వీఐపీ లుక్.. లగ్జరీ కార్లను మించిపోయే ఫీచర్లు.. ఒక్క ఛార్జ్‌తో వందల కిలోమీటర్లు.. VF సిరీస్‌కు అంతా సిద్ధం!
వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ "విన్‌ఫాస్ట్ (vinfast)" ఇప్పుడు భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది. అంతర్జాతీయంగా అనేక ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, టూవీలర్ వాహనాలతో ఇప్పటికే మార్కెట్‌ను ఆకట్టుకున్న ఈ సంస్థ, ఇప్పుడు భారత వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో, విన్‌ఫాస్ట్ తన శక్తివంతమైన కార్లను భారత్‌కు పరిచయం చేసింది. ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించి, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో గణనీయమైన మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో, ఈ సంస్థ భారతదేశంలోనే తయారీ సౌకర్యాలను అభివృద్ధి చేస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడి వద్ద ఏర్పాటు చేస్తున్న భారీ ఉత్పత్తి కేంద్రం ద్వారా భారత మార్కెట్‌కు సరఫరా చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ యూనిట్ కొన్ని రోజుల్లోనే ఉత్పత్తి ప్రారంభించనుంది. ఇందులో తయారయ్యే వాహనాలు త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. వాటిలో తొలి కారును కంపెనీ విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే విన్ ఫాస్ట్ దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ అంకితభావంతో, విన్‌ఫాస్ట్ భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరింత ప్రతిష్టాత్మకంగా ఎదగనుందన్న విషయమై ఎటువంటి సందేహం లేదు.

ఇది స్థానిక వినియోగదారులకు మరింత ఎకో-ఫ్రెండ్లీ, ఆధునిక టెక్నాలజీ వాహనాలను అందించడంలో కీలక పాత్ర పోషించనుంది. విన్‌ఫాస్ట్ భారత్‌లో తమ తొలి ఎలక్ట్రిక్ కారు "VF6"తో ఎంట్రీ ఇవ్వనుంది. దీని ద్వారా భారతీయ మార్కెట్లో తమ ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. VF6 అనేది ఒక స్టైలిష్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV. దీపావళి సమయంలో ఈ కారు అమ్మకానికి రావడం ఖాయమని తెలిసింది. ఇప్పటికే ముంబై రోడ్లపై దీనిని పరీక్షించారు.
అంతర్జాతీయంగా ఇప్పటికే అమ్ముడవుతున్న ఈ మోడల్, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల నుంచి మంచి స్పందనను సంపాదించింది. భారత మార్కెట్ కోసం దీని ధరను సుమారుగా రూ.18 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించవచ్చని అంచనా. VF6లో 59.6 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 379 నుండి 410 కిలోమీటర్ల వరకూ ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ SUVలో 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇవ్వబడింది. దీనికి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఉన్నప్పటికీ, హెడ్అప్ డిస్‌ప్లే, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి. ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మార్చేస్తాయి. అంతే కాదు, వేడి వాతావరణాల్లో ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు,6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, ADAS సేఫ్టీ అంశాలు కూడా దీనిలో ఉన్నాయి.
విన్‌ఫాస్ట్ నుంచి భారత మార్కెట్లోకి రాబోతున్న ప్రీమియం ఎలక్ట్రిక్ SUV VF7 ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారుల ముందుకు వచ్చే అవకాశముంది. ఇప్పటికే అంతర్జాతీయంగా అమ్మకంలో ఉన్న ఈ మోడల్, అధునాతన డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ, మరియు గణనీయమైన రేంజ్‌తో భారతీయ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ SUVలో 75.3 కిలోవాట్-అవర్ (kWh) సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను వినియోగించారు.

ఇది పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 431 నుండి 450 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలదు. అంటే, రోజువారి ప్రయాణాలు కాకుండా, వీకెండ్ లాంగ్ డ్రైవ్స్‌కి కూడా ఇది సరిపోతుంది. ధర విషయానికొస్తే, ఈ ఎలక్ట్రిక్ SUVను భారత్‌లో రూ.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు అందించే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నాయి. ఇది విలాసవంతమైన ఫీచర్లు, టెక్నాలజీతో లగ్జరీ EV సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇచ్చేలా ఉంది.
దీని తరువాత మరో మోడల్ VF3 EV ని ఫిబ్రవరి 2026లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కారు ధర రూ. 7.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) అని చెబుతున్నారు. ఇది ఇండోనేషియాతో సహా అనేక దేశాలలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కారు 18.64 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 215 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు.


Click it and Unblock the Notifications








