మార్కెట్లోకి అఫిషియల్‌గా ఎంట్రీ ఇచ్చిన టెస్లా.. ఆ విషయంలో అమెరికా, చైనాలను వెనక్కి నెట్టిన ఇండియా
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, ఎట్టకేలకు భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ అయిన టెస్లా మోడల్ వైని భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ కారు రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే, భారత్‌లో దీని ధరలు అమెరికా, చైనా, జర్మనీతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం టెస్లా మోడల్ వై కార్లు రెండు వేరియంట్లలో లభిస్తున్నాయి. మోడల్ వై రియర్-వీల్ డ్రైవ్ బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.59.89 లక్షల నుంచి మొదలవుతుంది. అలాగే లాంగ్ రేంజ్ RWD వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.67.89 లక్షలుగా నిర్ణయించారు. ఈ కార్లను చైనాలోని షాంఘై గిగాఫ్యాక్టరీ నుంచి పూర్తిగా తయారైన యూనిట్లుగా దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం, రూ.22,220 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

భారతదేశంలో టెస్లా కార్ల ధరలు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం అధిక దిగుమతి సుంకాలు, లాజిస్టిక్స్ ఖర్చులు. అమెరికాలో మోడల్ వై ప్రారంభ ధర 44,990డాలర్లు (సుమారు రూ.38.63 లక్షలు). చైనాలో 263,500 యువాన్ (సుమారు రూ.31.57 లక్షలు), జర్మనీలో 45,970 యూరోలు (సుమారు రూ.46.09 లక్షలు)గా ఉంటుంది.
కానీ భారతదేశంలో, ఆన్-రోడ్ ధరలు రూ.61.07 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు. 18% GSTతో పాటు, రూ.50,000 అడ్మినిస్ట్రేటివ్, సర్వీస్ ఛార్జీలు అదనంగా కూడా ఉంటాయి. దీనివల్ల కారు ధర గణనీయంగా పెరుగుతుంది.

టెస్లా మోడల్ వై రెండు వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లు, 2 ఇంటీరియర్ ట్రిమ్‌లతో అందుబాటులో ఉంది. RWD వేరియంట్‌లో 60 kWh లేదా 75 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. 60 kWh వెర్షన్ ఒకే ఛార్జ్‌పై సుమారు 500 కి.మీ WLTP రేంజ్ ఇస్తుంది. లాంగ్ రేంజ్ వేరియంట్ 622 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.
కారులో 15.4 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, వెనుక సీట్ల కోసం 8 అంగుళాల డిస్‌ప్లే, ప్రీమియం సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్, ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, స్టీరింగ్ కాలమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 19 అంగుళాల క్రాస్‌ఫ్లో వీల్స్, పవర్డ్ రియర్ లిఫ్ట్‌గేట్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.

ముంబై తర్వాత, టెస్లా త్వరలో న్యూఢిల్లీలో కూడా షోరూం తెరవడానికి రెడీ అవుతుంది. ఆ తర్వాత బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై వంటి నగరాలలో కూడా షోరూంలను ప్రారంభించనుంది. మోడల్ వై తర్వాత, టెస్లా మోడల్ ఎస్, మోడల్ 3, మోడల్ ఎక్స్, సైబర్‌ట్రక్ వంటి మరిన్ని కార్లను కూడా భారత మార్కెట్‌కు తీసుకురావాలని యోచిస్తోంది.
టెస్లా ఎంట్రీ భారత ఈవీ మార్కెట్‌కు ఒక ముఖ్యమైన మైలురాయి. అయితే, అధిక ధరలు దీని విజయానికి ఒక సవాలుగా మారవచ్చు. భవిష్యత్తులో భారత ప్రభుత్వం పన్నులు తగ్గిస్తే లేదా టెస్లా ఇక్కడే తయారీని ప్రారంభిస్తే, ఈ ధరలు తగ్గే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








