జనాలు ఈ కారును భారీగా కొంటున్నారు.. ఊహించని విధంగా ఒక్కసారిగా పెరిగిన కస్టమర్లు
ఒకప్పుడు, కార్ల మార్కెట్‌లో సెడాన్ (Sedan) అనే పేరు వినిపిస్తేనే ప్రజల్లో ఒక ప్రత్యేక ఉత్సాహం ఉండేది. సొగసైన డిజైన్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం, క్లాసీ లుక్ కారణంగా, సెడాన్ కార్లు ప్రతి కుటుంబం కలల వాహనాలుగా నిలిచాయి. కానీ సమయం మారింది. SUVల యుగం మొదలైంది. పెద్ద సైజ్, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, రోడ్ ప్రెజెన్స్ ఇవన్నీ SUVలకు భారీ డిమాండ్ తెచ్చాయి. దాంతో, చాలా మంది కస్టమర్లు సెడాన్‌లను మర్చిపోయి SUVల వైపు మళ్లారు. అయినా సరే, సెడాన్‌లు పూర్తిగా వెనుకబడ్డాయనే చెప్పడం తప్పుడు. SUVలు మార్కెట్‌ను ఆధిపత్యం వహిస్తున్నా, సెడాన్‌లకు తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది.
డ్రైవింగ్ కంఫర్ట్, బ్యాలెన్స్‌డ్ రైడ్, అద్భుతమైన రోడ్ స్టబిలిటీ విషయంలో SUVలు సెడాన్‌లతో పోటీ పడలేవు. అందుకే, ఇంకా అనేక మంది కస్టమర్లు సెడాన్‌లను ప్రేమతో కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Volkswagen India) ఈ వాస్తవాన్ని మరోసారి నిరూపించింది. కంపెనీకి చెందిన ప్రముఖ సెడాన్ వెర్టస్ (Virtus) మార్కెట్లోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తవుతున్నా, దాని డిమాండ్ మాత్రం తగ్గలేదు అని తెలుస్తుంది.

SUVల దూకుడును తట్టుకొని, వెర్టస్ ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్‌లలో ఒకటిగా నిలిచింది. ఇక ఈ మధ్యే వచ్చిన గణాంకాలు చూస్తే, ఫోక్స్‌వ్యాగన్ వెర్టస్ కొత్త నెలవారీ అమ్మకాల రికార్డును సృష్టించింది. కంపెనీ ప్రకారం, అక్టోబర్ 2025 నెలలోనే 2,453 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది ప్రారంభించినప్పటి నుండి వెర్టస్ సాధించిన అత్యధిక అమ్మకాల సంఖ్య. ఈ ఫలితంతో కంపెనీకి కొత్త ఉత్సాహం లభించింది.
ఈ విజయానికి కారణం కేవలం డిజైన్ మాత్రమే కాదు. వెర్టస్ అందించే ప్రీమియం ఇంటీరియర్స్, శక్తివంతమైన ఇంజిన్, జర్మన్ ఇంజినీరింగ్ నాణ్యత కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకించి, హైవే డ్రైవింగ్‌లో దీని స్టెబిలిటీ, హ్యాండ్లింగ్ సెడాన్ ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తోంది. SUVలు ఎంత ప్రాచుర్యం పొందినా, సెడాన్ కార్లకు ఉన్న స్థానం మాత్రం చెదరలేదు. వాటిని ఇష్టపడే వర్గం ఇంకా బలంగా ఉంది. వెర్టస్ సాధించిన ఈ రికార్డు దానికి నిదర్శనం.

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తమ ఇండియా 2.0 వ్యూహం కింద రెండు కీలక ఉత్పత్తులను టైగన్ SUV, వెర్టస్ సెడాన్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ రెండు మోడళ్లు భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడినవే. బలమైన లోకలైజేషన్ (స్థానికీకరణ)తో తయారైన ఈ వాహనాలు ఇప్పుడు దేశీయ మార్కెట్లో కొత్త మైలురాయిని చేరుకున్నాయి. కంపెనీ తాజా గణాంకాల ప్రకారం, టైగన్, వెర్టస్ కలిపి 1.60 లక్షల యూనిట్ల దేశీయ అమ్మకాలను దాటాయి.
ఈ రెండు వాహనాలు ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం రూపకల్పన చేయబడిన MQB-A0-IN ప్లాట్‌ఫామ్ మీద నిర్మించబడ్డాయి. వెర్టస్ విషయానికి వస్తే, ఇది కేవలం డిజైన్ పరంగానే కాకుండా టెక్నాలజీ, పనితీరులోనూ ప్రీమియం అనుభవం ఇస్తోంది. ప్రస్తుతం ఈ సెడాన్ ఐదు వేరియంట్లలో కంఫర్ట్‌లైన్, హైలైన్, టాప్‌లైన్, GT, GT ప్లస్‌లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. తాజాగా కంపెనీ వెర్టస్ ధరలను పెంచింది.

ప్రీమియం సెడాన్ అయిన ఈ కార్ ధర ఇప్పుడు రూ. 11.16 లక్షల నుండి రూ. 18.73 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉంది. ఇప్పటికే SUV మార్కెట్‌లో టైగన్ మంచి స్థానం సంపాదించగా, వెర్టస్ కూడా తన సొగసైన లుక్, శక్తివంతమైన ఇంజిన్, డ్రైవింగ్ కంఫర్ట్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ రెండు మోడళ్లు కలిపి ఫోక్స్‌వ్యాగన్‌కి భారత మార్కెట్లో తిరిగి పుంజుకునే శక్తిని ఇచ్చాయి.


Click it and Unblock the Notifications








