పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ కారు, పైగా అన్ని ఫీచర్స్ ఉన్నాయ్.. ఒక్క కారణంతో కస్టమర్లు షోరూమ్‌కు రావడం మానేశారు!
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎంతో ప్రసిద్ధిగాంచిన దిగ్గజ వాహన తయారీ కంపెనీ టయోటా (Toyota)కు చెందిన పేరున్న MPV ఇన్నోవా (Innova) శక్తివంతమైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్, విశాలమైన ఇంటీరియర్, ప్రయాణికుల భద్రత వంటి అంశాలతో ఎన్నో కుటుంబాల విశ్వాసాన్ని గెలుచుకుంది. అయితే ఈసారి అమ్మకాల పరంగా ఈ MPVకి ఎదురుదెబ్బ తగిలినట్టుంది. 2025 జూన్ నెల అమ్మకాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కాస్త వెనకబడింది. తాజా నివేదికల ప్రకారం, జూన్ 2025లో టయోటా ఇన్నోవా మోడళ్లను మొత్తం 8,802 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగారు. ఇదే జూన్ 2024లో అమ్మకాలు 9,412 యూనిట్లుగా ఉండటంతో, సంవత్సరానికి సగటున ఇది దాదాపు 6 శాతం తగ్గుదలగా నమోదు అయ్యింది.
ఈ తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ధరే ప్రధాన సమస్యగా వినియోగదారులు పేర్కొంటున్నారు. టయోటా ఇన్నోవా ధర మధ్యతరగతి కొనుగోలుదారులకు అందని విధంగా ఉంది. అదే సమయంలో, మార్కెట్లో ఇతర కంపెనీల నుండి వచ్చిన కొత్త MPVలు తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ఫీచర్లతో అందుబాటులో ఉండటంతో, చాలా మంది వినియోగదారులు వాటిపైనే దృష్టి సారిస్తున్నారు. ఇన్నోవా, అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ MPVల వల్ల మార్కెట్ షేర్ కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.

టయోటా ఇన్నోవా.. పేరు చెబితేనే నమ్మకమైన కారు గుర్తుకొస్తుంది. ఇది కేవలం ఓ MPV కారు మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాల ప్రయాణాలకు ఫేవరెట్‌గా మారిన మోడల్. ఇన్నోవా తన ఖచ్చితమైన బిల్డ్ క్వాలిటీ, ప్రీమియం ఫీచర్లు, ప్రయాణ సౌకర్యం వల్ల ఇప్పటికీ మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ MPV ధర రూ. 19.94 లక్షల నుండి రూ. 32.58 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.
ఇది GX, VX, GX(O), VX(O), ZX, ZX(O) అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది, వినియోగదారుల అవసరాలు, బడ్జెట్ ప్రాతిపదికన ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఎక్స్‌టీరియర్ డిజైన్ విషయానికి వస్తే, ఇది ఆకర్షణీయమైన స్టైల్‌తో కూడిన మోడరన్ లుక్‌ను కలిగి ఉంది. కలర్స్ ఎంపికలోనూ విభిన్నత ఉంది. సూపర్ వైట్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా, ప్లాటినం వైట్ పెర్ల్, సిల్వర్ మెటాలిక్ వంటి ప్రత్యేకమైన షేడ్లు అందుబాటులో ఉన్నాయి.

ఇంజిన్ ఎంపికల్లోనూ టయోటా కొత్త హైక్రాస్ వేరియంట్ ద్వారా విస్తృత ఎంపికను అందిస్తోంది. ఇందులో 2.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, 2.0-లీటర్ హైబ్రిడ్ ఇంజన్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్) వేరియంట్ కూడా ఉంది. హైబ్రిడ్ వేరియంట్ 23 కిలోమీటర్ల మైలేజ్ వరకు ఇవ్వగలదు, ఇది ఈ సెగ్మెంట్‌లో ఓ పెద్ద అట్రాక్షన్. మరొక ముఖ్యాంశం, ఇది 7 లేదా 8 సీట్ల ఎంపికలతో అందుబాటులో ఉండటం.
దీంతో పెద్ద కుటుంబాలు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా కలిసి ప్రయాణించవచ్చు. లాంగ్ జర్నీ అయినా, సిటీ ట్రిప్ అయినా... ఈ MPV అందరినీ కంఫర్ట్‌గా ఉంచేలా డిజైన్ చేయబడి ఉంది. ఇన్నోవా క్రిస్టా గురించి తెలుసుకున్నట్లయితే, భారతీయ కుటుంబాల నమ్మకమైన కారు. దీని డిజైన్, పనితీరు ప్రత్యేకతగా నిలబెట్టింది. ప్రస్తుతం ఈ MPV ధర రూ. 19.99 లక్షల నుంచి రూ. 27.08 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

ఇది మూడు వేరియంట్లలో GX, GX ప్లస్, VXలలో అందుబాటులో ఉంటుంది. అవసరాన్ని బట్టి ప్రామాణిక ఫీచర్లతో పాటు, ప్రీమియం టచ్‌తో కూడిన ఆప్షన్లను ఎంచుకోవచ్చు. కొత్త క్రిస్టా 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది, దీని వల్ల డ్రైవింగ్ సమయంలో మంచి కంట్రోల్, ట్రాక్షన్ లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి, ఇందులో 7 లేదా 8 సీట్ల ఎంపిక అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications