ఈ కారును గత నెలలో కేవలం ఇద్దరు మాత్రమే కొన్నారు! అంతా బాగానే ఉన్నప్పటికీ ఎందుకు సంకోచిస్తున్నారు?
ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) అనేది జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బ్రాండ్‌గా, హై-క్వాలిటీ,స్టైలిష్, సేఫ్ కార్లను అందించడంలో పేరుగాంచింది. ఇండియాలో కూడా చాలా కాలంగా అధునాతన కార్లను విక్రయిస్తుంది. భారతీయ వినియోగదారులకు విశ్వసనీయ బ్రాండ్‌గా ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే మోడళ్ల పట్ల మంచి ఆదరణ ఉంది. ఇటీవల, కంపెనీ ఫిబ్రవరి 2025 అమ్మకాల గణాంకాలను వెల్లడించింది. ఈ నెలలో కస్టమర్లు చాలా మంది ఫోక్స్‌వ్యాగన్ కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. అన్ని మోడళ్లలో 3,110 మంది కొత్త కస్టమర్లను కంపెనీ సంపాదించడం విశేషం. 2024 ఇదే ఫిబ్రవరి నెలలో 3,019 మంది కంపెనీకి చెందిన పలు మోడళ్లను కొనుగోలు చేయగా ఈ సారి ఆ సంఖ్య 3.01 శాతం వృద్ధి చెందింది.
అయితే జనవరి 2025తో పోలిస్తే గత నెలలో సేల్స్ నెలవారీగా 7 శాతం తగ్గింది. ఈ సమయంలో ఫోక్స్‌వ్యాగన్ అనుకున్నంత విక్రయాలను నమోదు చేయలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ఇతర కార్ల తయారీదారుల నుంచి పోటీ విపరీతంగా పెరగడం, అలాగే కస్టమర్లు కొత్తగా లాంచ్ అయిన వేరే కంపెనీలకు చెందిన మోడళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం కారణంగా ఫిబ్రవరి సేల్స్ కాస్త తగ్గాయి.

ఫిబ్రవరి 2025 అమ్మకాల్లో వర్టస్ (virtus) కారును జనాలు అధికంగా కొనుగోలు చేశారు. ఇది గత నెలలో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. దీని అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 2.3 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Taigun) 1,271 కార్ల అమ్మకాలను నమోదు చేసి రెండవ స్థానంలో నిలవడం విశేషం. కస్టమర్లకు వర్టస్ తరువాత ఈ కారు బాగా నచ్చినట్లు గణంకాలను చూస్తేనే తెలుస్తుంది.
గత నెలలో విజయవంతంగా అమ్మకాలను సాధించినప్పటికీ ఇది గత ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన సేల్స్‌తో పోలిస్తే, దాదాపు 1.17 శాతం స్వల్పంగా తగ్గుదల నమోదు చేసింది. అయితే ఈ రెండు కార్ల తర్వాత టిగువాన్ (Tiguan) పేలవమైన అమ్మకాలతో కంపెనీ పెట్టుకున్న ఆశలన్నీ కూడా తప్పేలా చేసింది. ఫిబ్రవరి 2025లో ఈ కారును కేవలం ఇద్దరు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం.

గత నెలలో ఫోక్స్‌వ్యాగన్ మొత్తం అమ్మకాల్లో టిగువాన్ రెండు కార్ల విక్రయాలతో మూడవ స్థానంలో నిలిచింది. ఇది గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే 98 శాతం గణనీయంగా పడిపోవడం గమనార్హం. ఏడాది ప్రాతిపదికన ఇది ఇంత భారీ క్షీణత నమోదు చేయడాన్ని బట్టి ఈ కారుకు ఆదరణ మార్కెట్లో ఏ మేరకు ఉందో హైలెట్ అవుతుంది. ఇది రూ.38.17 లక్షల(ఎక్స్ షోరూమ్) ధర నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ఈ కారుకు ఆదరణ భారీగా తగ్గిపోవడంపై కంపెనీ సైతం ఆలోచనలో పడింది. దీంతో మిగతా మోడళ్ల సేల్స్ పెంచడానికి తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. టిగువాన్ వంటి కొన్ని మోడళ్ల అమ్మకాలు క్షీణించినప్పటికీ కూడా మొత్తం అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 3 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయడం విశేషం. అయితే మొత్తంగా కలిసి కంపెనీ సేల్స్ పెంచడానికి వర్టస్ కారుది కీలక పాత్ర అని చెప్పాలి.

ఫోక్స్‌వ్యాగన్‌కు ఇండియాలో ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీగా పేరున్నప్పటికి తక్కువ మోడళ్లను మాత్రమే విక్రయిస్తుంది. ఈ కస్టమర్లు ఉన్న వాటి నుంచే తమకు నచ్చిన కారును కొనుగోలు చేయాల్సి ఉంది. అందుకే చాలా మంది వర్టస్, టైగన్ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మా డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం ఏమిటంటే, ఫోక్స్‌వ్యాగన్ మరిన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తే, సేల్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








