ఎలక్ట్రిక్ వాహనాల ఎఫెక్ట్‌తో పెట్రోల్ కార్ల పరిస్థితి ఏంటి? ఇవి ఇక కనుమరుగవుతాయా?
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఇంధన ఆధారిత వాహనాలను తగ్గించుకుని ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ, పెట్రోల్, డీజిల్ కార్లు అంటే స్టేటస్, స్పీడ్, సౌండ్ అన్నీ కలగలసిన అనుభూతి. ఇంజిన్ స్టార్ట్ చేయగానే రయ్ మంటూ సౌండ్ చేసుకుంటూ దూసుకుపోయే కాలం, క్రమంగా కనమరుగు అయ్యే అవకాశం ఇప్పుడు ఏర్పడింది. ఎలాంటి సౌండ్ లేకుండా ఒక్క సారి ఛార్జ్ చేస్తే కొన్ని వందల కి.మీలు ఎక్కడా ఆగకుండా ప్రయాణించే వాహనాలు ప్రస్తుతం మార్కెట్లో విరివిగా లాంచ్ అవుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడేవారు. తమ ఆలోచన ధోరణిని మార్చుకుని ఈవీల వైపే మొగ్గుచూపుతున్నారు. ప్రారంభంలో బ్యాటరీ సమస్యలు ఎక్కువగా వచ్చినప్పటికి ఇప్పుడు సాంకేతికత మరింత అభివృద్ది చెందడంతో అధునాతన, నాణ్యత కలిగిన బ్యాటరీలు వస్తున్నాయి.
ఈవీలో అంతర్గతంగా వచ్చే సమస్యలు తగ్గుముఖం పట్టడంతో జనాలకు వీటిపై నమ్మకం ఏర్పడి, ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భారతదేశంలో కూడా ఇటీవలి కాలంలో ఆటో పరిశ్రమలో మార్పులు వస్తున్నాయి. ప్రపంచంలోనే ఇండియాలో ఆటోమొబైల్ పరిశ్రమకు మంచి అవకాశాలు ఏర్పడటంతో అంతర్జాతీయ కంపెనీలు పోటా పోటీగా తమ పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేసి లోకల్‌గా ఈవీలను విక్రయిస్తూనే, విదేశాలకు సైతం ఎగుమతులు చేస్తున్నారు.

భారత్‌లో ప్రస్తుతం ఈవీల వాడకం బాగానే పెరిగింది. ఈవీ విభాగంలో ముందు స్థానంలో ఉండే టాటా మోటార్స్ పలు కీలక మోడళ్లను విక్రయిస్తుంది. హ్యుందాయ్, కియా మోటార్స్, మహీంద్రా వంటి తయారీదారులు ఒకవైపు ఐసీఈ ఆధారిత మోడళ్లను విడుదల చేస్తూనే, మరోవైపు ఈవీలను కూడా లాంచ్ చేస్తున్నారు. ఈ కంపెనీలు ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కీలకంగా మారుతీ సుజుకీ మాత్రం వెనకబడి ఉంది. కానీ ఇప్పుడు అది ఈవీలపై ఫోకస్ చేసింది.
అయితే ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న టైంలో, ఇంధన వాహనాల పరిస్థితి ఎలా ఉంటుందా? త్వరలోనే ఇవి కనిపించకపోవచ్చు అని చాలా మంది ఆలోచనలో పడ్డారు. కానీ, నిజానికి, ఈ రెండు కొంతకాలం పాటు కలసే ముందుకు సాగనున్నాయి. ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ పన్ను రాయితీలు, ఛార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలను వేగంగా అందుబాటులోకి తెస్తున్నాయి. దీంతో కొత్తగా కార్లు కొనే వారు EVల వైపు మొగ్గు చూపుతున్నారు.

అయితే భారతదేశం వంటి దేశాల్లో ఇంకా చాలా మంది మంది యూజర్లు పెట్రోల్ కార్లపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతంగా EVలు కొన్ని పరిమితులలో ఉన్నాయి.. రేంజ్, ఛార్జింగ్ సమయం, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలు చాలామందికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పెట్రోల్ కార్లు అధికంగా వినియోగంలో ఉంటాయి. పరిశ్రమలో మాత్రం వాతావరణ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పెద్ద ఆటో తయారీదారులు 2030-35 నాటికి తాము పూర్తి గా EVలకు మారి పోతామని ప్రకటిస్తున్నారు. దాంతో, నెమ్మదిగా ఇంధన ఆధారిత ఉత్పత్తి తగ్గుతుంది. మిగిలేది వాడిన కార్ల మార్కెట్ మాత్రమే. భారతదేశం లాంటి పెద్ద దేశంలో మార్పు ఎప్పుడూ కాస్త నెమ్మదిగానే ఉంటుంది. ఇప్పటికి లక్షలాది మంది పెట్రోల్ కార్లను నమ్ముకుని ప్రయాణిస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్లు అన్ని చోట్ల లేవు. చాలామందికి ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం కూడా లేదు.

వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుంటే, ఇంధన ఆధారిత వాహనాలను ఇంకా కొన్ని సంవత్సరాలు రోడ్లపై మెరుస్తూనే ఉంటాయి. కానీ ఒకవేళ మీరు కొత్తగా కారు కొనాలనుకుంటే, ఈ ప్రశ్న తప్పక వస్తుంది .. ఇదే చివరి పెట్రోల్ కారు కావచ్చా? ఎందుకంటే, తయారీదారులు ఇప్పటికే గేమ్‌ను మార్చేస్తున్నారు. టయోటా, హ్యూందాయ్, మారుతి, టాటా.. ఒక్కో ఎలక్ట్రిక్ మోడల్‌ను బజార్‌లోకి తెస్తున్నారు. 2030 నాటికి చాలా కంపెనీలు పూర్తిగా ఎలెక్ట్రిక్ వైపు మళ్లిపోతున్నాయి.
ఇంకా ఒక విషయం.. పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీన్ని చూసిన యువత ఈ కాలంలో ఈవీ వాహనాల వైపే చూస్తున్నారు. ఇంధన వాహనాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. రేపటి కాలంలో ఇవి మనలో ఎన్నో జ్ఞాపకాల్ని తలపెట్టించే వాహనాలుగా మిగిలిపోతాయి. పాత యమహా RX100 మాదిరిగా, ఇవీ ఓ సమయంలో రోడ్లపై దంచికొట్టేవి అని చెప్పే రోజులు వస్తాయేమో!


Click it and Unblock the Notifications








