30 కి.మీ మైలేజ్ కారు.. హాట్ కేకుల్లా అమ్ముడవుతుంది.. బడ్జెట్ ధరకు వచ్చేసరికి అందరు కావాలంటున్నారు!
టయోటా (Toyota), సుజుకి (Suzuki) మధ్య భాగస్వామ్యం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఒక కీలక మలుపు అని చెప్పొచ్చు. ఈ కలయిక ద్వారా టయోటా, మారుతి సుజుకి కార్లను తన పేరుతో రీ-బ్యాడ్జ్ చేసి విక్రయిస్తోంది. అందులో ఒకటి టయోటా గ్లాంజా (Toyota Glanza). ప్రధానంగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలోకి వచ్చే ఈ కారు, మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno)కి రీ-బ్యాడ్జ్ వెర్షన్. టయోటా భారత మార్కెట్లో మొదటిసారి రీ-బ్యాడ్జ్ చేసి అమ్మిన మారుతి సుజుకి మోడల్ కూడా ఇదే కావడం గ్లాంజా ప్రాధాన్యతను మరింత పెంచింది.
డిజైన్, ఫీచర్ల పరంగా బాలెనోకు దగ్గరగా ఉన్నా, టయోటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, సర్వీస్ నెట్‌వర్క్ కలిసిరావడంతో గ్లాంజా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రోజువారీ వాడకం, స్టైలిష్ లుక్, ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే యువతరం, ఉద్యోగులు, కుటుంబాలు అందరికీ ఇది ఒక సరైన ఎంపికగా నిలుస్తోంది.

ఇక తాజా అమ్మకాల గణాంకాల ప్రకారం, 2025 ఆగస్టు నెలలో టయోటా గ్లాంజా 5,102 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో విక్రయించిన 4,624 యూనిట్లతో పోలిస్తే దాదాపు 10 శాతం వృద్ధి సాధించడం గమనార్హం. పెరుగుతున్న పోటీ, మార్కెట్లో కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు రావడం వంటి పరిస్థితుల్లో కూడా గ్లాంజా తన స్థానాన్ని కాపాడుకోవడం ప్రత్యేకం. ఈ విజయానికి కారణం టయోటా అందిస్తున్న బ్రాండ్ విలువ, కస్టమర్ నమ్మకం.
అలాగే మారుతి సుజుకి బాలెనోలో ఇప్పటికే ఉన్న పనితీరు, మైలేజ్. ఈ రెండింటి కలయిక గ్లాంజాను కస్టమర్లకు మరింత చేరువ చేసింది. భారతీయ మార్కెట్లో టయోటా-సుజుకి భాగస్వామ్యం ముందుకి సాగుతున్న కొద్దీ, ఇలాంటి రీ-బ్యాడ్జ్ మోడల్స్‌కి డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గ్లాంజా తాజా సేల్స్ సంఖ్య కూడా అదే విషయాన్ని నిరూపిస్తోంది. టయోటా గ్లాంజా భారతదేశంలో 2019 జూన్ నెలలో విడుదల అయింది.

టయోటా గ్లాంజా భారత మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి కంపెనీ అమ్మకాల సంఖ్యను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. స్టైలిష్ లుక్, నమ్మకమైన పనితీరు, బ్రాండ్‌కి ఉన్న విలువ గ్లాంజాను కస్టమర్లకు చేరువ చేసింది. ధరల విషయానికి వస్తే, ప్రారంభ ధర రూ.6.99 లక్షలు కాగా, టాప్ ఎండ్ వేరియంట్ రూ.10 లక్షల వరకు ఉంటుంది(ఎక్స్-షోరూమ్). అయితే ఆన్‌రోడ్ ధరలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ఖర్చుల కారణంగా మరింత ఎక్కువగా వస్తాయి.
ఇక ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుంచి వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం. దీని ప్రభావం గ్లాంజా ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. వేరియంట్‌ను బట్టి రూ.59,600 నుంచి గరిష్టంగా రూ.85,300 వరకు ధరలు తగ్గాయి. ఈ తగ్గింపు కస్టమర్లకు పెద్ద ఊరట కలిగించడమే కాకుండా, గ్లాంజా సేల్స్ మరింత వేగం అందుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటికే 10 శాతం వృద్ధి సాధించిన ఈ కారు, ధరల తగ్గింపు నేపథ్యంలో ఇంకా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కంపెనీ తగ్గింపుతో పాటు సేల్స్ పెంచుకోవడానికి ప్రత్యేకమైన ఆఫర్స్ అందించడంతో పాటు, డీలర్లు కూడా తమ వద్ద ఉన్న స్టాకును క్లియర్ చేయడానికి అదనంగా క్యాష్‌బ్యాక్‌లు మొదలైనవి కూడా అందించే అవకాశం ఉంది.
పెర్ఫామెన్స్ పరంగా టయోటా గ్లాంజా కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఉంది. దీని మాన్యువల్ గేర్‌బాక్స్ మోడల్ లీటరుకు 22.35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. AMT మోడల్ 22.94 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. గ్లాంజాలో 1.2 లీటర్ CNG ఇంజన్ ఎంపిక కూడా ఇస్తుంది. ఈ వేరియంట్ మైలేజ్ కిలోకు దాదాపుగా 30.61 కిలోమీటర్లుగా ఉంది.


Click it and Unblock the Notifications








