పెద్దలకైనా, పిల్లలకైనా ఫుల్ సేఫ్టీ! టయోటా కారుకి 5-స్టార్ రేటింగ్.. క్రాష్ టెస్ట్‌లో దుమ్ములేపింది
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM)కు చెందిన ప్రసిద్ధ మోడల్ ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలో లభిస్తూ ఎంతటి దూరం అయినా, లక్షల కిలోమీటర్లు అయినా ఎటువంటి సమస్య లేకుండా ప్రయాణించే సామర్థ్యంతో మార్కెట్లో ఇతర మోడళ్లకు బలమైన పోటీ ఇస్తుంది. మంచి కంఫర్ట్, మైలేజ్ వంటి అంశాలతో నిలుస్తున్న ఈ మోడల్ తాజాగా ఇప్పుడు మరో ఘనతను సాధించింది. ఇటీవల ఈ కారును భారత NCAP క్రాష్ టెస్ట్‌కు గురిచేయగా, దీనిలో అద్భుతమైన ఫలితాలను సాధించింది. టయోటా తన మూడవ తరం ఇన్నోవా హైక్రాస్‌ను ఈ క్రాష్ టెస్ట్‌లో పలు విధాలుగా పరీక్షలు నిర్వహించింది. ఇది అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలను కూడా ఎలాంటి వెనుకడుగు లేకుండా తట్టుకుని నిలిచింది.
ఇన్నోవా హైక్రాస్ ఈ క్రాష్ టెస్ట్‌లో పెద్దల రక్షణకు, చిన్నారుల భద్రతకు గరిష్ఠమైన 5-స్టార్ రేటింగ్ పొందింది. అంటే, ప్రయాణికుల ప్రాణాలకు మరింత భరోసా ఇచ్చే స్థాయిలో దీని డిజైన్, నిర్మాణం రూపొందించబడింది. దీనికి మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, బలమైన బాడీ షెల్, అత్యాధునిక సేఫ్టీ సిస్టమ్స్ సహకరించాయి. ఇంతకాలం లాంగ్ రైడ్ కంఫర్ట్ కోసం గుర్తింపు పొందిన ఇన్నోవా, ఇప్పుడు అత్యున్నత భద్రతా ప్రమాణాల కారుగా కొత్త మైలురాయి నెలకొల్పింది.

భారతీయ కుటుంబాల విశ్వసనీయ కారుగా ఇన్నోవా నిలిచింది. ఇప్పుడు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో ఆ స్థానం మరింత గొప్ప స్థాయికి చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సారి క్రాష్ టెస్ట్‌కు గురైనవీ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (SHEV) వేరియంట్లు, అంటే, 8-సీటర్ VX SHEV, 7-సీటర్ ZX SHEV మోడల్స్. ఇవి హైబ్రిడ్ మొబిలిటీపై టయోటా దృష్టిని, అలాగే భద్రతను ఏమాత్రం రాజీపడకుండా అందించాలనే ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
భారత్ NCAP ప్రకారం, ఇన్నోవా హైక్రాస్ పెద్దల రక్షణ (Adult Occupant Protection - AOP) విభాగంలో అత్యుత్తమ స్కోర్లు సాధించింది. గరిష్ఠంగా 32 పాయింట్లకు 30.47 పాయింట్లు సాధించడం సాధారణ విషయం కాదు. అంటే ఫ్రంట్ ఇంపాక్ట్, సైడ్ ఇంపాక్ట్, హెడ్-చెస్ట్ ప్రొటెక్షన్ వంటి అన్ని విభాగాల్లో గణనీయంగా రక్షణ సౌకర్యం కలిగినట్లు నిపుణులు గుర్తించారు. ఓవరాల్‌గా ఇది అద్భుతమైన ఆక్యుపెంట్ సేఫ్టీ పనితీరును కనబరిచింది.

పిల్లల రక్షణ (Child Occupant Protection - COP) విషయానికి వస్తే, టయోటా ఇన్నోవా మరింత చక్కటి పనితీరును చూపెట్టింది. గరిష్ఠంగా 49 పాయింట్లకు 45 పాయింట్లను సాధించింది. ముఖ్యంగా డైనమిక్ టెస్ట్‌లో, అంటే యాక్సిడెంట్ సిమ్యులేషన్‌లో 24కి 24 పర్ఫెక్ట్ స్కోర్ రాబట్టింది. ఈ పరీక్షల్లో 18 నెలల, 3 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులను సూచించే డమ్మీలను వాడి, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరీక్షించారు.
ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో ఈ MPV 16కి 14.47 పాయింట్లను సాధించింది. అంటే ముందుగా ఎదురయ్యే ఇంపాక్ట్‌కి గణనీయ స్థాయిలో రక్షణ కల్పించగల సామర్థ్యం ఉందని ఈ స్కోరు చూపిస్తోంది. కేవలం ఫ్రంట్ ఇంపాక్ట్ మాత్రమే కాకుండా, సైడ్ ఇంపాక్ట్‌లో కూడా ఇన్నోవా హైక్రాస్ అత్యుత్తమ రీతిలో ప్రదర్శించింది. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో గరిష్ఠంగా 16కి 16 పాయింట్లను సొంతం చేసుకుంది.

దీన్ని బట్టి ఈ MPV ప్రయాణీకులను అన్ని కోణాల నుండి రక్షించేలా రూపొందించబడిందని స్పష్టంగా తెలిపింది. సైడ్ ఇంపాక్ట్ సమయంలో గరిష్ఠ రక్షణ అందించడం అంటే భద్రతపై టయోటా ఎంత సీరియస్‌గా పని చేసిందో అర్థం అవుతుంది. ఈ MPVకి ఉన్న భద్రతా లక్షణాలు వాహనదారులను మరింత విశ్వాసంతో నడిపేలా చేస్తాయి. అందులో ప్రతీ సీటుకి 3-పాయింట్ సీట్ బెల్టులు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు (కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లతో సహా) ఉన్నాయి.
అలాగే, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), పాదచారుల రక్షణ సాంకేతికత, చిన్నారుల కోసం ISOFIX సీటు మౌంట్‌లు, ప్రతి సీటుకి సీట్ బెల్ట్ రిమైండర్, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. కారు కొనుగోలుదారులకు సేఫ్టీ కీలకమైన అంశం కాబట్టి MPV క్రాష్ టెస్ట్ ఫలితాలు సరైన సమయంలో రావడంతో ఇకపై కస్టమర్లు దీన్ని నమ్మకంగా కొనుగోలు చేసే అవకాశం ఉంది.
6 వేరియంట్లలో GX, GX(O), VX, VX(O), ZX, ZX(O) టయోటా ఇన్నోవా హైక్రాస్ ప్రారంభ ధర రూ. 19.94 లక్షల నుండి రూ. 31.34 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉంది. ఈ MPV 2.0-లీటర్, 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 2.0-లీటర్, 4-సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








