ఈ కార్లు కొన్న వారు జాగ్రత్త.. సీట్‌బెల్ట్‌లో సమస్య! దయచేసి వాటిని త్వరగా సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి
ప్రముఖ దిగ్గజ కార్ల తయారీదారులు ఫోక్స్‌వ్యాగన్, స్కోడా వేర్వేరు బ్రాండ్‌లుగా కనిపించినా, ఇవి ఒకే గ్రూపుకు చెందినవి. అయినప్పటికి విడివిడిగా తమ వాహనాలను విడుదల చేస్తుంటాయి. అందుకే స్కోడా కుషాక్- ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా స్లావియా - ఫోక్స్‌వ్యాగన్ వెర్టస్ వంటి కార్లు ఒకే ప్లాట్‌ఫామ్, ఒకే ఇంజిన్, ట్రాన్స్‌మిషన్‌ను పంచుకుంటూ ఉంటాయి. ఈ కార్లు Volkswagen India 2.0 ప్రాజెక్ట్ కింద రూపొందించబడ్డవే. మోడ్యూలర్ MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ నాలుగు కార్లు భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లోకలైజ్ చేయబడ్డాయి. అయితే, తాజాగా ఈ కార్లకు సంబంధించిన ఓ తయారీ లోపం కంపెనీ దృష్టికి వచ్చినట్లు అధికారికంగా వెల్లడించింది. దీంతో స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా కుషాక్, టైగన్, స్లావియా, వెర్టస్ కార్లను వెంటనే రీకాల్ చేసింది.
వాస్తవానికి, ఈ తరహా రీకాల్స్ ఆటో ఇండస్ట్రీలో అరుదైనవి కాదు. బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకోవడమే కాకుండా, వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేసే సంస్థలు ఇలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సాధారణం. స్కోడా - వోక్స్వ్యాగన్ గుంపు కూడా అదే దిశగా అడుగులు వేసింది. కార్లలో వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి వాటిని తిరిగి వెనక్కి రప్పించుకుంటుంది. దీని వలన కస్టమర్లకు మెరుగైన సేవలు అందడంతో పాటు కంపెనీపై నమ్మకం పెరుగుతుంది.

స్కోడా-ఫోక్స్‌వ్యాగన్ ఇండియా చేసిన రీకాల్, ఎమర్జెన్సీ స్థాయిలో ఉండకపోయినా, వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం. సీట్ బెల్ట్ సంబంధిత లోపం కారణంగా ఈ రీకాల్ చేయడం జరిగింది. ఈ లోపం తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, ప్రమాద సమయాల్లో ప్రయాణికుల భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, అందుకే స్కోడా-ఫోక్స్‌వ్యాగన్ ఇండియా కంపెనీ ముందస్తుగానే స్పందించింది.
ఈ రీకాల్‌కు గురైన మోడళ్లు ఏవంటే.. స్కోడా కుషాక్, స్లావియా, కైలాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, వర్టస్. ఈ వాహనాలు డిసెంబర్ 2021 నుంచి మే 2025 మధ్యకాలంలో తయారయ్యాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్ (SIAM) వెల్లడించిన గణాంకాల ప్రకారం, సుమారు 1,821 యూనిట్లు ఈ రీకాల్‌లో భాగమయ్యాయి. ఈ ఏడాది(2025) రెండోసారి రీకాల్ కావడం విశేషం. మే 2025లోనూ ఇదే మోడళ్లలోని కొన్ని యూనిట్లను రీకాల్ చేసింది.

కొన్ని కార్లలో వెనుక సీటు బెల్ట్‌ను పట్టే మెటల్ బేస్ ఫ్రేమ్‌లో పగుళ్లు ఏర్పడినట్టు గుర్తించారు. ఇది ఎడమ వైపు, కుడి వైపు సీట్లలో రెండింటిలోనూ కనిపించింది. ఈ లోపంతో ప్రమాద సమయంలో వెనుక సీట్ బెల్ట్ బకిల్ లాచ్ ప్లేట్ విరిగిపోయే అవకాశం ఉంది. మరికొన్నింటిలో సరైనవి కాని ముందు, వెనుక సీటు బెల్ట్ భాగాలను ఉపయోగించారు. అంటే ప్రమాద సమయాల్లో బెల్ట్ పనితీరు సరైన విధంగా ఉండకపోవచ్చు.
ఏదేమైనా, ఈ లోపాలను గుర్తించిన వెంటనే స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా సీరియస్‌గా స్పందించింది. సమస్యలు తీవ్రంగా ఉండకపోయినా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, ప్రభావితమైన అన్ని వాహనాలను ఉచితంగా సర్వీస్ చేసి యజమానులకు తిరిగి అందించనున్నట్లు ప్రకటించింది. ఇది సాధారణ రీకాల్ విధానంలో భాగమే. అయితే, ఈ సందర్భంగా కంపెనీ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది.

సమస్య ఉన్న వాహన యజమానులను స్వయంగా సంప్రదించి, రికాల్ ప్రక్రియను నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎటువంటి అవగాహన లోపం జరగకుండా వారు నేరుగా కారు యజమానులకు సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఇక తమ కారు రీకాల్‌లో ఉందో లేదో తెలుసుకోవాలనుకునే వారు, సంబంధిత బ్రాండ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి, తమ వాహనం గుర్తింపు సంఖ్య (VIN)ను నమోదు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా కారు రీకాల్ జాబితాలో ఉందో లేదో తేలుతుంది.


Click it and Unblock the Notifications