రూ.5-10 లక్షల బడ్జెట్ కార్లు.. దేశంలో ఎక్కువగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌లు! మీ కారు ఇందులో ఉందా?
ఇండియాలో హ్యాచ్‌బ్యాక్ కార్లు అనేవి కేవలం ఓ వాహనం మాత్రమే కాదు, మధ్యతరగతి భారతీయుల కలలకే ప్రతిరూపం. మంచి మైలేజ్ ఇవ్వడంతో పాటు, సిటీ ట్రాఫిక్‌లో సైతం ఈజీగా నడపగలిగే విధంగా ఉంటూ అన్ని వర్గాల ప్రజలకు బాగా ఇష్టమైన సెగ్మెంట్‌గా నిలుస్తున్నాయి. గతంలో కొద్ది పాటి ఫీచర్స్‌కు మాత్రమే పరిమితమైన ఈ విభాగం కార్లు, ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్స్‌తో వస్తున్నాయి. ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ కార్లలోనూ పెద్ద స్క్రీన్లు, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరాలు వంటి ఫీచర్లు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అనేక కంపెనీలకు చెందిన హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. గత నెలలో ఇవి బాగా అమ్ముడుపోయాయి. ఈ క్రమంలో జూన్‌లో అమ్ముడైన టాప్ 10 హ్యాచ్‌బ్యాక్ కార్లు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
జూన్ 2025 నెలలో హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో మారుతి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. స్విఫ్ట్ కారు, నేటి యువత నుండి కుటుంబ వినియోగదారుల వరకు అందరినీ ఆకర్షిస్తూ అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. ఈ ఒక్క మోడల్ మాత్రమే కాదు, మొదటి మూడు స్థానాల్లో కూడా మారుతి సుజుకి కార్లే ఉండడం ఈ బ్రాండ్‌కు ఉన్న ప్రజాదరణకు అద్దంపడుతోంది. ఈ జూన్‌లో 13,275 యూనిట్ల స్విఫ్ట్ కార్లు విక్రయమయ్యాయి.

అయితే ఇది గత సంవత్సరం, అంటే జూన్ 2024లో నమోదైన 16,422 యూనిట్లతో పోలిస్తే 19 శాతం తగ్గుదల. కొత్త పోటీదారుల లాంచ్‌లు, ఇతర సెగ్మెంట్లపై క్రేజ్ పెరగడం వల్ల స్విఫ్ట్ అమ్మకాలపై కొంత ప్రభావం పడినట్టు కనిపిస్తోంది. స్విఫ్ట్ తరువాతి స్థానంలో నిలిచినది మరో మారుతి మోడల్ అయిన వ్యాగన్ ఆర్. ఇది 12,930 యూనిట్ల అమ్మకాలతో జూన్ 2025లో భారతదేశంలో రెండవ అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది.
పెట్రోల్‌తో పాటు సీఎన్జీ వేరియంట్లు ఉండటంతో వ్యాగన్ ఆర్ వినియోగదారులకు ప్రాక్టికల్ ఎంపికగా మారింది. గత ఏడాది జూన్ నెలలో వ్యాగన్ఆర్ అమ్మకాలు 13,790 యూనిట్లుగా ఉన్నాయి. జూన్ 2025 హ్యాచ్‌బ్యాక్ సేల్స్ లిస్ట్‌లో మూడవ స్థానాన్ని దక్కించుకున్నది మారుతి సుజుకి బాలెనో. ప్రీమియమ్ ఫీచర్లతో, హ్యుందాయ్ i20 వంటి కార్లకు పోటీగా నిలిచే బాలెనో, మారుతి షోరూమ్ కాకుండా నెక్సా ఔట్‌లెట్ల ద్వారా విక్రయించబడుతుంది.

ఈ నెలలో 8,966 యూనిట్లు అమ్ముడవడం ద్వారా మూడవ స్థానాన్ని సాధించింది. అయితే ఈ సంఖ్య, గత సంవత్సరం జూన్ 2024లో అమ్ముడైన 14,895 యూనిట్లతో పోలిస్తే దాదాపు 40 శాతం తగ్గుదలకు సంకేతం. ధరలు పెరగడం, కొత్త కాంపిటీటర్ల రాక, ఇంకా ఎలక్ట్రిక్ సెగ్మెంట్ మీద ఆకర్షణ పెరగడం వంటి అంశాలు బాలెనో అమ్మకాలను ప్రభావితం చేసినట్లుగా కనిపిస్తోంది. 4వ స్థానంలో టాటా టియాగో నిలిచింది.
ఇది 6,032 యూనిట్ల అమ్మకాలతో, ఈ భారతీయ బ్రాండ్ సిటీ డ్రైవింగ్‌కు అనువైన కాంపాక్ట్ కారుగా తక్కువ ధరలో మంచి మైలేజ్, సేఫ్టీ ఫీచర్లు అందిస్తూ ప్రజాదరణ పొందుతోంది. 5వ స్థానంలో మరో మారుతి క్లాసిక్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో K10 నిలిచింది. ఈ నెలలో 5,045 యూనిట్లు అమ్ముడయ్యాయి. బడ్జెట్-ఫ్రెండ్లీ కస్టమర్లకు ఇది ఇప్పటికీ మొదటి ఎంపిక. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఆల్టో అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.

డేటా ప్రకారం, ఆల్టో గత ఏడాది జూన్‌లో 7,775 యూనిట్లు అమ్ముడుపోయింది. దీని తరువాత హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 4,237 యూనిట్లతో 6వ స్థానం, 3,974 యూనిట్లతో టాటా ఆల్ట్రోజ్ 7వ స్థానంలో నిలవగా, చివరి మూడు స్థానాల్లో 3,785 అమ్మకాలతో హ్యుందాయ్ ఐ20 , 2,938 యూనిట్లతో టయోటా గ్లాంజా, 2,038 యూనిట్ల అమ్మకాలతో మారుతి సుజుకి సెలెరియో చివరి 8,9,10 వ స్థానాల్లో నిలిచాయి.


Click it and Unblock the Notifications








