ఈ కారును కేవలం 5 మంది మాత్రమే కొన్నారు! ప్రజలు ఎందుకు దూరంగా ఉన్నారో తెలుసా?
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ (volkswagen) భారత్‌లో తన సేల్స్ పెంచుకోవడానికి తీవ్రంగా కష్టపడుతుంది. దాని ప్రసిద్ధ మోడల్ పోలో ద్వారా భారతీయుల మనసుల్లో బలంగా ఎదిగిన బ్రాండ్ క్రమంగా ఇతర మోడళ్ల ద్వారా అనుకున్నంత అమ్మకాలను సాధించలేకపోతుంది. ఫోక్స్‌వ్యాగన్ పోర్ట్‌ఫోలియోలోని కొన్ని మోడళ్లకు భారత మార్కెట్లో పెద్దగా స్పందన లభించడం లేదు. టైగన్, వెర్టస్ మోడళ్లకు స్థిరమైన అమ్మకాలు ఉన్నా, సంస్థలో అత్యంత ప్రీమియంగా ఉన్న టిగువాన్ (tiguan) SUV మాత్రం గట్టిగానే వెనుకబడుతోంది. 2025 జూన్ నెలలో విడుదలైన అమ్మకాల గణాంకాలు చూస్తే, ఈ విషయానికి బలం చేకూరుతోంది.
టిగువాన్ SUV ఈ నెలలో కేవలం 5 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది. ఏడాది క్రితం, అదే జూన్ 2024లో 85 యూనిట్లు అమ్ముడుపోగా, ఇప్పుడు 94 శాతం తగ్గుదలతో మార్కెట్లో వెనకబడింది. సేల్స్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. టిగువాన్ ధర ఇతర ప్రత్యర్థులతో పోలిస్తే మరింత పెరగడం, ప్రీమియం SUV విభాగంలో పోటీ పెరగడం, ఫీచర్ల పరంగా కొంత వెనుకబడటం వంటి అంశాలు వినియోగదారులను దూరం చేసేలా మారాయి.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ జూన్‌లో 5 యూనిట్లు మాత్రమే అమ్ముడవడం ద్వారా, ఈ SUV ఎంత క్లిష్ట స్థితిలో ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో కేవలం ఒకే వేరియంట్ ఎలిగాన్స్ రూపంలో మాత్రమే లభిస్తుంది, దీని ధర రూ.38.16 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరను చూసిన వినియోగదారులు షోరూమ్‌కి రాకుండానే వెనక్కి వెళ్లుతున్నారు. దీని కారణంగానే టిగువాన్ తక్కువ అమ్మకాలను నమోదు చేయడం గమనార్హం.
దీనికి తోడు, ఇటీవల ప్రవేశపెట్టిన టిగువాన్ R-Line పెర్ఫార్మెన్స్ వేరియంట్ మార్కెట్లో గణనీయంగా నిలబడలేకపోయింది. అధిక ధరకు వీటిని విక్రయించడం కారణంగా కస్టమర్లు ఇదే ధరలో ఇతర కంపెనీలకు చెందిన మోడళ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఫోక్స్‌వ్యాగన్ కూడా తనవైపు నుండి ప్రయత్నాలు మానట్లేదు. అమ్మకాలను పెంచెందుకు రూ.3 లక్షల వరకు డిస్కౌంట్/ఆఫర్లు అందిస్తోంది. ఆఫర్స్ చూసి కారును కొనుగోలు చేయడానికి వస్తారని ఆశించినప్పటికి కస్టమర్లు అంతగా ఆసక్తి కనబరచలేదు.

ఇంజిన్ పరంగా చూస్తే, టిగువాన్‌లో ఉన్న 2.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్ నిజంగా శక్తివంతమైనదే. ఇది 187 bhp పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన ఈ ఇంజిన్, హైవే డ్రైవింగ్‌కి సూపర్ రెస్పాన్సివ్ అనుభూతిని ఇస్తుంది. అంతా ఉన్నా, ఒక కారుకు మార్కెట్లో నిలబడేందుకు కేవలం శక్తివంతమైన ఇంజిన్ సరిపోదు. కస్టమర్ ఫ్రెండ్లీ ప్రైసింగ్, నెట్‌వర్క్ అంశాలు ముఖ్యంగా నిలుస్తున్నాయి.
ఈ SUVలో ప్రామాణికంగా 4MOTION ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది, ఇది ఫోక్స్‌వ్యాగన్‌కు ప్రత్యేకమైన సాంకేతికత. టర్బోచార్జ్డ్ 2.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్, ఈ AWD సిస్టమ్ కలయికతో, టిగువాన్ డ్రైవింగ్‌కు మంచి ట్రాక్షన్‌ను అందిస్తుంది. ఇది లీటరుకు 12.65 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలగడం గమనార్హం. ఇది పూర్తిగా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ కలిగి ఉంది.

ఇంకా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 30-కలర్ యాంబియంట్ లైటింగ్, సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి అత్యవసర భద్రతా ఫీచర్లతో ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మారుస్తుంది. దీనికి కొనసాగింపుగా వచ్చిన టిగువాన్ R-Line వేరియంట్ ఒక స్టైలిష్, శక్తివంతమైన మోడల్. ఇది 2.0-లీటర్ TSI టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా పని చేస్తుంది.
ఈ ఇంజిన్ 201 bhp పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది వినియోగదారుడికి రెండు ట్రాన్స్‌మిషన్ 7-స్పీడ్ DSG ఆటోమేటిక్, 6-స్పీడ్ మాన్యువల్‌లో లభిస్తుంది. ఈ కారును భారత్‌లోకి CBU (Completely Built Unit) రూపంలో దిగుమతి చేశారు, దాంతో ధర కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం ఇది రూ. 49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications