టయోటా కార్ల అమ్మకాల్లో రికార్డు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆ మోడల్స్ మాత్రమే కావాలంటున్నారట
ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన వాహన తయారీ సంస్థలలో ఒకటి టయోటా. కర్ణాటకలోని బిడదిలో ఉన్న టయోటా అతిపెద్ద ప్లాంట్‌లో తయారయ్యే కార్లకు ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా జులై నెలలో టయోటా కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. జులై 2025లో మొత్తం 32,575 యూనిట్లను టయోటా విక్రయించింది. గత సంవత్సరం ఇదే సమయంలో 31,656 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, అమ్మకాలు ఏకంగా 3% పెరిగాయి.
టయోటా ఈ స్థాయిలో అమ్మకాలు సాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా, టయోటా కార్లు వాటి క్వాలిటీ, అడ్వాన్సుడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్ల కోసం ప్రసిద్ధి చెందాయి. అంతేకాకుండా, విశాలమైన ఇంటీరియర్ స్పేస్, మెరుగైన మైలేజ్, సరసమైన ధరలు కూడా వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఎక్కువమంది కస్టమర్లు టయోటా కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అత్యధికంగా అమ్ముడైన టయోటా కార్లు, వాటి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

టయోటా ఇన్నోవా హైక్రాస్ : ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపీవీ కారు. దీని ధర రూ. 19.94 లక్షల నుంచి రూ. 31.49 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. 2.0-లీటర్ పెట్రోల్, 2.0-లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. మైలేజ్ పరంగా ఇది 23.24 కిలోమీటర్ల వరకు అందిస్తుంది. దీనిలో 7/8 సీట్ల ఆప్షన్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టయోటా ఇన్నోవా క్రిస్టా : పాత తరం ఇన్నోవా క్రిస్టాకు కూడా ఇంకా డిమాండ్ తగ్గలేదు. ఇది రూ. 19.99 లక్షల నుంచి రూ. 27 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ధరతో లభిస్తుంది. దీనిలో 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. 7/8 సీట్ల ఆప్షన్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి.

టయోటా రూమియన్ : ఇది తక్కువ బడ్జెట్‌లో లభించే ఎంపీవీ. దీని ధర రూ. 10.66 లక్షల నుంచి రూ. 13.95 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. 1.5-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. ఇది 20 నుంచి 26 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 7 సీట్ల ఆప్షన్ ఉంటుంది.
టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ : ఇది సరికొత్త ఎస్‌యూవీ. దీని ధర రూ. 7.74 లక్షల నుంచి రూ. 13 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. 1.0-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది. మైలేజ్ 19 నుంచి 28 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనిలో 5 సీట్లు, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

టయోటా గ్లాంజా : ఇది హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మంచి అమ్మకాలను సాధిస్తోంది. దీని ధర రూ. 6.90 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇది 22.35 నుంచి 30.61 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 5 సీట్లు మరియు 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటాయి.
టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ : ఇది కూడా బాగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ. దీని ధర రూ. 11.34 లక్షల నుంచి రూ. 20.19 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. 1.5-లీటర్ హైబ్రిడ్ (పెట్రోల్+ఎలక్ట్రిక్), సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. మైలేజ్ 19 నుంచి 28 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనిలో 5 సీట్లు, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications