కొత్త కారు కొనాలా? అందరికి ఇష్టమైన కారు ధర పెరిగింది.. షోరూమ్‌కు వెళ్లే ముందే తెలుసుకోండి!
టయోటా రూమియన్ (Toyota Rumion) పేరే చాలు, పెద్ద ఫ్యామిలీ కార్ కోసం వెతుకుతున్నవారికి ఇది ముందే గుర్తొస్తుంది. విశ్వసనీయత, ప్రాక్టికాలిటీ, మరి ముఖ్యంగా టయోటా బ్రాండ్ నమ్మకం కలసి దీనిని మార్కెట్లో ఒక పాపులర్ ఎంపీవీగా నిలిపాయి. సంవత్సరాలుగా కొనుగోలుదారుల విశ్వాసాన్ని అందుకుంటున్న ఈ MPV, 2025 మొదటి ఆరు నెలల్లోనే 11,630 యూనిట్లు అమ్ముడై మళ్లీ తన డిమాండ్‌ను రుజువు చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం, టయోటా రూమియన్ ధర ఇప్పుడు కొంచెం పెరిగింది. మీడియా నివేదికల ప్రకారం, అన్ని వేరియంట్లపై దాదాపు రూ. 12,500 వరకూ ధర పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు రూమియన్ ధర రూ. 10.66 లక్షల నుండి ప్రారంభమై, టాప్ వేరియంట్‌కి రూ. 13.95 లక్షల వరకు చేరుతోంది (ఎక్స్-షోరూమ్ ధరలు).
వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కార్ అయిన రూమియన్‌కి ఇలాంటి చిన్న ధర పెంపు ఓవర్‌ఆల్ డిమాండ్‌పై అంతగా ప్రభావం చూపకపోవచ్చు. టయోటా స్థిరమైన బ్రాండ్ ఇమేజ్, మైలేజ్, స్పేస్, ఇంకా తన క్లాసిక్ MPV లుక్‌కి అభిమానులే ప్రత్యేకం. ధర మారినప్పటికీ, ఈ MPV కొనుగోలు జాబితాలోనే ఉండనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టయోటా రూమియన్ అనేది మారుతి సుజుకి ఎర్టిగా ఆధారంగా రూపొందించబడిన రీ-బ్యాడ్జ్డ్ మోడల్.

అదే బాడీ, అదే ప్లాట్‌ఫాం ఉన్నా, టయోటా బ్రాండ్ టచ్‌తో ఇది కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది. బలమైన నిర్మాణం, చక్కటి ఇంజిన్ పనితీరు, ఇంకా ప్రయాణికులకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలు ఈ కారులో అందించారు. ఈ MPV మొత్తం ఆరు వేరియంట్లలో S మాన్యువల్, S ఆటోమేటిక్, G మాన్యువల్, V మాన్యువల్, V ఆటోమేటిక్, S మాన్యువల్ CNG లలో లభిస్తుంది.
అందులో CNG వేరియంట్‌ను కూడా అందుబాటులో ఉంచడం, రోజువారీ ప్రయాణాల కోసం ఎక్కువగా ఉపయోగపడేలా చూస్తుంది. రూమియన్‌లో మొత్తం 7 సీట్లు ఉండడం వల్ల పెద్ద కుటుంబాలు దీనిని ఎంపిక చేసుకుంటారు. సీట్ల ఏర్పాటు ప్రాక్టికల్‌గా ఉండడంతో, ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చొనగలుగుతారు. వారాంతాల్లో, సెలవు రోజుల్లో కుటుంబం అంతా కలిసి దూరప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, వారి సామాను సురక్షితంగా ఉంచేందుకు దీని 209 లీటర్ల బూట్ స్పేస్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

టయోటా రూమియన్‌కి శక్తివంతమైన 1.5-లీటర్ 2-సిలిండర్ పవర్‌ట్రెయిన్ లభిస్తుంది. ఇది మైలేజ్‌కి ప్రాధాన్యతనిచ్చే ఫ్యామిలీ కార్ అయినా, ఇంజిన్ పరంగా మంచి పనితీరును అందించగలదు. పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే, ఇది 103 PS పవర్, 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్రైవింగ్ అవసరాలను బట్టి వినియోగదారులు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను ఎంచుకునే వీలుంది.
పెట్రోల్ వేరియంట్‌కి టయోటా అధికారికంగా 20.51 kmpl మైలేజీని ప్రకటించింది, ఇది సిటీ, హైవే మిక్స్‌డ్ డ్రైవింగ్‌కి తగినదే. వాటితో పాటు, ఈ MPVకి 1.5-లీటర్ CNG వేరియంట్ కూడా లభిస్తుంది. ఇది పెట్రోలుతో పోలిస్తే కొద్దిగా తక్కువగా 88 PS పవర్, 121.5 Nm టార్క్‌ను అందించినా, అధిక మైలేజ్ కోరుకునే వినియోగదారులకు ఇది బెస్ట్ ఎంపికగా మారుతుంది. CNG వేరియంట్‌కి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే లభిస్తుంది.

రూమియన్ CNG వేరియంట్ 26.1 km/kg మైలేజీని అందించగలదు, దీని వలన దూర ప్రయాణాల్లో, రోజువారీ డ్రైవింగ్‌లో పెట్రోలు ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు. ఈ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో టయోటా రూమియన్ వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది, పెర్ఫార్మెన్స్ కావాలన్నా, లేదా మైలేజ్‌కు ప్రాధాన్యతనిచ్చినా ఈ కారు బాగా సెట్ అవుద్ది.


Click it and Unblock the Notifications








