలతో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అలాగే ఫ్రాంక్స్, డిజైర్ రెండూ కూడా ఆశించిన మేరకు విక్రయాలను సాధించాయి. ఫ్రాంక్స్ మోడల్ 1,66,216 అమ్మకాలను నమోదు చేయగా, చాలా కాలంగా అప్‌డేట్ వినియోగదారల ఇష్టాలకు అనుగుణంగా కొత్త మార్పులతో వస్తున్న డిజైర్ 1,65,021 యూనిట్ల సేల్స్‌ను సాధించింది. మరో శక్తివంతమైన SUV మహీంద్రా స్కార్పియో క్లాసిక్, N వేరియంట్ 1,64,842 యూనిట్లను విక్రయించింది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: 2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ డైనమిక్ మార్పులను చూడగా, SUV మోడళ్లకు, హ్యాచ్‌బ్యాక్‌లకు ప్రాధాన్యత పెరగడం స్పష్టంగా కనిపించింది. టాటా, హ్యుందాయ్, కియా వంటి బ్రాండ్‌లు పోటీని మరింత ఉత్కంఠగా మార్చిన కూడా మారుతీ సుజుకీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించగా, టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఏకంగా 7 మోడళ్లను నిలబెట్టుకుంది.


Click it and Unblock the Notifications








